డిసెంబర్ 14న ఢిల్లీలో పట్టపగలు ఓ టీనేజ్ యువతిపై యాసిడ్ దాడి జరిగింది. బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు, అందరూ చూస్తుండగా ఆమె ముఖంపై యాసిడ్ పోశారు. ఊహించని ఘటనతో యువతి విలవిల్లాడిపోయింది. తీవ్ర గాయలతో హాస్పిటల్ లో చేరింది. ఇదంతా దగ్గర్లో ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయింది. ఆ వీడియో కూడా బయటకొచ్చింది.
ఈ కేసు ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ మెడకు చుట్టుకుంది. ఎందుకంటే, దాడికి ఉపయోగించిన యాసిడ్ ను ఫ్లిప్ కార్ట్ నుంచే కొన్నారు దుండగులు.
దాడి జరిగిన వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు గంటల వ్యవథిలో నిందితుల్ని పట్టుకున్నారు. వాళ్లను సచిన్ అరోరా, హర్షిత్ అగర్వాల్, వీరేంద్ర సింగ్ గా గుర్తించారు. విచారణలో భాగంగా యాసిడ్ ను ఈ-కామర్స్ సైట్ గా కొనుగోలు చేశామని వెల్లడించారు నిందితులు. దీనికి సంబంధించిన ఈ-వాలెట్ ద్వారా చెల్లింపులు జరిగిన విషయాన్ని పోలీసులు గుర్తించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఫ్లిప్ కార్ట్ అధికారులకు కూడా నోటీసులు ఇచ్చారు. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం, హానికరమైన వస్తువులు, పదార్థాల్ని విక్రయించడం నేరం. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది. ఈ నిబంధనను ఉల్లంఘించి యాసిడ్ ను ఆన్ లైన్ లో ఎందుకు అమ్మారని ఫ్లిప్ కార్ట్ అధికారుల్ని పోలీసులు ప్రశ్నించారు.
ఆగ్రాలోని ఓ షాపు నుంచి అది డెలివరీ అయినట్టు కంపెనీ అధికారులు చెప్పగా, వాళ్లు ఇచ్చిన వివరణతో పోలీసులు సంతృప్తి వ్యక్తం చేయలేదు. మరోసారి విచారణకు పిలవనున్నారు.
అమ్మాయిపై యాసిడ్ దాడికి పాల్పడిన సచిన్ అరోరా, బాధితురాలి ఇంటిపక్కనే ఉంటాడు. ఇద్దరూ సన్నిహితులు కూడా. అయితే సెప్టెంబర్ నుంచి ఒకరితో ఒకరికి పడడం లేదంట. ఈ కారణంతోనే అమ్మాయిపై యాసిడ్ పోశాడని పోలీసులు వెల్లడించారు.