కొర‌క‌రాని కొయ్యను తెచ్చుకున్న జ‌గ‌న్ స‌ర్కార్‌

అన‌వ‌స‌రంగా కొర‌క‌రాని కొయ్య‌ను తెచ్చుకున్నామ‌నే ఆవేద‌న జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ఉంది. ఏం చేద్దామ‌న్నా నిబంధ‌న‌లు ప్ర‌భుత్వ చేతులు క‌ట్టేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అత‌న్ని భ‌రించ‌డం త‌ప్ప‌, చేయ‌గ‌లిగేదేమీ లేద‌నే నిరాశ‌నిస్పృహ‌లో ప్ర‌భుత్వం ఉంది. త‌న‌కు…

అన‌వ‌స‌రంగా కొర‌క‌రాని కొయ్య‌ను తెచ్చుకున్నామ‌నే ఆవేద‌న జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ఉంది. ఏం చేద్దామ‌న్నా నిబంధ‌న‌లు ప్ర‌భుత్వ చేతులు క‌ట్టేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అత‌న్ని భ‌రించ‌డం త‌ప్ప‌, చేయ‌గ‌లిగేదేమీ లేద‌నే నిరాశ‌నిస్పృహ‌లో ప్ర‌భుత్వం ఉంది. త‌న‌కు రాజ్యాంగం అండ‌గా ఉంద‌ని, ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌నే భ‌రోసాతో ఆయ‌న చెల‌రేగిపోతున్నారు. ప్ర‌భుత్వానికి నేరుగానే స‌వాల్ విసురుతున్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ముప్పుతిప్ప‌లు పెడుతున్న ఆయ‌నే ఎస్సీ క‌మిష‌న్ చైర్మ‌న్ విక్ట‌ర్ ప్ర‌సాద్‌.

ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్‌ను రాత్రికి రాత్రే తొల‌గించిన జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి, తానే నియ‌మించిన వ్య‌క్తి ఎదురు తిరుగుతార‌ని క‌ల‌లో కూడా ఊహించ‌లేదు (నిమ్మ‌గ‌డ్డ కోర్టుకెళ్లి తిరిగి ఆ ప‌ద‌విలో కొన‌సాగారు). తిరిగి అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వాన్ని నిమ్మ‌గ‌డ్డ ఇబ్బంది పెట్టిన దాఖ‌లాలు లేవు. కానీ విక్ట‌ర్ ప్ర‌సాద్ మాత్రం ప్ర‌భుత్వానికి చుక్క‌లు చూపుతున్నారు. ఇదంతా పైకి పెద్ద‌గా క‌నిపించ‌లేదు. తాజాగా విక్ట‌ర్ ప్ర‌సాద్ ఏపీ ప్ర‌భుత్వానికి హెచ్చ‌రిక‌లు పంపారు. త‌న‌ను కెలికితే ‘మరో అమలాపురం’ సృష్టిస్తా!’ అని తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఇంకా ఆయ‌న సొంత ప్ర‌భుత్వంపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

తిరుప‌తి జిల్లా స‌త్య‌వేడు మండ‌లం మ‌ద‌నంబేడులో త‌మిళ‌నాడు నేత తిరుమాళ‌వ‌న్‌తో క‌లిసి అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో విక్ట‌ర్ మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన 41సీని ర‌ద్దు చేయాల‌ని పోరాడుతున్న‌ట్టు చెప్పారు. ఈ పోరాటంలో త‌న‌కు ఎమ్మెల్యేలు, ఎంపీలు అడ్డు త‌గులుతున్నార‌న్నారు.

అంత‌టితో ఆయ‌న ఆగ‌లేదు. ఎస్సీ క‌మిష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి త‌న‌ను త‌ప్పించాల‌ని చూస్తున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కానీ ఈ ప‌ద‌వి దీంతో స‌మాన‌మంటూ వెంట్రుకల‌ను చూపి, ప‌రోక్షంగా అధికార పార్టీకి, ప్ర‌భుత్వానికి హెచ్చ‌రిక పంపారు. తాను ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌న‌ని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీల‌కు న్యాయం చేసేందుకు ఎలాంటి వారిపైనైనా పోరాటానికి సిద్ధ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఎలాంటి వారిపైనైనా అంటే సీఎం మొద‌లుకుని, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల‌ను దృష్టిలో పెట్టుకుని ఘాటు వ్యాఖ్య‌లు చేశార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.  

మాజీ మంత్రి పేర్ని నాని సిఫార్సుతో ప్ర‌భుత్వం ఎస్సీ క‌మిష‌న్ చైర్మ‌న్‌గా విక్ట‌ర్ ప్ర‌సాద్‌ను నియ‌మించింది. ఇది రాజ్యాంగ ప‌ద‌వి. దీంతో ప‌ద‌వి నుంచి తొల‌గించే అధికారం ప్ర‌భుత్వానికి వుండ‌దు. ద‌ళితుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప‌ని చేస్తే ఫ‌ర్వాలేద‌ని, విక్ట‌ర్ ప్ర‌సాద్ ప‌రిధి దాటి మాట తూలుతున్నార‌నే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన నేత‌లు, ఉన్న‌తాధికారుల నుంచి విక్ట‌ర్ ప్ర‌సాద్‌పై ఫిర్యాదులు వెళుతున్న‌ట్టు స‌మాచారం. కాస్త చూసుకుని వెళ్ల‌వ‌య్యా అని నాని చెబుతున్నా, విక్ట‌ర్ పెడ‌చెవిన పెడుతున్నార‌ని స‌మాచారం.

ప‌ద‌వి నుంచి త‌న‌ను త‌ప్పించాల‌ని బ‌హిరంగంగా విక్ట‌ర్ ప్ర‌క‌టించారంటే, అంత‌ర్గ‌తంగా ఏ స్థాయిలో సంఘ‌ర్ష‌ణ జ‌రుగుతుంటుందో అర్థం చేసుకోవ‌చ్చ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అస‌లు ఆయ‌న్ను త‌ప్పించాల‌ని ఎవ‌రు ప్ర‌య‌త్నిస్తారు? ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అస‌లు ఆ మాటే ఎత్త‌దు. పైగా విక్ట‌ర్ ప్ర‌సాద్ లాంటి వాళ్లు వుండాల‌ని కోరుకుంటుంది. ఇక ఆ అవ‌స‌రం ఎవ‌రికి ఉందంటే అధికార ప‌క్షానికే అని జ‌వాబు వ‌స్తోంది. 

త‌న‌ను త‌ప్పించాల‌నే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌నే ఒత్తిడితో విక్ట‌ర్ ప్ర‌సాద్ చెల‌రేగిపోతున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కానీ ద‌ళితుల కోసం విక్ట‌ర్ ప్ర‌సాద్ ప‌ని చేస్తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఆయ‌న నిజాయ‌తీని ఎవ‌రూ శంకించ‌లేరు. అయితే వివాద‌మంతా రాజ‌కీయ ప‌ర‌మైందే. ప్ర‌భుత్వంపై విక్ట‌ర్ ప్ర‌సాద్ నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్నారు. ఏదో ఒక‌రోజు ఆయ‌న ప్ర‌భుత్వంపై మ‌రింత నేరుగా విమ‌ర్శ‌లు గుప్పించే అవ‌కాశం ఉంది. చివ‌రికి ఈ వ్య‌వ‌హారం ఎక్క‌డికి దారి తీస్తుందో!

సొదుం ర‌మ‌ణ‌