థాయ్‌లాండ్ చరిత్రపై నేను రాసిన వ్యాసం చదివి మా థాయ్‌లాండ్ టూరు గురించి వివరంగా రాయమని చాలామంది పాఠకులు కోరడంతో యిది రాస్తున్నాను. టూరిజం వృద్ధి చెందడానికి యిది ఏ మేరకు సహాయపడినా సంతోషిస్తాను. నేను 2018లో తూర్పు యూరోప్ యాత్ర చేశాను. రోజుకి సగటున 9 కి.మీ.లు నడవాల్సి వచ్చింది. 2019 మేలో చైనా యాత్ర పెట్టుకుంటే ఒక నెల ముందే గుండె ఆపరేషన్ చేసుకోవాల్సి వచ్చింది. త్వరలోనే కోలుకుని 2020లో దుబాయి యాత్ర పెట్టుకుంటే కరోనా వచ్చిపడింది. టూరిజం పరిశ్రమ కుప్పకూలింది. ఏడాదికో విదేశీయాత్ర చేయాలనే కోరికకు అడ్డుకట్ట పడింది. ఇక అప్పణ్నుంచి అధైర్యం పట్టుకుంది. మన ఓపిక ఏ మేరకు ఉందో పరీక్ష పెట్టుకోవాలనుకుని పెద్దగా శారీరక శ్రమ లేని థాయ్‌లాండ్‌కు ప్లాను చేశా. బాగా అలసిపోతే, ‘నేను హోటల్ రూములో పడుక్కుంటా, లేదా వ్యాన్‌లో కూర్చుంటా (యూరోప్‌లో ఆ సౌకర్యం లేదు), మీరు తిరిగేసి రండి’ అని తక్కినవాళ్లకు చెప్పవచ్చని ఆలోచించాను. థాయ్‌లాండ్ ప్యాకేజీ టూర్లను చాలాకాలంగా పరిశీలిస్తూ వచ్చాను. రేటు తక్కువ చూపించి, 4 రోజుల ట్రిప్పు వేసి దానిలో చాలా రోజులు రోజంతా తాపీగా షాపింగు చేయండి, బీచ్‌లో వెళ్లి కూర్చోండి, షోలుంటే మీరే వెళ్లి చూసుకోండి అనే రాసేవారు.
రిలాక్సేషన్కై ఫారిన్ టూరు వెళ్లడమనేది విదేశీయుల కాన్సెప్టు. మన దేశంలో ధనికులకు వర్తిస్తుంది. ‘ఊరకుక్కకు పనీ లేదు, తీరికా లేదు’ అనే సామెత వర్తించే నాబోటి వాళ్లం పెద్దగా శ్రమించేయటం లేదు. అందుకని టూరుకి వెళ్లి హ్యేపీగా రిలాక్సవ్వండి అంటే మాకు నచ్చదు. రోజుకి 10-15 వేలు పెట్టుకని వచ్చినది హోటల్లో పడుక్కుని టీవీ చూడడానికా? బయటకు వెళ్లి గబగబా కొత్త ప్రదేశాలు చూడాలని తాపత్రయం. టూరు ఆపరేటరు ఎన్ని చూపించాడు, ఎన్ని ఎగ్గొట్టాడు అని లెక్క వేసుకుంటాం. అందువలన థాయ్‌లాండ్ టూరు ప్రోగ్రాంలు నన్ను ఆకర్షించలేదు. పైగా షోల కోసం టిక్కెట్టు క్యూలలో నిలబడడం టైము వేస్టు. ముంబయికి చెందిన ప్రఖ్యాత టూర్ కంపెనీ కేసరి ట్రావెల్స్ వాళ్లు రేటు ఎక్కువ పెట్టినా, థాయ్‌లాండ్ టూర్లో చూడదగ్గ లిస్టు యిచ్చి, షోలన్నీ మేమే చూపిస్తామన్నారు. ఓహ్, యిన్ని ఉన్నాయా అనుకుని వాళ్ల ద్వారా బుక్ చేద్దామనుకుంటే వాళ్లు ముంబయి నుంచే ఆపరేట్ చేస్తున్నారు.
కోవిడ్ వచ్చిన తర్వాత టూరిజం తగ్గిపోవడంతో చాలా కంపెనీలు ప్యాకేజీ టూర్లు ఆపరేట్ చేయడం మానేశాయి. కస్టమైజ్డ్ టూర్లే ఏర్పాటు చేస్తామంటున్నాయి. అవి కాస్త ఖరీదు ఎక్కువౌతాయి కదా, ప్యాకేజే కావాలి అంటే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ముంబయికో, దిల్లీకో రప్పించి అక్కణ్నుంచి తీసుకెళుతున్నారు. ఈ చిన్న టూరు కోసం ముంబయి వెళ్లివచ్చే ఖర్చులు, అక్కడి బస ఖర్చులు అదనంగా ఖర్చు పెట్టడం దేనికని హైదరాబాదులోనే విశిష్టా ట్రావెల్స్ (9866066424) వాళ్ల ద్వారా కేసరి వాళ్లు చూపించేవన్నీ చూపించే విధంగా కస్టమైజ్డ్ టూరు ఏర్పాటు చేయించుకున్నాము. వీళ్ల ద్వారానే 2014లో పశ్చిమ యూరోప్ యాత్ర చేసి వచ్చాం. వ్యక్తిగతమైన శ్రద్ధ తీసుకుని ఏర్పాట్లు బాగా చేస్తారు. ఇదీ బాగా చేశారు.
స్వదేశంలో టూర్ల మాట ఎలా ఉన్నా, విదేశాలకు వెళ్లినపుడు, మరీ ప్రత్యేకంగా యిలా కస్టమైజ్డ్ టూరులో వెళ్లినపుడు యింకో ఫ్యామిలీతో కలిసి వెళ్లడం శ్రేయస్కరం. కబుర్లు చెప్పుకుంటూ, సరదాగా గడిపేందుకు కంపెనీ ఉంటుందన్న సంతోషంతో బాటు ఏదైనా యిబ్బంది వస్తే యింటికి చేరుస్తారనే ధీమా ఉంటుంది. అయితే లైక్‌మైండెడ్ కాకపోతే చికాకులు వస్తాయి. సమయానికి తెమలడం, అనుకోని ఖర్చు విషయంలో ఒకేలా ఆలోచించడం, అనుకున్నది జరగనప్పుడు శాంతంగా ఉండి సర్దుకోవడం, దేనికి ఎంత సమయం కేటాయించాలనే దానిపై యించుమించు ఏకాభిప్రాయం ఉండడం, దాదాపు మనలాటి అభిరుచే ఉండడం.. యిలాటివి అవసరం. లేకపోతే ముఖాలు ముడుచుకోవలసి వస్తుంది. రోజుకి 15 వేలు ఖర్చుపెడుతున్నపుడు ప్రతి నిమిషం విలువైనదే. మన మూడ్ ఖరాబు చేసుకుని వ్యర్థం చేసుకోకూడదు.
మా పెద్దమ్మ కూతురు, తన భర్త మూర్తి మాతో 1979 నుంచి ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. మంచి కంపెనీ. వెస్ట్, యీస్ట్ యూరోపులు వాళ్లతోనే వెళ్లాం. నా ఆపరేషన్ కారణంగా చైనా పర్యటన కాన్సిల్ చేసుకుంటే డబ్బు పోయినా ఫర్వాలేదని వాళ్లూ కాన్సిల్ చేసుకున్నారు. ఈసారి పాతికేళ్లగా మాకు ఆప్తమిత్రులు, ఆయుర్వేద వైద్యులు డా. చిరుమామిళ్ల మురళీ మనోహర్, భార్య కూడా వచ్చారు. ఆయనకు 768వేల చందాదారులున్న యూట్యూబ్ ఛానెల్ ఉండడంతో చాలా పాప్యులర్. థాయ్‌లాండ్‌లో కూడా అభిమానులు గుర్తుపట్టి, పలకరిస్తూ వచ్చారు.
థాయ్లాండ్ది కోస్తా ప్రాంతాల్లాటి ఉక్కపోత వాతావరణం. వేడి ఉంటుంది. నవంబరు నుంచి ఫిబ్రవరిలోగా వెళ్లి వస్తే మంచి సీజన్. లేకపోతే ఎండలు ముదిరిపోతాయి. మా ఆరుగురికి 6 పగళ్ల, 5 రాత్రుల బాంగ్కాక్ (థాయ్‌లాండ్ రాజధాని), పతయా టూరు కావాలని అడిగాము. టైము ప్రకారం బాంగ్కాంక్ మనకు గంటన్నర ముందుంటుంది. థాయ్ ఎయిర్వేస్ విమానం ద్వారా అయితే 3.30 గంటల ప్రయాణం మాత్రమే. కానీ అది అర్ధరాత్రి ఎక్కాలి. తక్కిన విమానాలన్నీ 12 గంటలు, 15 గంటలు తీసుకుంటాయి. రానూపోనూ టిక్కెట్టు (దాదాపు 29 వేలు) మేం పెట్టుకోగా విశిష్టా వాళ్లు మనిషికి 540 డాలర్లకు కోట్ యిచ్చారు. (అదనంగా జిఎస్టీ 5%, సిఎస్టి 5%) 4 స్టార్ హోటళ్లలో బస అన్నారు. 3 స్టార్ అయితే 510 అన్నారు. మేం 4 స్టార్కే మొగ్గు చూపాం. అన్ని రోజులూ లంచ్, డిన్నర్ ఏర్పాటు కలిపి ఆ రేటు అన్నారు. బ్రేక్ఫాస్టయితే హోటల్ వాడు ఎలాగూ కాంప్లిమెంటరీగా యిస్తాడు. ప్యారీ ట్రావెల్స్ (మురుగప్ప గ్రూపు) వాళ్లు తక్కువే కోట్ చేశారు కానీ కొన్ని పూటల భోజనభారం మనదే అన్నారు. ఇండియన్ హోటళ్లు దండిగా ఉన్నా, ఎక్కడ బాగుంటుందో వెతుక్కుంటూ ఎంతసేపు తిరుగుతాం? వీళ్లయితే మొత్తం బాధ్యత తీసుకున్నారు.
టూర్లాండ్ అని బ్యాంగ్‌కాక్‌లో విశిష్టా వాళ్ల ఏజంటు (అదీ ఇండియన్స్ నడిపేదే) ఉండి, మాకు యీ ఏర్పాట్లన్నీ చేశారు. మా ఆరుగురికి 9 మంది కూర్చునే వ్యాన్ యిచ్చారు. డ్రైవర్ సీటు పక్కనే గైడ్‌కు వేరే సీటుంది. వెనక్కాల సామాన్లు పెట్టుకోవచ్చు. గైడ్ ఎయిర్‌పోర్టులో రిసీవ్ చేసుకుని, మాకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ (మేం ఉండే హోటల్ పక్కనే వేరే హోటల్లో ఉండేది) చివర్లో సీఆఫ్ కూడా చేసింది. అందువలన తప్పిపోతామన్న భయం లేదు. కరోనా భయం పూర్తిగా తొలగిపోలేదు కాబట్టి థాయ్‌లాండ్ పార్కుల్లో వీకెండ్ రష్ తప్పించుకుందామని సోమవారానికి అక్కడ చేరి శనివారం రాత్రి అక్కణ్నుంచి బయలుదేరేలా ప్లాను చేశాం.
వీళ్ల కోట్లో వీసా ఖర్చులు కలపలేదు. థాయ్‌లాండ్ వీసా ముందే తీసుకోనక్కరలేదు. ఎయిర్‌పోర్టులో ఆన్ ఎరైవల్ వీసా తీసుకోవచ్చు. దాని ఫార్మ్ ట్రావెల్ కంపెనీ దగ్గర యిక్కడే తీసుకుని, ఫోటోలతో సహా పూర్తి చేసి సిద్ధంగా పెట్టుకుంటే హాయి. అక్కడికి వెళ్లాక ఫోటోలు తీయించుకున్న వాళ్లని, ఫోటో అతికించడానికి గమ్ ట్యూబ్ కోసం వెతికిన వాళ్లని, ఫిలప్ చేయడానికి పెన్ను కోసం తడుముకున్న వాళ్లని, ఫార్మ్‌తో పాటు చూపించాల్సిన మన హోటల్ కన్ఫర్మేషన్, రిటర్న్ టిక్కెట్టు కోసం తబ్బిబ్బు పడినవాళ్లని చూశాను. ఇవన్నీ టైము వేస్టు పనులు.
వీసా ఫీజు మనిషికి 2 వేల థాయ్ బాత్స్. 200 బాత్‌లు విడిగా యిస్తే (దీనికి రసీదు యివ్వరు) ఫాస్ట్ లైన్లో వెళ్లవచ్చు. దీనితో పాటు మనిషికి 10 వేల బాత్స్ (లేదా దానికి సమాన విలువ గల డాలర్లు) మనం రొక్కంగా చూపించాలని రూలుంది. అది ఖర్చు పెట్టాలన్న రూలు లేదు కానీ దేశానికి అంత పట్టుకుని రావాలని నియమం. అప్పుడప్పుడు ఎయిర్‌పోర్టులో చెక్ చేస్తారట. మమ్మల్ని చేయలేదు కానీ డబ్బు పట్టుకెళ్లాం. విశిష్ట వాళ్లు ఏర్పాటు చేసిన ఏజంటు ద్వారానే తలకు 6 వేల బాత్స్, 300 డాలర్లు తీసుకెళ్లాం. 6 వేలలో 2200 ఎయిర్‌పోర్టులో ఖర్చవగా, కామన్ పూల్ ఖర్చు 1300 అయింది. తక్కినదానిలో షాపింగుకి కొంత పోగా కొన్ని బాత్‌లు మిగిలాయి. డాలర్లయితే ఎక్కడైనా పనికి వస్తాయి కానీ, వీటినేం చేసుకుంటాం? అందుకే మాకు అమ్మినతన్ని వెనక్కి తీసుకోమన్నాను. అమ్మేటప్పుడు రూ.2.39 రేటైతే, తీసుకునేటప్పుడు రూ.2.35 రేటు.
థాయ్‌లాండ్ షాపుల వాళ్లలో చాలామంది ఇండియన్ కరెన్సీ కూడా తీసుకుంటున్నారు. బాత్కు రూ.2.50 చొప్పున రేటు కడుతున్నారు. జెమ్స్ గ్యాలరీలో మేం జూకాలు తీసుకున్నపుడు నా ఎస్బిఐ క్రెడిట్ కార్డు ఉపయోగించాను. దానికి ఆ టాక్సూ, యీ టాక్సూ కలిపినా రూ.2.45 పడింది. షాపు వాడి 2.50 కంటె తక్కువే కదా. అయితే షాపువాడు కార్డు వాడకానికి 2-3% ఎక్స్ట్రా అంటే మాత్రం కార్డు వాడితే నష్టం. ఇక సిమ్ కార్డు గురించి చెప్పాలి. నా ఎయిర్‌టెల్‌లో ఇంటర్నేషనల్ కాల్స్ ఎనేబుల్ చేద్దామంటే 10 రోజులకి 4వేల చిల్లర అన్నాడు. హోటల్లో ఉండగా వాట్సాప్ వాడుకోవచ్చు. బయట తిరిగేటప్పుడు గైడ్‌ను ఫోన్ చేసి పిలవాలంటే లోకల్ సిమ్ కావాలి. ఇండియాలో థాయ్ సిమ్ యిస్తామన్నారు కానీ దానిలో లోకల్ కాల్స్ టైమ్ తక్కువ యిచ్చి, ఇండియాకు కాల్ చేసుకునే టైము ఎక్కువిచ్చాడు.
అందుకని ముందే అన్నీ చూసుకుని బాంగ్కాక్ ఎయిర్‌పోర్టులో దిగగానే ట్రూమూవ్ వాళ్ల 399 బాత్ ప్యాకేజీ తీసుకున్నాం. 8 రోజులు, అన్లిమిటెడ్ 5జి యింటర్నెట్, 100 బాత్‌ల ఇంటర్నేషనల్ కాల్స్, అన్లిమిటెడ్ వైఫై. మనం ఏదైనా షోకి వెళ్లినపుడు గైడ్ బయట వెయిట్ చేస్తాడు కదా, బయటకు వచ్చాక పిలవడానికి ఉంటుందని ఒక కార్డు తీసుకున్నాం కానీ తర్వాత తెలిసి వచ్చింది, మూడు ఫ్యామిలీలకు తలా ఒకటి తీసుకుని ఉంటే బాగుండేదని. ఎందుకంటే షాపింగులో, పార్కులలో అటూయిటూ చెదిరిపోతూ ఉంటాం. ఫలానా చోట కలుద్దాం అని చెప్పుకోవడానికైనా యీ కమ్యూనికేషన్ అవసరం. ఇంటర్నేషనల్ ఫ్లయిట్లకు ఆలస్యం ఎక్కువౌతోంది కాబట్టి ఎయిర్‌పోర్టుకి కాస్త ముందే చేరాలని నిశ్చయించుకున్నాం. ఇవాళే పేపర్లో చదివాను, సెక్యూరిటీ చెక్ దగ్గర సమయాన్ని ఆదా చేయడానికి కొత్త స్కానర్లు పెడతారట. ఇకపై లాప్‌టాప్‌లు వగైరా బయటకు తీయనక్కరలేదట.
ఓ ఆదివారం రాత్రి 10 గంటలకు ఎయిర్‌పోర్టు చేరి, సోమవారం 1.30కి థాయ్ ఎయిర్వేస్ వాళ్ల టిజి 330 ఫ్లయిట్లో బయలుదేరాం. అక్కడ 5 గంటలకు చేరాం. అక్కడ సోమవారం ఉదయం 6.30. ఇంటిదగ్గర ఏ 8 గంటలకో డిన్నర్ సరిగ్గా చేయకుండా బయలుదేరి ఉంటామనుకున్నారో ఏమో ఫ్లయిట్లో రాత్రి 2.30కి లేపి, అన్నం, చపాతీ, కేక్‌లతో తిండి పెట్టారు. ప్రయాణం సౌకర్యవంతంగానే ఉంది. దిగగానే ఎయిర్‌పోర్టులోనే కాలకృత్యాలు తీర్చుకోవలసి వచ్చింది. చాలాదూరం నడిస్తే తప్ప వీసా కౌంటర్, ఆ పై సామాన్ల కన్వేయర్ బెల్టూ తగల్లేదు. ఎగ్జిట్ గేటు దగ్గర గైడ్ నిలబడి ఉంది. 7.45కి కలిశాం. మేం బయలుదేరడానికి ఒక రోజు ముందే గైడ్ పేరు ‘మీమీ’ అని టూర్లాండ్ వాళ్లు తన నెంబరు యిచ్చారు. నేను యిక్కణ్నుంచే వాట్సాప్ చేసి, హలో మిస్టర్ మీమీ అని పలకరించాను. మీ పేరున్న యీ బోర్డుతో మిమ్మల్ని కలుస్తాను అని జవాబు వచ్చింది.
ఎయిర్‌పోర్టులో చూస్తే యీ మీమీ స్త్రీ అని తేలింది. 40 ఏళ్లు పై బడిన మహిళ. నన్ను చూడగానే పప్పా, డాడీ అని పిలిచింది. అంకుల్ అనుకుండా యీ పిలుపేమిటా అనుకున్నాను కానీ తర్వాత అర్థమైంది. థాయ్ సాంప్రదాయమది. ఓ రోజు టాక్సీ వాడికి ఫోన్ యిచ్చి, గైడ్‌తో మాట్లాడమన్నాను. ఆడగొంతు వినగానే అతను ‘మమ్మా’ అని మొదలుపెట్టాడు. మనకూ యీ సంప్రదాయం ఉండేది. రామ-అయ్య, సీత-అమ్మ అని. వాళ్లు యిప్పటికీ పప్పా, మమ్మా అంటున్నారు. మంచిదే! ఈ గైడ్ చాలా మంచిది. ఇంగ్లీషు పెద్దగా రాదు కానీ మన భావం అర్థం చేసుకుంటుంది. చాలా ఓపికమంతురాలు. ఏ ఫిర్యాదూ రాకుండా తన డ్యూటీని చక్కగా నిర్వహించింది. కాఫీలు తాగి, పతయాకు గైడ్ తెచ్చిన వ్యాన్‌లో బయలుదేరాం. రెండున్నర గంటల ప్రయాణం. మధ్యలో నమస్తే అనే రెస్టారెంటులో ఆగి బ్రేక్‌ఫాస్ట్ చేశాం. చాలా బాగుంది. బిల్లు మాదే. పతయా చేరేసరికి 11.15 అయింది.
గతంలో హోటళ్లలో 24 గంటల చెకౌట్ ఉండేది. ఇప్పుడది మారిపోయింది. చెకిన్ టైము మధ్యాహ్నం 2 లేదా 3 అంటున్నారు. మధ్యాహ్నం 12 కల్లా చెకౌట్ అంటున్నారు. కాదు పొద్దున్నే చెకిన్ చేస్తాం అంటే ముందు రోజుకి కూడా అద్దె కట్టమంటున్నారు. అందువలన టూరు కంపెనీ వాళ్లు మధ్యాహ్నం దాకా అటూయిటూ తిప్పి, చెకిన్ టైముకి హోటల్‌కు తీసుకెళుతున్నారు. అడంగు చేరాక వెంటనే హోటల్‌కి వెళ్లి ఫ్రెషప్ అయ్యి ఊరు చూడబోవడం హాయిగా ఉంటుంది. కానీ యిప్పుడలా కుదరటం లేదు. ఈ టూరు ఆపరేటర్లందరూ బాంగ్కాక్ హోటల్లో దింపకుండా పతయా తీసుకెళుతున్నారు. అక్కడ హోటల్ వాడిచ్చే బ్రేక్‌ఫాస్ట్ 10.30 కల్లా అయిపోతుంది. అందుకని దారిలో మన ఖర్చుతోనే టిఫెన్ తినాలి. 12 దాటాకే హోటల్ ప్రవేశం.
అందుకని 11.30కి గైడ్ మమ్మల్ని పతయాలోని బిగ్ బుద్ధా గుడికి తీసుకెళ్లింది. స్నానం చేయకుండా గుడికి వెళుతున్నామనే కించ లోపలుంది. కానీ ఓపెన్ ఏరియాలోని బుద్ధుణ్ని భక్తులు బూట్లతోనే దర్శనం చేసుకుంటూండడం చూసి ఫరవా లేదనిపించింది. బాంగ్కాక్లోని గోల్డెన్ బుద్ధ దగ్గర మాత్రం బూట్లు విప్పించారు. వెళ్లిన ప్రదేశాల వర్ణన చేయటం లేదు. యూట్యూబ్ లింకులిచ్చేస్తున్నాను. ఎలా ఉంటుందో మీకే ఐడియా వచ్చేస్తుంది. గుడి మెట్లెక్కి (ఎక్కడం చాలా సులభం) తిరిగి వచ్చేసరికి మా ఫోటోలు పెట్టిన ఫ్రేమ్‌లు మాకు అమ్మచూపారు. ఎప్పుడు ఫోటోలు తీశారో తెలియలేదు. అదేదో సినిమాలో కృష్ణభగవాన్ ఏదైనా ఉపకారం చేయగానే క్షణాల్లో ఓ ఫ్లెక్సి వెలిసిపోతూ ఉంటుంది. అలా ఉంది. ఫోటో కొనుక్కో పోయినా ఫర్వాలేదంటారు కానీ టెంప్ట్ అవుతాం. ఇలా అన్ని చోట్లా జరిగింది.
గుడి చూశాక పక్కనే ఉన్న సిగ్నేచర్ పతయా హోటల్‌కు తీసుకెళ్లారు. ఓనర్లు యిండియన్లేట. ఉద్యోగులు మాత్రం థాయ్ వాళ్లు. సౌకర్యవంతంగా ఉంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కూడా బాగుంది. పతయా చిన్న ఊరు. అన్నీ పక్కపక్కనే. లంచ్‌కు రెస్టారెంట్‌కు తీసుకెళ్లారు. లంచ్ తిని కాస్సేపు నిద్ర పోయి, సాయంత్రం 7 గంటలకు ఆల్కజార్ షోకు వెళ్లాం. ఆ రోజు బుద్ధ, ఆల్కజార్ షో మాత్రమే చూశామంటే టైము వేస్టయినట్లే కదా అనిపించవచ్చు. కానీ అర్ధరాత్రి ప్రయాణం కారణంగా అలసట ఫీలయ్యాం. ఇంకేమైనా చూపిస్తామన్నా వద్దనేవాళ్లం. సాయంత్రం గంటపాటు సాగిన ఆల్కజార్ షో చాలా బాగుంది. క్యాబరేయే కానీ టాప్‌లెస్ కాదు.
9 గంటలకు డిన్నర్ మరో ఇండియన్ రెస్టారెంట్లో. అదేమిటో కానీ యీ టూరు ఆపరేటర్లు భోజనానికి ఓసారి తీసుకెళ్లిన చోటికి మళ్లీ తీసుకెళ్లలేదు. కానీ హోటల్ వాళ్లందరూ కూడబలుక్కున్నట్లు ఒకే మెన్యూని కాస్త మార్పులతో పెట్టారు. ప్రతీ చోటా ప్రధానంగా వెజిటేరియన్ ఫుడ్, ఒకటో రెండు నాన్ వెజ్ ఐటమ్స్. బంగాళాదుంపల కూర, జీరా రైస్ మాత్రం కంపల్సరీ. ఐదు చోట్ల భోజనం బాగుంది. రెండు చోట్ల అస్సలు బాగా లేదు. తక్కిన చోట్ల సుమారుగా ఉంది. ఏదో ఒకటి ఇండియన్ భోజనం దొరుకుతోంది కదాని సంతోషించాం. పతయాలో ఒక హోటల్‌తో, బాంగ్‌కాక్‌లో ఒక హోటల్‌తో కాంట్రాక్టు పెట్టుకుని అక్కడే తినిపిస్తే మంచిదని టూరు ఆపరేటరుకి ఫీడ్బాక్ యిచ్చాను.
మంగళవారం ఉదయం 8 గంటలకు బయలుదేరి కోరల్ ఐలండ్ ట్రిప్‌కు వెళ్లాం. ఆ పూట చూసినవాటిని యీ వీడియో చూపిస్తుంది. మన తెలుగు సినిమాల్లో కనబడే పతయా రేవు దృశ్యాలన్నీ యిక్కడివే. ఇక్కణ్నుంచి స్పీడు బోట్లో ఓ చోటకి తీసుకెళ్లారు. అక్కడ ఎడ్వెంచర్ స్పోర్ట్స్ గురించి చెప్పి వాటికి విడిగా డబ్బు కట్టాలన్నారు. ముత్యాలముగ్గు స్టయిల్లో విడివిడిగా అయితే యింత, అదీయిదీ కలిపితే యింత డిస్కౌంట్ అన్నారు. డా. మురళి పేరా సెయిలింగ్ (గాలిలో బెలూన్‌కి మనం వేళ్లాడితే, బోటు స్పీడుగా ఓ రౌండు కొట్టి, రెండు సార్లు సముద్రంలో ముంచి తెస్తుంది) ఆ తర్వాత కోరల్స్ మధ్య, చేపల మధ్య అండర్ సీ వాకింగ్ చేశారు. వీడియో తీసి చూపిస్తే ఆయన భార్య కూడా సరదా పడి, ఆవిడా చేసింది. హార్ట్ ప్రాబ్లెమ్ కానీ, ఆస్త్మా కానీ ఉంటే చేయకూడదని చెప్తే హార్ట్ కారణంగా నేను సాహసించలేదు. పైగా ఆ తడి బట్టలతోనే యింకో మూడు గంటలపాటు తిరగాలి. ముందే చెప్తే వాటర్‌ప్రూఫ్ ప్యాంటు, కోటు తీసుకుని వెళ్లేవాళ్లమేమో! అండర్ వాటర్ వాకింగ్ ఎలా ఉంటుందో తెలియడానికి యీ వీడియో చూడండి.
అక్కణ్నుంచి మమ్మల్ని కోరల్ ఐలండ్‌కు తీసుకెళ్లారు. బీచ్ ఒడ్డున వాలుకుర్చీల్లో కాస్సేపు కూర్చుని, సముద్రంలో కాస్సేపు కేరింతలు కొట్టి వచ్చాం. కొబ్బరి బొండాలు చాలా రుచిగా ఉన్నాయి. కోరల్ ఐలండ్‌లో అంతకంటె చూడడానికి లేదన్నారు. చుట్టూ చాలా దీవులున్నాయట. బోటు నడపడం వస్తే వెళ్లి చుట్టి రావచ్చట. అక్కణ్నుంచి పతయాకు తిరిగి వచ్చేసరికి 12 అయింది. సముద్రం నుంచి తిరిగి వచ్చాం కాబట్టి స్నానం చేసి, 45 ని.లు ప్రయాణం చేసి నాంగ్ నూచ్ విలేజిలో ఉన్న బొటానికల్ గార్డెన్‌కి బయలుదేరాం. అది 500 ఎకరాల స్థలం. దానిలో ఎన్నెన్ని వింతలున్నాయో చెప్పతరం కాదు. వాటితో పాటు 1.30కు థాయ్ కల్చరల్ షో (ఆల్కజార్ షో లాగానే ఉంది). ఎలిఫెంట్ షో చూశాం. ఏనుగులు కొంటెగా ఆటలాడడం కూడా చూపించారు. ఆ తర్వాత బస్సెక్కి 20 ని.ల పాటు విలేజీలో చాలా స్థలాలు చూశాం. దీని టిక్కెట్టు మనమే పెట్టుకోవాలి. తక్కిన స్థలాలన్నిటిలో టిక్కెట్లన్నీ టూరు ఆపరేటరే పెట్టుకున్నాడు.
హోటల్‌కు తిరిగి వచ్చేసరికి 7.15 అయింది. భోజనం, నిద్ర. మర్నాడు, అంటే మూడో రోజున 9.15కల్లా హోటల్ ఖాళీ చేసి బాంగ్కాక్ బయలుదేరాం. పతయాలో టవర్ జంప్, ఆర్ట్ ఇన్ ప్యారడైజ్ 3డి మ్యూజియం ఉన్నాయి.
అవి మేము చూడలేక పోయాం. 5 వ రోజు బాంగ్‌కాక్‌లో చూపించిన డ్రీమ్ వ(ర)ల్డ్ స్థానంలో యివి చూసి ఉంటే, జెమ్స్ గ్యాలరీ కూడా యిక్కడే చూసి ఉంటే బాగుండేది. మీ అభిరుచి బట్టి, యీ ప్రోగ్రాంలో మార్పులు చేసుకోవచ్చు. ఎలాగూ కస్టమైజ్డ్ టూరే కదా.
బాంగ్కాక్ హోటల్లో చెకిన్ టైము మధ్యాహ్నం 2 గం. అందుకని బాంగ్కాక్ ఊరు చేరగానే మేడమ్ ట్యూసాడ్స్ మైనపు విగ్రహాల మ్యూజియానికి, ఓషన్ వ(ర)ల్డ్కి తీసుకెళ్లారు. . రెండిటికి మధ్య కాస్త నడవ వలసి వచ్చింది. తర్వాత భోజనం చేసి హోటల్ చేరేసరికి 3 దాటింది. రమదా డిఎమ్ఏ అని హోటల్ పేరు. డాబుగానే ఉంది. సౌకర్యవంతంగా ఉంది. స్టాఫ్ నిర్లక్ష్యంగా ఉంటారని రివ్యూల్లో ముందే చదివాను. దాన్ని నిజం చేస్తూ రూం బాయ్ మా మూడు కుటుంబాల సామాన్లూ కారిడార్‌లో పడేసి పోయాడు. మూడు రోజుల తర్వాత ఖాళీ చేసి వెళ్లేటప్పుడు సామాన్లు తీసుకెళ్లడానికి రాలేదు. మాకే కాదు, ఎవరికీ కూడా. అందరూ వాళ్ల సామాన్లు వాళ్లే తెచ్చుకున్నారు. రిసెప్షన్లో చెప్పినా పట్టించుకోరని కూడా రివ్యూల్లో రాశారు.
5వ రోజున మేం బయటి నుంచి వచ్చేసరికి రూము తలుపు ఓరగా తెరిచి ఉంది. మేన్టెనెన్స్ స్టాఫ్ ఉపయోగించే కార్డు స్లాట్‌లో పెట్టి ఉంది. పక్క రూము శుభ్రం చేసి వచ్చి తీసుకుంటారేమో ననుకుంటే ఎవరూ రాలేదు. మర్చిపోయి దర్జాగా వెళ్లిపోయారన్నమాట. తలుపు అలా తీసి ఉంటే ఎవరైనా లోపలకి వచ్చి వస్తువులు పట్టుకుపోవచ్చు కదా. మావేమీ పోలేదనుకోండి. రిసెప్షన్లో చెపితే ఓహో ఆలాగా అనేసి ఊరుకున్నారు కానీ విస్తుపోలేదు. క్షమాపణలు చెప్పలేదు. రివ్యూల్లో మరో విషయం కూడా రాశారు. దీనిలో ఇండియన్స్ ఎక్కువగా దిగుతారని, వాళ్లు బిగ్గరగా మాట్లాడతారనీ, రిసెప్షన్లో చెప్పినా పట్టించుకోరనీ యితర దేశస్తులు ఫిర్యాదు చేశారు. నాకు అదీ అనుభవమైంది.
రాత్రి తిరిగి వచ్చేసరికి మా రూము ఎదుటి రూములో కొందరు తమిళులు పోగడి పెద్ద గొంతుతో మాట్లాడుతూ ఉన్నారు, మా గది తలుపు మూసుకున్నా వినడేటంత బిగ్గరగా! 10.30 దాకా చూసి వెళ్లి చెపుదామనుకున్నాను. అంతలోనే ఓ పావుగంట ఆగుదామనుకున్నాను. చిత్రంగా పావుగంటలో సద్దు మణిగింది. నేను అప్పటికే ఇండియన్ మెంటాలిటీతో చిర్రెత్తి ఉన్నాను. దానికి కారణం ఆ సాయంత్రం రివర్ క్రూజ్‌పై జరిగిన సంఘటన. బాంగ్కాక్లోని నది పేరు చావో ఫ్రాయా. దానిపై నౌకావిహారం కూడా టూరు ప్రోగ్రాంలో ఉంది. ఆ స్థలానికి చేరేసరికి రంగురంగుల ఫౌంటెన్లు దర్శనమిచ్చాయి.
7.30కు క్రూజ్ ఎక్కాం. వెరైటీ ఐటమ్స్‌తో డిన్నర్ బాగుంది. ఓ అమ్మాయి మంద్రంగా పాడుతోంది. శాక్జోఫోన్తో ఒకతని వాద్యసహకారం. నదికి ఆ గట్టూ, యీ గట్టూ బాంగ్కాక్లోని భవంతులు. అవి గొప్పగా ఏమీ లేవు కానీ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. పావుగంట గడిచిందో లేదో ఇండియన్ ప్రయాణికులు వచ్చి మా వాళ్లలో ఒకడిది బర్త్‌డే ఉంది. కేక్ కట్ చేసుకుంటామని అడిగారు. సరేననగానే కేక్ కట్ చేశారో లేదో తెలియదు కానీ చెవులు పగిలే సౌండులో హిందీ, పంజాబీ పాటలతో హోరెత్తించేశారు. తాగేసి పిచ్చి డాన్సులు చేశారు. ఇలా గంటన్నర పాటు సాగింది. ఆ క్రూజ్ గాయనికి మళ్లీ ఛాన్సివ్వలేదు. తల వాచిపోయింది. టూరిస్టుల్లో ఇండియన్స్ ఎక్కువుంటే గోల తప్పదని ఒప్పుకోవలసి వచ్చింది.
నాల్గవ రోజు ఉదయం 8.45 కి బయలుదేరి గంట తర్వాత మెరైన్ పార్క్, సఫారీ వ(ర)ల్డ్కి వెళ్లాం. అక్కడ వరుసగా నాలుగు షోలు చూశాం. ఇంకా చాలానే ఉన్నట్లున్నాయి కానీ మా ప్రోగ్రాంలో నాలుగు పెట్టారు. స్కూలు పిల్లలు అనేకమంది వచ్చారు. వాళ్లను తప్పించుకుంటూ వెళ్లడం పెద్ద పనే. ఈ షోలు వేలాది మంది పట్టే గ్యాలరీలో పెట్టారు. కొద్దిపాటి చెమటలు తుడుచుకుంటూనే షోలు ఎంజాయ్ చేశాం. మొదటిది 10 గంటలకు ఉరాంగ్ ఉటాన్ జాతి కోతుల 15 ని.ల బాక్సింగ్. సీరియస్‌గా కాకుండా సరదాగా డిజైన్ చేశారు. ఆ తర్వాతది ఎలిఫెంట్ షో. అదీ 15 ని.లే. ఏనుగుల చేత ఆటలాడించడమే కాదు, బొమ్మలు గీయించారు కూడా. మూడోది స్పై వార్. 25 ని.ల షో. జేమ్స్ బాండ్ తరహా థ్రిల్స్‌తో అద్భుతంగా ఉంది. మంటలు, తుపాకీ కాల్పులు, స్పీడు బోట్లు, ఓహ్ చాలా హంగామాగా ఉంది. భోజనం తర్వాత పెట్టిన నాలుగో షో 15 ని.ల డాల్ఫిన్ షో. కోతులు కానీ, ఏనుగులు కానీ, డాల్ఫిన్లు కానీ వాళ్లు ట్రెయిన్ చేసిన విధానం అద్భుతం.
దీని తర్వాత పక్కనే ఉన్న యింకో పార్కుకి తీసుకెళ్లి జిరాఫీలను, సింహాలను, పులులకు మేత వేయడాన్ని చూపించారు. చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ఇవన్నీ చూసి హోటల్ చేరేసరికి 4 అయింది. కాస్సేపు రెస్టు తీసుకుని, పావు గంట నడకలో ఉన్న ఇంద్రా మార్కెట్‌కు వెళ్లవచ్చని చెప్పి గైడ్ వెళ్లిపోయింది. 5.30కు ఒక బిల్డింగులో ఉన్న ఇంద్ర మార్కెట్ చేరాం. రకరకాల వస్తువులు చౌకగా అమ్మే మార్కెట్టది. మంచి క్వాలిటీ ఉన్న టీ షర్టులు రూ.500-700 రేంజిలో ఉన్నాయి. షాపింగు అయ్యాక మన షేర్ ఆటో సైజున్న టుక్-టుక్‌లో హోటల్‌కి వచ్చేశాం.
5 వ రోజు ఉదయం 9కి బయలుదేరి ఊరికి దూరంగా ఉన్న డ్రీమ్ వ(ర)ల్డ్, స్నో టౌన్లకు వెళ్లాం. ఇది పెద్ద ఎమ్యూజ్మెంట్ పార్కు. రోలర్ కోస్టర్లు, కేబుల్ కారు, 4 డి షో, చుట్టూ తిరగడానికి ట్రెయిన్.. యిలాటివన్నీ ఉన్నాయి. ముందు రోజులాగే యిక్కడా అనేకమంది స్కూలు పిల్లలు. ఈ పార్కు చిన్నపిల్లలకు చాలా బాగుంటుంది కానీ ముందు రోజు కూడా యిలాటి పార్కులోనే తిరిగాం కాబట్టి యిది మాకు బోరు కొట్టేసింది. నిజానికి యిది కావాలని నేను అడగలేదు. బాంగ్కాక్ టూరు ఆపరేటరే కలిపాడు. భోజనం కూడా నచ్చలేదు. వచ్చినవాళ్లలో ఇండియన్స్ అరుదు కాబట్టి అక్కడి ఇండియన్ సెక్షన్లో ఐటమ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. థాయ్, యితర ప్రాచ్య దేశాల వంటకాలే ఎక్కువున్నాయి. థాయ్, చైనీస్, జాపనీస్ వెజిటేరియన్ సూప్‌లు, సలాడ్లు తిని చూశాను కానీ చుట్టూ ఆవరించి ఉన్న వాసన భరించతరం కాలేదు. మన నాన్‌వెజ్ వాసనలా ఉండదు, వాళ్ల నాన్‌వెజ్ వాసన!
భోజనం కాగానే మేం బయలుదేరి పోయాం. మూడు గంటల కల్లా బిగ్ సి అనే షాపింగ్ మాల్ దగ్గర దింపేయమని గైడ్‌కి చెప్పి, షాపింగులో పడ్డాం. మర్నాడు ఆరో రోజు ఉదయం 12 గంటల దాకా హోటల్ రూములోనే ఉన్నాం. మాలో కొందరు షాపింగుకి వెళ్లారు. 12 గంటలకు రూము ఖాళీ చేసి బయట పడ్డాం. సాయంత్రం 6.30 వరకు ఎయిర్‌పోర్టుకి వెళ్లనవసరం లేదు. ఈ లోపున గోల్డెన్ బుద్ధ చూశాం. . మార్బుల్ టెంపుల్ చూపిస్తామని ప్రోగ్రాంలో ఉన్నా మరమ్మత్తులు జరుగుతున్నాయంటూ చూపించలేదు. రిక్లయినింగ్ బుద్ధ అని మరొకటి ఉంది. అదీ చూడలేదు. బాంగ్‌కాక్‌లో ట్రాఫిక్ చాలా ఎక్కువ. వెళ్లి రావడాల్లో చాలా టైము వేస్టవుతుంది.
భోజనం చేశాక జెమ్స్ గ్యాలరీకి తీసుకెళ్లారు. అక్కడ రెండు గంటల సమయం అవసరం. కానీ మాకు 45 ని.లు మాత్రమే దొరికింది. చేత్తో చేసిన అందమైన జ్యూయలరీ చూసి ముచ్చటపడి జూకాలు తీసుకున్నాం. 5% వ్యాట్ ఎయిర్‌పోర్టులో తిరిగి యిచ్చేస్తారని చెప్పారు. 6.45కి ఎయిర్‌పోర్టు చేరాం. చెకిన్‌కు సమయం పట్టింది. దానికి ముందే వ్యాట్ రిఫండ్ కౌంటర్ దగ్గరకు వెళ్లి, వస్తువు, బిల్లులు చూపించి ఓ పేపరుపై స్టాంపు వేయించుకోవాలి. సెక్యూరిటీ చెకిన్ అయ్యాక యింకో కౌంటర్‌కి వెళ్లి యీ పేపరు చూపిస్తే థాయ్ బాత్‌లలో డబ్బు తిరిగిచ్చారు. థాయ్ ఎయిర్వేస్ వారి టిజి 329 ఫ్లయిట్ 10.15కి. ఇంకో గంటకు భోజనం పెట్టారు. మూడున్నర గంటలు ప్రయాణం చేసి హైదరాబాదు చేరేసరికి శనివారం రాత్రి 12.30 అనగా తెల్లవారితే ఆదివారం. యాత్ర ముగిసింది.
ఇక్కడో రెండు విషయాలు. వయసు వస్తున్న కొద్దీ మూత్రవిసర్జనకు ఎక్కువసార్లు వెళ్లాల్సి వస్తుంది. ప్రయాణం అనగానే ఆ సౌకర్యం ఉందో లేదో, వెళ్లిన చోట నీట్‌గా ఉంటుందో లేదో అనే ఆలోచన తప్పక వస్తుంది. ఈ టూరులో ఆ యిబ్బంది ఏమీ పడలేదు. ఇంకోటి థాయ్‌లాండ్ అనగానే మసాజ్‌కి వెళ్లావా? అనడంతో దానికి చెడ్డపేరు వచ్చింది కానీ అక్కడ మసాజ్ సెంటర్లన్నీ గ్లాస్ డోర్లతో ఓపెన్‌గానే ఉన్నాయి. ఆయిల్ రాసే అవసరం లేదు కాబట్టి బట్టలు వేసుకునే చేయించుకుంటున్నారు. ఏం జరుగుతోందో బయటివాళ్లకు కూడా కనబడుతుంది. వేరే రకంవి ఉంటే గుట్టుగా జరగవచ్చు. మేమెవరూ మసాజ్ చేయించుకోలేదు కానీ చేయించుకున్నవాళ్లు చెప్పారు, గంటకు రూ. 500 తీసుకుంటారట. చాలా ఉత్తమంగా, రిఫ్రెషింగ్‌గా ఉంటుందట.
ఈ వ్యాసం చదివి థాయ్‌లాండ్ వెళదామని ఆలోచించే నా వయసువారికి యిచ్చే సలహా ఏమిటంటే 5వ రోజు నాటి డ్రీమ్‌లాండ్ వద్దని చెప్పండి. దానికి బదులు మూడో రోజు పతయాలో ఉదయం ఆర్ట్ మ్యూజియం, హోటల్ నుంచి బయటకు వచ్చాక పతయా టవర్, భోజనం అయ్యాక జెమ్స్ గ్యాలరీ చూసి సాయంత్రానికి బ్యాంగ్కాక్కు రండి. 5వ రోజు మేడమ్ ట్యుసాడ్, ఓషన్ వ(ర)ల్డ్, మార్పుల్ బుద్ధ కవర్ చేయండి. 6 వ రోజు గోల్డెన్ బుద్ధ, రిక్లెయినింగ్ బుద్ధ చూసి ఎయిర్‌పోర్టుకి బయలుదేరండి. టైముంటే మధ్యలో షాపింగు చేయండి. మన దగ్గర దొరకని బ్రాండ్ చాక్లెట్లు వగైరాలు అక్కడున్నాయి. షాపింగులో అన్నీ మోడర్న్ వస్తువులే కనబడ్డాయి. ఆర్ట్‌కి, హస్తకళలకు సంబంధించిన వస్తువులు కనబడలేదు. గోల్డెన్ బుద్ధ దగ్గర మాత్రం పెయింటింగ్స్ కనబడ్డాయి కానీ రేటు ఎక్కువగా ఉంది. మా యాత్ర మొత్తం ఖర్చు షాపింగు కాకుండా తలకు రూ.90 వేల లోపునే అయిపోయింది. ఉన్న ఊళ్లోనే ఉంటే పుస్తకంలో ఒక పేజీ దగ్గరే ఆగిపోయినట్లు లెక్క. పేజీలు అటూయిటూ తిరగేయాలంటే యాత్రలు చేయాలి కదా! (ఫోటో – ఎడమవైపు పతయాలోని నాంగ్నూచ్ విలేజి, అండర్ సీ వాకింగ్, కుడివైపు బాంగ్కాక్లోని గోల్డెన్ బుద్ధ, సఫారీ వ(ర)ల్డ్ లోని ‘‘స్పై వార్’’ షో)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2022)