పవన్ కల్యాణ్ – బిజెపి బంధం ఉంటుందా? పుటుక్కుమంటుందా? అనే సందేహాలు చాలా రోజులుగా ప్రజల్లో ఉన్నాయి. ఆ పార్టీల తీరును గమనిస్తున్న వారంతా.. వారి బంధానికి ఆయుష్షు మూడిందని.. ఇక అంతా రోజుల వ్యవధిలోనే ఉన్నదని అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోగానే ఇద్దరూ తలాక్ చెప్పేసుకుంటారని కూడా అనుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కలిసి ఒక కార్యక్రమాన్ని ఉమ్మడిగా నిర్వహించడానికి పూనుకుంటుండడమే తమాషా!
ఈనెల 25న అటల్ బిహారీ వాజపేయి జయంతి వస్తుంది. ఈ జయంతి కార్యక్రమాన్ని రెండు పార్టీలు ఉమ్మడిగా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అటల్ బిహారీ వాజపేయి వివాదరహితుడు. ఆయన సిద్ధాంతరీత్యా బిజెపి నాయకుడే గానీ.. ఆధునిక రాజకీయాల్లో ఆ పార్టీ వారికి ఉండే అనేక అవలక్షణాలు ఆయనలో ఉండవని అందరూ అంటూ ఉంటారు. అలాంటి వాజపేయి జయంతి కార్యక్రమాన్ని ఇద్దరూ కలిసి నిర్వహిస్తే మంచిదే. కానీ ప్రజలు గమనిస్తున్నదేంటంటే.. ఇదేతీరుగా ప్రజల సమస్యల గురించి ఒకే కూటమి అని చెప్పుకునే ఈ రెండు పార్టీలు కలిసి పోరాటం చేయవు ఎందుకు అని?
నిజానికి ఈ సమయంలో బిజెపితో కలిసి జనసేన ఒక కార్యక్రమం నిర్వహించడం అందరికీ ఆశ్చర్యం. ఎందుకంటే.. పవన్ కల్యాణ్ ఒక వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు పల్లకీ మోసి.. ఆయనను అధికారంలోకి తీసుకురావాల్సిందే అని తహతహలాడిపోతున్నారు.
అదే సమయంలో బిజెపి చంద్రబాబు పేరెత్తితేనే అగ్గిమీద గుగ్గిలం అయ్యేలాగా ఉంది. ఇప్పటికి వారు మాటల తీరును బట్టి తెదేపాతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోకపోవచ్చు. పరిస్థితిలో మార్పు రాకపోతే.. బిజెపితో పవన్ తెగతెంపులు చేసుకుంటారని బాగా ప్రచారం జరుగుతోంది. అలాంటప్పుడు.. వాజపేయి జయంతి సందర్భంగా ఇద్దరూ కలిసి కార్యక్రమం నిర్వహించడం.. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్న సామెత చందంగానే ఉన్నదని అందరూ వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ రెండు పార్టీల వాళ్లు పైకి తాము పొత్తుల్లో ఉన్నామనం, ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీలని చెప్పుకుంటూ ఉంటారు. కానీ.. ఎవరికి వారు విడివిడిగా ఎన్నికల వ్యూహరచన చేసుకుంటూ ఉంటారు. ఎన్నికలు వస్తే తాము కలిసి పోటీచేయాల్సి వస్తుందేమో.. వ్యూహాలు ఫైనలైజ్ అయ్యేముందు భాగస్వాముల్ని కూడా సంప్రదించడం మంచిది అనే ఆలోచన వారిలో ఎన్నడూ కనిపించదు.
అలాంటి నేపథ్యంలో.. ప్రజా సమస్యలమీద ఏనాడూ ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా గళమెత్తిన సందర్భాలు లేకపోయినా.. కనీసం ఒక సీనియర్ బిజెపి నాయకుడు, దార్శనికుడి జయంతిని నిర్వహించడానికైనా కలిసి నడుస్తుండడం సంతోషమే అని ఉభయ పార్టీల నాయకులు అనుకుంటున్నారు.