2024లో టీడీపీకి అధికారంపై ఆంధ్రజ్యోతి -ఏబీఎన్ ఎండీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్కే తన భయాన్ని బయట పెట్టుకున్నారు. ఇటీవల పొత్తుపై ఆప్షన్లు పెట్టిన పవన్‌కల్యాణ్‌పై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడమా లేక మరోసారి జగన్‌కే అప్పగించడమా? అనే ఆప్షన్లను పవన్ ముందు ఆర్కే పరోక్షంగా పెట్టారు.
ఆంధ్రజ్యోతి -ఏబీఎన్ ఎండీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్కే ప్రతి వారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను టార్గెట్ చేస్తూ కథనాలను వండుతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ వారం కూడా ఇందుకు భిన్నంగా లేదు. కాకపోతే ఇవాళ్టి కథనంలో కాస్త చంద్రబాబు, టీడీపీ శ్రేణుల్ని హెచ్చరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌లాగే, నాడు సీఎం పదవిలో చంద్రబాబు కలల్లో విహరించారని ఆర్కే కలం నుంచి జాలువారడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
వైఎస్ జగన్ అంత సులువుగా అధికారాన్ని వదులుకోరనే కఠిన నిజాన్ని ఆర్కే చెప్పడం గమనార్హం. ప్రతి వారం జగన్‌ను తిట్టడమే ఎజెండాగా సాగే కొత్త పలుకులో ఈ దఫా కొన్ని చేదు నిజాలకు చోటు దక్కింది.
‘తెలుగుదేశం పార్టీలో సంస్థాగత బలహీనతలు ఇప్పటికీ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతే తమను అధికారంలోకి తీసుకువస్తుందని అనుకోవడం పొరపాటే. జిల్లాల్లో ఇప్పటికీ అందరినీ కలుపుకొనివెళ్లే నాయకత్వం లేదు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే నాయకులు, శాసనసభ్యులు సమష్టిగా ఏకతాటిపై నిలుస్తూ పార్టీని నిలబెట్టారు. మిగతా జిల్లాల్లో ఈ పరిస్థితి లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు’
‘అప్పట్లో పార్టీ కార్యకర్తల గోడు వినడానికి చంద్రబాబు సమయం ఇచ్చేవారు కాదు. ఇప్పుడు కూడా మూడేళ్లు దాటినా జగన్మో హన్ రెడ్డి పార్టీ కార్యకర్తలను కలుసుకోవడానికి ఇష్టపడటం లేదు. అధికారంలో ఉన్నవారికి అంతా పచ్చగానే కనిపిస్తుంది. తాము చేసేదంతా ‘రైట్ రైట్’ అని ముఖ్యమంత్రులకు అనిపిస్తుంది కాబోలు… అందుకే నాడు చంద్రబాబునాయుడు అయినా, నేడు జగన్మోహన్ రెడ్డి అయినా వాస్తవాలు వినడానికి ఇష్టపడటం లేదు’
‘ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంత తేలికగా అధికారాన్ని వదులుకొనే రకం కాదు. తెలుగుదేశం నాయకులు ఈ విషయం గుర్తుంచుకోవాలి’
ఈ మాత్రం నిష్పాక్షిక విశ్లేషణ ఆర్కే ఆర్టికల్‌లో చూడక ఎన్నేళ్లైందో. మూడేళ్లకు ముందు ఇలాంటి హితవు చంద్రబాబుకి ఆర్కే చెప్పి వుంటే, టీడీపీ ఘోరంగా దెబ్బతిని వుండేది కాదేమో. బాబు పాలనలో తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపి వుంటే ఆయన సరిదిద్దుకునే వారేమో! తాజా వ్యాసంలో… ప్రజల్లో మన ప్రభుత్వం పట్ల 70 శాతం పైగా సానుకూలత ఉందని పార్టీ సమావేశాల్లో చంద్రబాబు చెప్పేవారని, దీనికి మద్దతుగా ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబు పార్టీ నాయకులకు సర్వే వివరాలూ, గణాంకాలూ వివరించేవారని ఆర్కే రాసుకొచ్చారు.
చంద్రబాబుని ఆరాధించే మీడియాధిపతిగా తాను చేసిందేంటో ఆర్కే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చంద్రబాబు చెప్పిందానికి తన చానల్‌లో ఆన్‌లైన్ ఓటింగ్ అంటూ ….80-90 శాతం పాజిటివ్‌గా ఉందని అధినేతను మభ్యపెట్టింది నిజం కాదా? చంద్రబాబు పతనంలో తిలా పాపం తలా పిడికెడు అనే చందంగా, తన పాత్ర కూడా ఉందని ఆర్కే గుర్తించాలి. కనీసం ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు వుందనగా, టీడీపీ సంస్థాగత లోపాల గురించి ఆర్కే ప్రస్తావించడం అభినందనీయం.
ఇక పవన్‌కల్యాణ్ విషయానికి వస్తే ఆర్కే చాలా కోపంగా ఉన్నట్టు ఆయన రాతలు చెబుతున్నాయి. పవన్ మూడు ఆప్షన్లు ఆర్కేని హర్ట్ చేశాయి. పవన్ కేవలం ఒక సామాజిక వర్గ నాయకుడే అని ప్రజల మాటగా చెప్పి, చావు దెబ్బ తీశారు. అలాగే పొత్తు లేకపోతే టీడీపీకి అధికారం అనుమానమే అని ఆర్కే చెప్పకనే చెప్పారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని స్పష్టంగా ప్రకటిస్తూనే తన ముందు మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని పవన్ కల్యాణ్ ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందని ఆర్కే పేర్కొన్నారు. ‘మా షరతులకు అంగీకరిస్తేనే పొత్తులు’ అని ప్రారంభంలోనే ప్రకటించి ఉండాల్సిందని ఆర్కే చెప్పారు. మొదట్లో ఓట్లు చీలకూడదని ప్రకటించి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కావాలని షరతులు పెట్టడం ఏంటని ఆర్కే నిలదీశారు. ఇలాంటి ప్రకటన వల్ల జనసేన పార్టీకే నష్టమని ఆర్కే హెచ్చరించారు. ‘డబ్బులు ఎవరికీ ఊరకే రావు’ అన్నట్టుగా ముఖ్యమంత్రి పదవి అంటే అంత తేలిక కాదని గుర్తించుకోవాలని పవన్‌కల్యాణ్‌కు ఆర్కే హితవు చెప్పారు.
అంటే రాజకీయాల్లో నువ్విప్పుడు పొడుస్తున్నదేదీ లేదని ఆర్కే పరోక్షంగా చెప్పారు. అలాగే ఇప్పటికీ పవన్ పార్ట్ టైం పొలిటీషియన్‌గా ఉన్నారని ఇదే ఆర్టికల్‌లో గుర్తు చేశారు. మరో కీలక కామెంట్ … జనసేన అంటే ఒక సామాజిక వర్గానికి పరిమితం అన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని చెప్పడం ద్వారా… ఆ సామాజిక వర్గం ఓట్ల కోసమే టీడీపీ పవన్ మద్దతు కోరుకుంటోందని మనసులో మాట బయట పెట్టారు. సొంత సామాజిక వర్గం తప్ప, మిగిలిన సామాజిక వర్గాలు ఆదరించవనే హెచ్చరికను కూడా ఆర్కే పంపారు. అయితే ఆర్కే అభిప్రాయాల్ని కొట్టి పారేయాల్సిన పనిలేదు. ఇంత కాలం ఇలాంటి నిప్పులాంటి నిజాలేవీ చెప్పకుండా, ప్రతిపక్షాలను ఆర్కే మోసగిస్తూ వచ్చారనే అభిప్రాయాలున్నాయి.
వ్యాసం చివరికొచ్చే సరికి ఆర్కేలోని చంద్రబాబు మనిషి బయటికొచ్చారు. పవన్‌కల్యాణ్ మూడు ఆప్షన్లను తెరపైకి తెచ్చినా టీడీపీ నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడాన్ని ఆర్కే ప్రస్తావించారు. పవన్ తనకు తానుగా పొత్తుల గురించి ప్రస్తావించినా టీడీపీ స్పందించలేదంటే, జనసేనానిని ప్రధాన ప్రతిపక్షం అవమానిస్తోందని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోందని ఆర్కే చెప్పుకొచ్చారు. తన చానల్‌లోనే జనసేన బలంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ఆర్కే మరిచినట్టున్నారు. 137 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తే, 16 చోట్ల మాత్రమే ఆ పార్టీకి డిపాజిట్లు దక్కినట్టు ఎల్లో చానళ్ల వేదికగా టీడీపీ దారుణ వ్యాఖ్యలు చేసిన సంగతి ఆర్కేకి తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది.
జనసేనను టీడీపీ అవమానిస్తోందని పవన్‌ను రెచ్చగొట్టే వ్యూహం వెనుక వైసీపీ భయం ఉందని ఆర్కే అభిప్రాయం. ‘దీన్నిబట్టి పొత్తులు కుదిరితే తమ అధికారానికి అంతిమ ఘడియలు సమీపించినట్టు వైసీపీ నాయకులు భయపడుతున్నట్టేగా! చూద్దాం… ఏం జరగనుందో’ అని ఆర్కే ముగించారు.
ఇక్కడే ఆర్కే తన భయాన్ని బయట పెట్టుకున్నారు. ఈ వాక్యాలను చదివితే భవిష్యత్‌లో టీడీపీకి అధికారం దక్కడంపై ఆర్కే ఎంతగా భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
‘పవన్ కల్యాణ్ తెలుసుకోవాల్సింది ఒక్కటే! ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి కావడమా? లేక జగన్‌ను ఇంటికి పంపడమా? తన ప్రాధాన్యత ఏమిటో తను తెలుసుకోవాలి’ అని పవన్‌కు ఆర్కే అల్టిమేటమ్ ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదే పవన్‌కల్యాణ్ బీజేపీని రోడ్ మ్యాప్ అడితే మాత్రం… ఇదే వ్యాసంలో ‘రాష్ట్రంలో బీజేపీ బలంతో పోల్చితే జనసేన బలమే ఎక్కువ. అలాంటప్పుడు జనసేన నిర్ణయంకోసం బీజేపీ ఎదురు చూడాలి కానీ, బీజేపీ నిర్ణయం కోసం జనసేన ఎదురు చూడటం ఏమిటి?’ అని ఆర్కే నిలదీశారు.
పవన్‌కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలనే కోరికను చంపుకుని, జగన్‌ను ఇంటికి పంపడంపై దృష్టి పెట్టాలని ఆర్కే హితవు చెప్పారు. తద్వారా చంద్రబాబును సీఎం పీఠంపై కూచోపెట్టాలని సూచించారు. 40 శాతం ఓటు బ్యాంక్ ఉన్న టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత ఆరు శాతం ఓట్లు ఉన్న జనసేనపై ఉందని ఆర్కే చెప్పడం ఏంటో మరి! ఆర్కే లాజిక్ మిస్ అయ్యారా? లేక జనసేన మద్దతు ఇస్తే తప్ప టీడీపీ అధికారంలోకి రాదని చెప్పారా? పైగా పవన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అంటూ … ప్రాధాన్యతలు కూడా ఆర్కే చెప్పారు.
ఇవన్నీ ఆర్కే భయం నుంచి పుట్టిన ప్రాధాన్యతలు కాదనగలరా? ఇంతకూ 2024 అధికారంపై భయపడుతున్నదెవరో ఆర్కేకి ఇప్పటికైనా అర్థమైందా? తాను భయపడుతూ, ఇతరుల్లో అది ఉందని చెప్పడం ఆర్కే ‘వీకెండ్’ ప్రత్యేకత.
సొదుం రమణ