‘టెన్త్ ఫెయిల్’ పై సిగ్గులేని రాజకీయాలు!

టెన్త్ పరీక్షల విషయంలో విపక్షాలు సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నాయి. ఏదో లోకోద్ధారకుడిలాగా నారా లోకేష్ ఒక జూమ్ సమావేశం ఏర్పాటు చేయడం.. అందులో కొడాలి నాని, వంశీ జాయిన్ కావడం.. ఆ విషయాన్ని నానా…

టెన్త్ పరీక్షల విషయంలో విపక్షాలు సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నాయి. ఏదో లోకోద్ధారకుడిలాగా నారా లోకేష్ ఒక జూమ్ సమావేశం ఏర్పాటు చేయడం.. అందులో కొడాలి నాని, వంశీ జాయిన్ కావడం.. ఆ విషయాన్ని నానా రాద్ధాంతం చేసి.. అక్కడికేదో తెలుగుదేశం విద్యార్థిలోకానికి చేయదలచుకున్న మేలును వైసీపీ అడ్డుకున్నట్లుగా తెలుగుదేశం నాయకులందరూ యాగీ చేస్తున్నారు.

ఇప్పుడు ఈ విషయాన్ని తెలుగుదేశం నాయకుడు నక్కా ఆనంద్ బాబు మళ్లీ రాజకీయం చేస్తున్నారు. జగన్ మెప్పుకోసమే వారిద్దరూ జూమ్ కాల్ లోకి వచ్చారనేది ఆయన ఆరోపణ. జూమ్ లోకి వస్తే.. జగన్ ఎందుకు మెచ్చుకుంటారో అర్థం కాని సంగతి. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి లోకేష్ ఆ జూమ్ మీటింగ్ పెడితే.. దానిని వారు డిస్టర్బ్ చేసినట్టుగా చెబుతున్నారు. 

తెలుగుదేశం పార్టీ నాయకులు టెన్త్ రిజల్ట్స్ మీద సిగ్గులేని రాజకీయం చేస్తున్నట్లుగా చాలా స్పష్టంగానే అర్థం అవుతోంది. జులై మొదటి వారంలో ప్రభుత్వం టెన్త్ ఫెయిలైన వారికి ఇన్స్టంట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తోంది. రిజల్ట్ వచ్చిన నాటినుంచి సుమారు నెలన్నర వ్యవధి వారికి ఉంది. ఒకటిన్నర నెలల వ్యవధిలో విద్యార్థులు మొత్తం ఆరు సబ్జెక్టులు ఫెయిలయి ఉన్నా కూడా శ్రద్ధగా చదివి మళ్లీ పాస్ కావడానికి అవకాశం ఉంది. కానీ.. ఆ దిశగా ఎవ్వరూ మాట్లాడ్డం లేదు. 

టెన్త్ విద్యార్థులు ఫెయిల్ కావడానికి జగన్ సరిగా చదవకపోవడమే కారణం అన్నట్లుగా నానా చెత్తా వాగుతున్న టీడీపీ, జనసేన నాయకులకు.. నిజంగా విద్యార్థుల మీద అంతగా వల్లమాలిన ప్రేమ ఉంటే గనుక.. జులై లో జరిగే పరీక్షలు సాంతం పూర్తయ్యే వరకు వారికి ఆయా సబ్జెక్టుల్లో శిక్షణకు క్లాసులు నిర్వహించవచ్చు కదా! రిటైర్డు టీచర్లతో కోచింగ్ క్లాసులు నిర్వహిస్తే.. విద్యార్థులు ఈ నెలరోజులు శ్రద్ధగా ఫెయిలైన సబ్జెక్టు చదువుకుని దానిని పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా.. రాజకీయం చేయడం ద్వారా.. ప్రభుత్వం మీద బురద చల్లడం ఒక్కటే వీరి లక్ష్యంగా కనిపిస్తోంది. 

మామూలుగా ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేస్తుంటాయి. ఎక్కడైనా ఒక మరణం సంభవిస్తే చాలు.. వెంటనే ఆ విషయాన్ని రాజకీయం చేసి ప్రభుత్వం మీద బురద చల్లుతుంటాయి. ఇప్పుడు టెన్త్ ఫలితాల విషయంలో వారి సిగ్గుమాలిన రాజకీయాలు కూడా అదే తీరుగా ఉన్నాయి. 

పిల్లలు ఫెయిల్ కావడమే తమకు మహాద్భుతమైన సువర్ణావకాశం అన్నట్లుగా రాజకీయానికి వాడుకుంటున్నాయి తప్ప.. విద్యార్థుల బాగు కోసం వారు వీసమెత్తు కూడా ఆలోచించడం లేదు. ఈ సిగ్గుమాలిన రిజల్ట్స్ రాజకీయాలు మానుకుని.. వారు విద్యార్థుల భవిష్యత్తుకోసం ఆలోచిస్తే బాగుంటుంది.