తనకు సహాయం చేసిన ఓ ప్రొఫెసర్ చల్లగా ఉండాలని ఓ వికలాంగుడు చాలా పెద్ద ప్రయత్నమే చేస్తున్నాడు. వీల్ ఛెయిర్ పై ఏకంగా శబరిమల యాత్ర మొదలుపెట్టాడు. కాళ్లు చేతులు సక్రమంగా ఉన్న భక్తులే, శబరిమల యాత్రలో చాలా కష్టపడుతుంటారు. అలాంటిది ఈ దివ్యాంగుడు వీల్ ఛైర్ పై యాత్ర మొదలుపెట్టాడు.
తమిళనాడులోని ముత్తుపేటకు చెందిన వ్యక్తి కన్నన్. ఇతడికి భార్య, నలుగురు పిల్లలు. భవన నిర్మాణంలో రోజుకూలీగా పనిచేసేవాడు. ఓరోజు విధి వక్రించింది. లారీ నుంచి లోడ్ దించుతుండగా కన్నన్ కాలికి బలమైన గాయమైంది. ఏకంగా కాలు తీసేయాల్సి వచ్చింది.
అప్పట్నుంచి కన్నన్ కు కష్టాలు మొదలయ్యాయి. కాలు లేక కదల్లేని స్థితిలో ఉన్న కన్నన్, కుటుంబాన్ని పోషించడానికి అష్టకష్టాలు పడ్డాడు. అతడి కష్టం సమీరా కంటపడింది. దగ్గర్లో ఉన్న ప్రభుత్వ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న సమీరా, కన్నన్ కష్టం చూసి చలించిపోయింది.
నేషనల్ సర్వీస్ స్కీమ్ వాలంటీర్లతో కలిసి కన్నన్ కోసం 8 లక్షల రూపాయల ఖర్చుతో ఓ చిన్న ఇల్లు నిర్మించి ఇచ్చింది. ఇంకాస్త డబ్బులు పోగేసి, అతడికి ఓ వీల్ ఛైర్ కొనిపెట్టింది.
ఎలాంటి పరిచయం లేని సమీరా చేసిన సహాయానికి కన్నన్ చలించిపోయాడు. ఆమె చల్లగా ఉండాలని కోరుకుంటూ, ఆమె కోసం శబరిమల యాత్ర చేపట్టాడు. ప్రస్తుతం శబరిమలకు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు కన్నన్. ఈ నెలాఖరులోగా వీల్ ఛెయిర్ లోనే శబరిమల వరకు చేరుకోవాలని అనుకుంటున్నాడు.