అన్నమయ్య జిల్లా రాజంపేట జనసేన నాయకురాలు పత్తిపాటి కుసుమకుమారి టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఈమె 2019 ఎన్నికల్లో రాజంపేట నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అంతకు ముందు ఆమె టీడీపీలో క్రియాశీలక నాయకురాలు. కడప జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలిగా సమర్థవంతంగా పని చేశారు.
సభ్యత, సంస్కారానికి ప్రతీకగా నడుచుకున్నారు. ప్రత్యర్థులపై విధానాల పరంగా మాత్రమే విమర్శలు చేసేవారు. అప్పటి టీడీపీ నాయకుడు, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్‌రెడ్డితో ఆమెకు విభేదాలుండేవి. మేడా మల్లికార్జున్‌రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరిన నేపథ్యంలో, రాజంపేట టికెట్‌ను ఆశించారు.
చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కుసుమకుమారికి అప్పట్లో చంద్రబాబు టికెట్ హామీ కూడా ఇచ్చారని ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో రైల్వేకోడూరుకు చెందిన బత్యాల చెంగల్రాయుడిని రాజంపేటలో నిలపాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. దీంతో ఆమె మనస్తాపం చెందారు. జనసేనలో చేరి ఆ పార్టీ తరపున రాజంపేట నుంచి పోటీ చేశారు.
కానీ బలిజ సామాజిక వర్గానికి చెందిన బత్యాల వైపే ఆ సామాజిక వర్గం నిలిచింది. పత్తిపాటికి కేవలం 2,376 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె తిరిగి మాతృ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని సమాచారం.
టీడీపీలో తనకున్న పాత పరిచయాల దృష్ట్యా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం రాష్ట్రం తిరోగమన దిశలో ప్రయాణిస్తోందని, చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడి నాయకత్వం ఎంతైనా అవసరమని కుసుమకుమారి భావన.