“ధన కనక వస్తు వాహనాభివృద్ధిరస్తు” అని దీవిస్తూ ఉంటారు గుడిలో పూజారులు.
ఈ ధన, కనక, వస్తు, వాహనాల్లో డిప్రీషియేషన్ లేనిది కనకానికే. ఏయేడుకాయేడు బంగారం విలువ పెరుగుతూనే ఉంటుంది తప్ప తరగేది ఉండదు. తగ్గినా అది బహు తక్కువ, తాత్కాలికం.
అయితే ఆ పెరుగుదల ఐదేళ్లకో, పదేళ్లకో గణనీయంగా ఉండడం మాత్రం చూస్తుంటాం. అలా గణనీయంగా బంగారం ధర పెరిగే కాలం దగ్గరపడిందంటున్నాయి అంతర్జాతీయ గణాంకాలు.
10%-20% బంగారం ధర పెరిగితేనే బంగారానికి రెక్కలొచ్చేయంటారు. అలాంటిది అమాంతం 50%-120% పెరిగితే? ఆ విడ్డూరం చూసే అవకాశం మనకి 2023లోనే వస్తుందంటున్నారు.
“ప్రస్తుతం నడుస్తున్న ఆర్ధికమాంద్యం వల్ల అమెరికాలోని బ్యాంకులు డిపాజిట్ల ఇంట్రెస్టుల్ని తగ్గించడమో లేక మందకొడిగా ఉంచడమో చేస్తాయి. దానివల్ల మదుపరులకి బంగారం మెరుగైన ఆప్షన్ గా మారుతుంది. అలా బంగారానికి డిమాండ్ పెరగడంతో ప్రస్తుతం 1900$ ఉన్న ఔన్స్ బంగారం ధర దాదాపు 2500$-4000$ వరకు పెరగొచ్చు”- అని స్విస్ ఆసియా క్యాపిటల్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ కీనర్ వెల్లడించారు.
ప్రపంచంలో ఏ మూల బంగారం ధరకి రెక్కలొచ్చినా అది అన్ని దేశాలకు పాకుతుంది. బంగారాన్ని కొనేవారిలో భారతీయులు ముందుంటారు. ప్రపంచంలోని అత్యధిక బంగారం పశ్చిమ దేశాలనుంచి ఆశియా దేశాలకి వచ్చి పడుతుంటే, దాంట్లో అధికశాతం ఇండియాకి వచ్చి పడుతోంది.
అయితే బంగారాన్ని ఆభరణాల రూపంలోనే కాకుండా సావరిన్ బాండ్స్ రూపంలోనూ, మూచువల్ ఫండ్స్ లో గోల్డ్+ఈక్విటీ బాండ్స్ గానూ కూడా కొంటున్నవారు పెరుగుతున్నారు. వారందరికీ ఇది శుభవార్తే అనుకోవాలి.
ఇవన్నీ ఎంత చెప్పినా గుడ్డిగా నమ్మి ఉన్నదంతా ఊడ్చి బంగారం కొనుగోళ్లమీద పెట్టేయనక్కర్లేదని, ఉన్నదాంట్లో 10%-20% బంగారం మీద పెట్టుబడి పెట్టడం తెలివైన పని అని అంటున్నారు పలువురు సలహాదారులు. అదీ నిజమే. ఎక్కడ ఇలాంటి వార్త వచ్చిన అతిగా రియాక్టైపోయి కోట్లకి పడగలెత్తేయాలన్న ఆతృత, అత్యాశ కొందరిలో ఉంటుంది. అదే వారి కొంప ముంచుతుంది.
ఇండియాలో 2020 ఏప్రిల్ ప్రాంతంలో బంగారం ధర విపరీతంగా పెరుగుతోందని బ్యాంకుల ద్వారా సావరిన్ బాండ్స్ ఆర్బీయై చెప్పిన ధరలకి కొన్నారు చాలామంది. ఆ తర్వాత అమాంతం పడిపోయింది. ఇప్పటికీ ఆ సమయంలో కొన్న ధరని అందుకోలేదు. కనుక అలా కూడా జరగొచ్చు. గోల్డ్ బాండ్లో పెట్టుబడి పెడితే కనీసం ఐదేళ్ల వరకు తీయడానికుండదు. ఈ మధ్యలో పెరిగినా తరిగినా చేసేదేం లేదు. ఐదేళ్ల తర్వాత పెరగకుండా ఉండదులే అనే ధీమాతో కొనాలంతే.
కనుక బంగారంపై మదుపు చేసే వారు ఈ దిశగా కూడా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలంటున్నారు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్.
– లక్ష్మీకళ. ఎస్