తన గురించి అతిగా ఊహించుకుంటున్న రాహుల్!

భారత్ జోడో యాత్ర సాగిస్తున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్.. తన గురించి తాను కాస్త ఎక్కువగా ఊహించుకుంటున్నట్టుగా ఉంది. సాధారణంగా ఇలాంటి యాత్రలు నిర్వహిస్తున్నప్పుడు, ఇవి సాధిస్తున్న ప్రజాస్పందన అపూర్వం అని, తమ రాజకీయ…

భారత్ జోడో యాత్ర సాగిస్తున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్.. తన గురించి తాను కాస్త ఎక్కువగా ఊహించుకుంటున్నట్టుగా ఉంది. సాధారణంగా ఇలాంటి యాత్రలు నిర్వహిస్తున్నప్పుడు, ఇవి సాధిస్తున్న ప్రజాస్పందన అపూర్వం అని, తమ రాజకీయ ప్రత్యర్థుల్లో వణుకు పుడుతున్నదని ప్రచారం చేసుకోవడం సహజం. కానీ.. కరోనా ముందు జాగ్రత్తల విషయంలో కూడా ప్రభుత్వ సూచనలను ఎద్దేవా చేస్తూ తన యాత్రను అడ్డుకోవడానికే కేంద్రం నిబంధనలు పెడుతున్నదంటూ వ్యాఖ్యానించడం తమాషాగా ఉంది. 

కరోనా మరోసారి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. చైనా అతలాకుతలం అవుతూ ఉండడం. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూ ఉండడం, అంతర్జాతీయంగా అన్ని దేశాలు అప్రమత్తం అవుతూ ఉండడం జరుగుతున్నాయి. కేంద్రం కూడా కరోనా జాగ్రత్తలపై తాజాగా ముందుజాగ్రత్తగా సమీక్షలు నిర్వహిస్తోంది. 

కొత్త వేరియంట్ భారత్ లో కూడా ప్రవేశించిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. మళ్లీ ప్రజలందరూ మాస్క్ లు ధరించడం మేలని హితవు చెబుతోంది. ఇలా దేశం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండగా.. జోడోయాత్రలో నిబంధనలు పాటించాలని అనడాన్ని ప్రత్యేకించి తనను టార్గెట్ చేయడానికే అన్నట్టుగా రాహుల్ ఫీల్ కావడం విశేషం.

కరోనా విషయంలో కేంద్రం మేలుకోవడానికి ముందే తాను సూచనలు చేశానని, అప్పుడు పట్టించుకోలేదని రాహుల్ అంటూ ఉంటారు. కరోనా, చైనాతో యుద్ధం వంటి విషయాల్లో తాను ముందే జాగ్రత్తలు చెప్పానని కూడా అంటూ ఉంటారు. నిజమే అనుకున్నా సరే.. ఇప్పుడు కూడా అదే తరహాలో ఆయన అలాంటి ముందు జాగ్రత్తలను పాటించడం మంచిదే కదా అనేది సామాన్యులకు ఎదురయ్యే ప్రశ్న. 

కేంద్రఆరోగ్య శాఖ మంత్రి రాహుల్ కు ఒక లేఖ రాశారు. భారత్ జోడో యాత్రలో కొవిడ్ మార్గదర్శకాలు పాటించితీరాలని, లేకుంటే ఆపేయాలని అందులో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు కొవిడ్ విషయంలో మళ్లీ అలర్ట్ అవుతున్న నేపథ్యంలో ఈ లేఖను సాధారణ పరిణామంగానే చూడొచ్చు. అయితే తన యాత్రను ఆపించడానికి ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని, తన జోడో యాత్ర కాశ్మీర్ దాకా ఖచ్చితంగా కొనసాగుతుందని రాహుల్ అంటున్నారు. 

నిజానికి ఆయన ఈ యాత్ర కొనసాగించడం ద్వారా.. ఏం అద్భుతాలు సృష్టిస్తున్నారో తెలియని సంగతి. పార్టీకి కొత్త బలం అందించే స్థాయిలో ఆయన యాత్ర ఉన్నదని అనగల అవకాశమే లేదు. ఆయన ‘కన్యాకుమారి టూ కాశ్మీర్’ నడవడం జరుగుతోందే తప్ప.. ఆ మేరకు పార్టీ బలోపేతం అవుతోంది అనలేని పరిస్థితి. 

ఇలాంటి నేపథ్యంలో తన యాత్రను ఆపించడానికి కుట్ర జరుగుతున్నదంటూ.. అక్కడికేదో తన యాత్ర సాధిస్తున్న ప్రజాస్పందన పట్ల బిజెపి భయపడిపోతున్నట్టుగా.. రాహుల్ ఊహించుకోవడం తమాషాగా ఉంది.