మాటల్లో చెప్పాల్సి వస్తే గనుక.. మోదీ దూకుడుకు అడ్డుకట్ట వేయాల్సిందే అని ప్రతి ఒక్కరూ చెబుతారు. విపక్షాలు అన్నీ ఐక్యంగా ఉంటే తప్ప అలా అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదు అని కూడా అంటారు. కానీ.. ఆచరణకు వచ్చేసరికి ఎందరు కట్టుబడి ఉంటున్నారు. ఎవరికి వారికి క్రెడిట్ కావాలి.. మోడీని దెబ్బకొట్టడం కంటె ప్రధానంగా తమ ‘ఈగో’ హర్ట్ కాకుండా ఉండాలి.
దెబ్బకొట్టడం లాంటి పని జరిగితే గనుక.. దానికి సంబంధించిన క్రెడిట్ మొత్తం తమకే కావాలి.. ఇలా కీలకమైన నాయకులు ఈగోలనే ప్రధానంగా ఎంచుకుంటూ రాజకీయాలు చేస్తుండడం వల్ల మోడీ మరింత బలం సంతరించుకుంటున్నారు. అప్రతిహతంగా దూసుకుపోతున్నారు.
తాజా పరిణామాలను గమనించినప్పుడు ఈ సంగతి అర్థమవుతుంది. రాష్ట్రపతి ఎన్నిక సమయంలోనే.. బీజేపీపై పైచేయి సాధించడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది. కాంగ్రెస్ సహా, కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ పార్టీల సహా విపక్షాలు అందరినీ ఒక తాటిమీదకు తీసుకురావడానికి మమతా దీదీ ఒక ప్రయత్నం ప్రారంభించారు.
ఈనెల 15న ఢిల్లీలో ఒక సమావేశం ఏర్పాటుచేసి.. ఏం చేయగలమో చర్చించుకోవడానికి అందరినీ ఆహ్వానించారు. అయితే.. ఆమె లేఖలు రాసిన తొలిరోజునే విపక్షాల ఐక్యతకు సంబంధించి రకరకాల లుకలుకలు వినిపిస్తున్నాయి. మమ్మల్ని ముందుగా సంప్రదించకుండానే.. ఇలాంటి మీటింగు ఏర్పాటు చేశారంటూ.. వామపక్షాలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి.
మమతాదీదీ తొలినుంచి కూడా మోడీ వ్యతిరేక గళాన్ని చాలా తీవ్రస్థాయిలో వినిపిస్తున్న వారిలో ఒకరు. దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలతో కూడా ఆమెకు సత్సంబంధాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి రాష్ట్రపతి ఎన్నికల్లో నిస్సందేహంగా గెలవగల సొంతబలం లేని ప్రస్తుత నేపథ్యంలో.. విపక్షాలన్నీ ఐక్యంగా ఉంటే.. బీజేపీ అభ్యర్థిని ఓడించడం కష్టమేమీ కాదు. కానీ.. వారి మధ్య ఐక్యత అనేదే మిథ్యగా ఉంది.
మమతా బెనర్జీ లేఖలు పంపడంలోనే కొంత తేడా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ సీఎం జగన్, చంద్రబాబునాయుడు, ఒవైసీలకు ఆమె లేఖలు కూడా పంపలేదు. వారు బీజేపీకి అనుకూలంగా ఉంటారని ఆమె అనుకుని ఉండవచ్చు. కానీ.. లేఖను పంపడంలో వారిని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. లేఖ పంపిన తర్వాత.. వారు రాకపోతే వేరే సంగతి.
ఆమె కొందరిని పక్కన పెడితే.. ఆమె సారథ్యాన్ని కొందరు పక్కన పెడుతున్నారు. ఇలా ఎవరికి వారు.. ఈగోలకు పోయి.. మొత్తానికి బీజేపీ అభ్యర్థి ఘన విజయానికి దోహదం చేసేలా రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి.