ఆయన ఏపీ టీడీపీ ప్రెసిడెంట్. ఆరడుగుల పొడుగు మనిషి. బాగా సీనియర్ నేత. కింజరాపు అచ్చెన్నాయుడు అటువంటి నోటి వెంట పదే పదే ఒకే మాట వస్తోందని సొంత పార్టీతో పాటు ప్రత్యర్ధి పార్టీలు సెటైర్లు వేస్తున్నాయంటే కాస్తా ఆలోచించాల్సిన విషయమే.
ఆ మధ్యన ఎపుడో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల వేళ ఒక హొటల్ లో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పార్టీ లేదు బొక్కా లేదూ అని అన్నట్లుగా వీడియో ఒకటి వైరల్ అయింది. ఇక ఆ తరువాత అచ్చెన్నాయుడు పదే పదే చాలెంజిల మీద చాలెంజిలు చేస్తూ అంటున్న మాటలు కూడా వైసీపీకి అస్త్రాలుగా మారుతున్నాయని అంటున్నారు.
వైసీపీ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే టీడీపీ ఆఫీస్ తలుపులు మూస్తామని అచ్చెన్న లేటెస్ట్ గా సవాల్ చేశారు. సరిగ్గా ఇక్కడే ఆయన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి దొరికిపోయారు. పార్టీ లేదూ బొక్కా లేదు అన్నపుడే టీడీపీ ఆఫీసుకు తాళాలు పడ్డాయి అచ్చెన్నా అంటూ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.
అంతగా సరదా ఉంటే ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఆనక పార్టీ ఆఫీసుకు తాళాలు వేసుకోమని వైసీపీ నేతలు కూడా అంటున్నారు. ఇక మంత్రి రోజా అయితే మరో డైలాగ్ తో అచ్చెన్నాయుడుకు షాక్ ఇచ్చారు. అచ్చెన్నకు టీడీపీకి మీద అంత కోపమేంటో. పదే పదే అఫీసు మూసేస్తామని, తాళాలు వేస్తామని సవాళ్ళు చేయడమేంటీ మరీనూ అంటూ వేసిన పంచ్ తో అచ్చెన్నాయుడు ఇరకాటంలో పడాల్సి వస్తోంది అంటున్నారు.
దూకుడుగా మాట్లాడుతూ మీరో మేమో తేల్చుకుందామని వైసీపీని కవ్వించే క్రమంలో అచ్చెన్నాయుడు టీడీపీ ఆఫీసు మూసివేతాలు, తాళాలు వేసివేతలు అంటూ అపశకునాలు పలుకుతున్నారా అన్నదే తమ్ముళ్లకు బెంగగా ఉందట.