Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: థాయ్‌లాండ్ చరిత్ర, రాజకీయాలు

ఎమ్బీయస్‍: థాయ్‌లాండ్ చరిత్ర, రాజకీయాలు

గత నెల చివరి వారంలో నేను వెకేషన్‌కై థాయ్‌లాండ్ వెళ్లివచ్చాను. బాంగ్‌కాక్, పట్టయా (వాళ్లు పతయా అంటున్నారు) అనగానే చూడ్డానికి ఏముంది, బీచ్‌లు, మసాజ్‌లు, షాపింగు తప్ప అనుకుంటారు చాలామంది. చాలానే ఉన్నాయని తెలుసుకుని, మూడు కుటుంబాలు ఆరురోజుల కస్టమైజ్‌డ్ ట్రిప్ ఏర్పాటు చేసుకుని వెళ్లి వచ్చాం. పాఠకులు ఆసక్తి కనబరిస్తే దాని వివరాలు మరో వ్యాసంలో క్లుప్తంగా చెప్తాను. ఎందుకంటే కరోనా కారణంగా టూరిజం పూర్తిగా చచ్చిపోయింది. థాయ్‌లాండ్‌లో కూడా గత నాలుగు నెలలగానే పుంజుకుంటోంది. మళ్లీ మామూలు మనుషుల మయ్యామని మనకు మనం నిరూపించుకోవడానికి యాత్రలు చేయడం అవసరమని నా భావన. ఈ ట్రిప్పు తలకు రూ.90 వేల లోపునే అయిపోయింది. ఎక్కడా ఖాళీ లేకుండా, బోరు కొట్టకుండా గడిచిపోయింది. పాఠకులలో యాత్రాసక్తి ఉన్నవారు విదేశీ పర్యటనలు చేయాలని నా అభిలాష.

ఎక్కడికైనా వెళ్లబోయే ముందు ఆ దేశపు చరిత్ర, రాజకీయాలు తెలుసుకోవాలని నాకు కుతూహలం. థాయ్‌లాండ్‌కు అరడజను సార్లు వెళ్లినవాళ్లు సైతం దాని చరిత్ర తెలుసుకుని ఉంటారని నేననుకోను. అక్కడికి వెళ్లాక మనకు ఎలాటి గైడ్ దొరుకుతాడో మనకు తెలియదు. వాళ్ల ఇంగ్లీషు మనకు ఏ మేరకు అర్థమవుతుందో తెలియదు. అందుకని వికీపీడియాలో 34 పేజీలు చదివి, యీ నోట్సు తయారు చేసుకున్నాను. అది మంచిదైంది. ఎందుకంటే ఆ దేశంలో ఇంగ్లీషు బొటాబొటీగా మాట్లాడతారు. గైడ్‌ను చరిత్ర గురించి అడిగే సాహసం చేయలేదు. పైగా అక్కడ చారిత్రక చిహ్నాలు కూడా ఏమీ చూపించలేదు కాబట్టి అడిగే సందర్భమూ రాలేదు. మీరు థాయ్‌లాండ్ వెళ్లకపోయినా, భారతదేశంతో శతాబ్దాలుగా లింకు ఉన్న

ఒక దేశ చరిత్ర తెలుస్తుందనుకుంటే దీన్ని చదవవచ్చు. బోరనుకుంటే వదిలేయవచ్చు. నేను 2016లో థాయ్‌లాండ్ రాజకీయాలపై రాసిన ఒక వ్యాసం లింకు యిక్కడ యిస్తున్నాను. దాని ద్వారా కొంతే తెలుస్తుంది.

కొన్ని శతాబ్దాల చరిత్రకు ఇది ఒక విహంగావలోకనం. థాయ్‌లాండ్ గురించిన వార్తలు కూడా మన మీడియాలో పెద్దగా రావు కాబట్టి పూర్వపరిచయం బొత్తిగా లేదు మనకు. మొత్తం సరికొత్తగా వింటున్నాం కాబట్టి, అంతకు ముందు వినని చాలా పేర్లు దొర్లుతాయి కాబట్టి, కాస్త నెమ్మదిగా చదివితే తప్ప గందరగోళంగా ఉంటుంది. థాయ్‌లాండ్‌లో భారత ప్రభావం, సంస్కృత ప్రభావం కొట్టవచ్చినట్లు కనబడుతుంది. బౌద్ధం సంగతి సరేసరి. బ్యాంగ్‌కాక్ ఎయిర్‌పోర్టు పేరు సువర్ణభూమి. అక్కడ క్షీరసాగర మథనంలో కూర్మావతార ఆవిర్భావం శిల్పం పెద్ద సైజులో ఉంటుంది. రాజుల పేర్లు రామా 1, 2, 3... చాలాకాలం రాజ్యమేలిన వంశం పేరు అయోత్తియా (అయోధ్యకు వికృతి). కొన్ని రామా పేరుతో ముఖ్య రహదారులు, పార్కులు ఉన్నాయి.

థాయ్‌లాండ్ పేరు 1939లో వచ్చింది. అంతకుముందు దీని పేరు సియాం (మన పేపర్లలో సయామీస్ ట్విన్స్‌పై వ్యాసాలు రాసినప్పుడు సయాం అని రాసేవారు. వాళ్లు సియాం అనే అంటున్నారు). దీనిపై భారతదేశ ప్రభావం క్రీస్తు శకం మొదటి శతాబ్దం నుంచి ఉంది. అప్పట్లో ఫ్యునాన్ రాజ్యం ఉండేది. భారత సంతతికి చెందిన రాజ్యాలు ద్వారావతి (మధ్య థాయ్‌లాండ్ 7-10 శతాబ్దాలు)  శ్రీవిజయ (సుమత్రాకు చెందినవాడు, దక్షిణ థాయ్‌లాండ్‌ను పాలించాడు), ఖ్మేర్ (వీరి ప్రధాన స్థావరం కంపూచియా (కంబోడియా)) వగైరాలు. అశోకుడి కాలం నుంచి బౌద్ధం యిక్కడ ప్రవేశించింది. మౌర్యుల ప్రభావం, పల్లవుల ప్రభావం, గుప్తరాజుల ప్రభావం చూడవచ్చు రాజేంద్ర చోళుడు 1, 11వ శతాబ్దంలో దక్షిణ థాయ్‌లాండ్‌లోని తామ్రలింగ రాజ్యాన్ని జయించాడు. అక్షాంశం ప్రకారం చూస్తే వైజాగ్‌ లెవెల్లో ఉంది. మధ్యలో సముద్రమే అడ్డు. అందుకని దక్షిణ రాజ్యాలు దాడి చేయగలిగాయి.

ప్రస్తుతం చైనాలో ఉన్న గువాంగ్జీ ప్రాంతంలో థాయ్ తెగవారు ఉండేవారు. క్రీ.శ. 700లో వాళ్లు చైనా దాడులకు తట్టుకోలేక, కొందరు వియత్నాంకు, కొందరు యీ దేశానికి తరలి వచ్చారు. ఈ దేశానికి వచ్చినవారిలో సింహనావతి అనే థాయ్ నాయకుడు స్థానికులను జయించారు. తెరవాద బౌద్ధాన్ని స్వీకరించి, తమ పేర్లను సంస్కృతంలోకి మార్చుకున్నారు. 1351 నుంచి 1767 వరకు ఏలిన ఆయుత్తయ వంశం తమ పేరును అయోధ్య నుంచి స్వీకరించింది. పొరుగున ఉన్న కంపూచియాలోని అంగ్‌కర్ రాజ్యం హిందూ రాజ్యం కాబట్టి, తమది తెరవాద బౌద్ధం అంది. పశ్చిమ దేశాలు దీన్ని సియాం రాజ్యంగా గుర్తించాయి. 16 శతాబ్దంలో పాశ్చాత్య దేశాలతో వర్తకవాణిజ్యాలు జరపడంతో ఆర్థికంగా దేశం బాగుపడింది. ఆయుత్తయ నగరం 1770 క్రీ.శ.లో 10 లక్షల జనాభాతో ప్రపంచంలోనే ముఖ్య నగరాలలో ఒకటిగా మారింది. 16వ శతాబ్దం మధ్యలో బర్మాతో యుద్ధాలు జరిగాయి. ఈ ఆయుత్తయ రాజ్యం మలయా, అండమాన్, కంపూచియాలను ఒక దశలో జయించింది. చివరకు 1767లో బర్మా చేతిలో ఓడిపోయింది. ఆయుత్తయ నగరాన్ని భస్మం చేస్తే అది పాడుపడిపోయి అడవుల్లో కప్పడిపోయింది. 1930లో దాన్ని కనుగొన్నారు.

ఆయుత్తయ రాజ్యం విచ్ఛిన్నమై దేశం బర్మా పాలనలో మగ్గింది. దేశం అయిదు ప్రాంతాలుగా విడిపోయింది. అప్పుడు చైనీస్ మూలాలున్న తక్సిన్ అనే వీరుడు బర్మా సైన్యంతో పోరాడి ఒక ఏడాదిలోనే తన ప్రాంతంలోని బర్మా సైన్యాన్ని తరిమివేసి తోన్‌బురిలో రాజ్యాన్ని నెలకొల్పాడు. తర్వాత తక్కిన ప్రాంతాల రాజులను ఓడించి దేశాన్ని ఐక్యం చేశాడు. ఇతని పాలనలో చైనా వాళ్లు వలస వచ్చి స్థిరపడ్డారు. జీవిత చరమాంకంలో తక్సిన్‌ మతిభ్రష్టుడు కావడంతో జనరల్ చక్రి అనే సైన్యాధికారి 1782లో కుట్ర చేసి అతన్ని ఉరితీసి రామా 1 అనే పేరుతో అధికారంలోకి వచ్చాడు. రత్తనకోసిన్ దీవి రాజధానిగా చక్రి వంశాన్ని నెలకొల్పాడు. ఈ దీవి యిరువైపులా ఉన్నదే బాంగ్‌కాక్. 1790లో బర్మా సైన్యాన్ని దేశం నుంచి పూర్తిగా తరిమివేశాడు. 1805 కల్లా దేశంలోని ఉత్తర భాగం యితని పాలన కిందకు వచ్చింది. కంపూచియాను సామంత రాజ్యంగా చేసుకున్నాడు. అధికారాన్ని కేంద్రీకృతం చేశాడు.

ఇతని పాలనలోనే బాంగ్‌కాక్ వర్ధిల్లింది. ఎమరాల్డ్ బుద్ధా నిర్మించాడు. చట్టాలు ఏర్పరచాడు. కళలను పోషించాడు. బౌద్ధ జాతక కథ దశరథ జాతక కథ ఆధారంగా థాయ్‌లాండ్ పద్ధతిలో రాసిన రామాయణ గాథ 3 వేల పేజీల ‘రామకియా’ యితని కాలంలోనే రాయబడింది. చైనా నుంచి పర్షియా వరకు అనేక దేశాల రచనలను థాయ్ భాషలోకి అనువదింప చేశాడు. ఇతని తర్వాత యితని కుమారుడు రామా 2 చిన్న కుట్ర జరిపి అధికారంలోకి వచ్చాడు. ఇతని కాలంలోనూ కళలు వర్ధిల్లాయి. 1821లో మలయా ద్వీపకల్పంలోని కేడాపై దండెత్తడంతో బ్రిటన్‌కు కోపం వచ్చింది. చివరకు 1825లో సంధి కుదిరింది. క్రైస్తవ మతప్రచారకులు రాసాగారు. ఇతని తర్వాత ఇతని కుమారుడు రామా 3 అధికారంలోకి వచ్చాడు. అతను వాట్ ఫో దేవాలయం కట్టాడు. అదే దేశంలో తొలి యూనివర్శిటీ. రామా 3 కాలంలోనే పాశ్చాత్య దేశాలను రానీయాలా వద్దా అనే దానిపై దేశంలో చర్చ జరిగింది. రానిస్తే టెక్నాలజీ వస్తుందని కొందరు, దేశసంస్కృతి నాశనమౌతుందని కొందరు వాదించారు. 1851లో రామా 3 మరణంతో సియామీ రాజుల శకం దాదాపు అంతరించినట్లే.

రామా 3 తర్వాత అతని సవతి తమ్ముడు మాంగ్‌కుట్ సింహాసనమెక్కి, రామా 4 పేరుతో దేశాన్ని ఏలాడు. ఇతను పాశ్చాత్య టెక్నాలజీ వైపు, సంస్కృతి వైపు మొగ్గు చూపాడు. యూల్ బ్రిన్నర్, డెబొరా కెర్ నటించిన మ్యూజికల్ ‘‘కింగ్ అండ్ ఐ’’ (1956) లో కనిపించే సియాం రాజు యితనే. 26 ఏళ్లు బౌద్ధసన్యాసిగా ఉన్న యితను ఇంగ్లీషు మాట్లాడగలిగేవాడు. 1880లో బ్రిటిషు వాళ్లు బర్మాను ఓడించి వలసరాజ్యంగా చేసుకోవడంతో యితను జాగ్రత్తపడి పాలనలో ప్రజలకు భాగస్వామ్యం యిచ్చాడు. చుట్టూ ఉన్న దేశాలను బ్రిటిషు వారు స్వాధీనం చేసుకుంటూండడం చూసి, ముందు జాగ్రత్తగా ఒప్పందం చేసుకుని, రేవుల్లో దిగుమతి సుంకాన్ని రద్దు చేశారు. దీనివలన రాజు ఆదాయం పోయింది కానీ దేశం విదేశాల పాలు కాలేదు. ఇలాగే ప్రష్యా, ఆస్ట్రియా-హంగరీలతో కూడా ఒప్పందాలు చేసుకున్నారు. దీనివలన పశ్చిమ దేశాల్లో తయారైన పారిశ్రామిక వస్తువులకు సియాం సేల్స్ మార్కెట్‌గా మారింది. సియాం నుంచి బియ్యం, టీక్, ముడి ఖనిజాలు ఎగుమతి అయ్యేవి.

రామా 3, 4 పన్ను రాయితీలు యిచ్చి, చైనా నుంచి వలసలను అనుమతించి, వ్యవసాయాన్ని ప్రోత్సహించారు. రోడ్లు, కాలువలు, రైల్వే మార్గాలు కట్టి రవాణా సౌకర్యాలను పెంచారు. రామా 4 కుమారుడు, వారసుడు రామా 5 పాశ్చాత్య విద్య నభ్యసించాడు. 1868లో అధికారానికి వచ్చి, పాలనలో తండ్రి పంథా నవలంబించాడు. ఇప్పటికే బ్రిటన్ ఇండియా, బర్మా, మలయా ఆక్రమించింది. అటువైపు ఫ్రాన్స్ వియత్నాం, కంపూచియా ఆక్రమించింది. ఒక చిన్న సంఘటన కారణంగా ఫ్రాన్స్‌తో వివాదం వచ్చి, 1893లో ఫ్రాన్స్ సియాంకు చెందిన సామంత రాజ్యమైన లావోస్‌ను గెలుచుకుంది. సియాంను బఫర్ స్టేట్‌గా ఉంచాలని ఫ్రాన్స్, బ్రిటన్ ఒక ఒప్పందానికి వచ్చాయి. తర్వాతి సంవత్సరాల్లో వీళ్లిద్దరూ కలిసి సియాం సరిహద్దులను మార్చేశారు. 1910లో రామా 5 మరణించేనాటికి థాయ్‌లాండ్‌కు ప్రస్తుతం ఉన్న సరిహద్దులు స్థిరపడ్డాయి.

రామా 5 తర్వాత, అతని కొడుకు వజిర వుధ్ రామా 6 పేరుతో అధికారంలోకి వచ్చాడు. అతను ఆక్స్‌ఫర్డ్‌లో చదివి వచ్చాడు. 15 ఏళ్ల అతని పాలనలో దేశాన్ని మరింత ఆధునీకరించాడు. అందరికీ విద్య అందించాడు. స్త్రీలను ఆధునిక వస్త్రధారణవైపు ప్రోత్సహించాడు. కళలను ప్రోత్సహించాడు. తను స్వయంగా అనేక విదేశీ రచనలను థాయ్ భాషలోకి అనువదించాడు. ఇతని పాలనలో చైనా నుంచి చాలామంది వలస వచ్చి పడినా థాయ్ సంస్కృతిలో భాగం కాకుండా విడిగా ఉండిపోయారు. 1912లో అతనిపై కుట్ర జరిగింది కానీ భగ్నమైంది. 1917లో మొదటి ప్రపంచ యుద్ధం వచ్చినపుడు బ్రిటన్, ఫ్రాన్స్ మెప్పు కోసం సియాం జర్మనీపై యుద్ధం ప్రకటించింది. యుద్ధానంతరం అవి సియాంకు కొన్ని రాయితీలు యిచ్చాయి. రామా 6 తన 44వ ఏట 1925లో అకస్మాత్తుగా మరణించాడు.

అతని తర్వాత అతని తమ్ముడు ప్రజాధిపోక్ అధికారంలోకి వచ్చాడు. అతను ఏడేళ్లు పాలించాక విదేశాల్లో చదువుకుని వచ్చిన కొందరు విద్యార్థులు ఖానా రత్సదాన్ పేర గ్రూపుగా ఏర్పడి మేధావులు, సైనికాధికారుల సహాయంతో 1932లో శాంతియుత విప్లవాన్ని తీసుకుని వచ్చారు. బ్రిటన్ రాజు తరహాలో ప్రజాధిపోక్ నామమాత్రపు రాజు అయ్యాడు. ఛాందసభావాలున్న న్యాయవాది నితితాదాను తొలి ప్రధానిగా నియమించారు. కానీ ఎన్నికలు జరపలేదు. రాజకీయ పార్టీలను అనుమతించలేదు. మిలటరీ, బ్యూరాక్రసీ కలిసి పార్లమెంటుగా ఏర్పడి పాలించాయి. కొద్ది కాలంలోనే విప్లవకారుల్లో విభేదాలు పొడసూపాయి. ప్రీడీ అనే ఒకతను సామ్యవాద సిద్ధాంతాలను ప్రతిపాదిస్తే పార్రమెంటులో అతనికి మెజారిటీ ఉందని భయపడిన ప్రధాని పార్లమెంటును రద్దు చేసి, అధికారాన్ని తన చేతిలోకి తీసుకోబోయాడు. కానీ ప్రీడీ అనుచరులు అతన్నే దింపేసి ఫాహాన్ అనే అతన్ని 1933లో ప్రధానిగా నియమించారు. అతను ప్రీడీ విధానాలను కొద్దిగానే అమలు చేసి, అతన్ని పక్కకు నెట్టేశాడు.

విప్లవకారుల్లో కొందరు సామ్యవాదం వైపు మొగ్గితే, మరి కొందరు ఫాసిస్టు విధానాల వైపు మొగ్గారు. వారిలో గందరగోళం ఉండడంతో రాజుగారి విధేయులు కుట్ర చేసి ఓడిపోయారు. దాని తర్వాత రాజు రాజ్యత్యాగం చేసి విదేశాలకు వెళ్లిపోయాడు. అతని స్థానంలో అతని మేనల్లుడైన 9 ఏళ్ల కుర్రాణ్ని రాజుగా ప్రతిష్ఠాపించి రామా 8 అన్నారు. కుట్రను భగ్నం చేసిన ఫిల్‌బన్ అనే ఫాసిస్టుకి ప్రజాదరణ పెరగడంతో అతను 1938లో ప్రధానిగా అయ్యి, సైన్యానికి ఎక్కువ ప్రాధాన్యత యిస్తూ, అధికారాలన్నీ తన చేతిలో పెట్టుకోసాగాడు. జాతీయ భావాలను రెచ్చగొట్టడానికి సియాం పేరును థాయ్‌లాండ్‌గా మార్చాడు. ‌డాయిష్‌లాండ్ పేరుతో హిట్లర్ జర్మన్లను రెచ్చగొట్టిన తరహాలో వియత్నాం, కంపూచియాలు కూడా థాయ్ జాతి వారివే అనీ, అన్నీ థాయ్‌లాండ్ కిందకు రావాలని ప్రచారం చేశాడు. రెండవ ప్రపంచయుద్ధంలో ఫ్రాన్స్ బలహీనంగా ఉండడం చూసి, 1941లో సియాం ఫ్రాన్స్‌పై దాడి చేసి అది అక్రమించుకున్న లావోస్, కంపూచియాలను హస్తగతం చేసుకుంది.

రెండవ ప్రపంచయుద్ధం రాగానే మొదట్లో తటస్థంగా ఉంటామన్నాడు కానీ త్వరలోనే జపాన్‌ ఒత్తిడికి లొంగిపోయి వారి కీలుబొమ్మగా మారిపోయాడు. జపాన్ యుద్ధంలో ఓడిపోవడంతో అతను పదవి వదిలేయవలసి వచ్చింది. మిత్రదేశాలు థాయ్‌లాండ్‌ను ఆక్రమించాయి. ఫ్రాన్స్ నుంచి గెలుచుకున్న ప్రాంతాలన్నీ వెనక్కి యివ్వాల్సి వచ్చింది. 1946లో తొలి ఎన్నికలు జరిగాయి. ప్రీడీ పార్టీకి మెజారిటీ వచ్చి అతను ప్రధాని అయ్యాడు. యుద్ధసమయంలో యూరోప్‌లో తలదాచుకున్న రాజు ఆనంద వెనక్కి వచ్చాడు కానీ ఆర్నెల్లకే హత్యకు గురయ్యాడు. ఎవరు చంపించారో నేటికీ మిస్టరీయే. అతని తమ్ముడు భూమిబల్ రాజయ్యాడు. రాజుహత్యలో ప్రీడీ పాత్ర ఉందన్న అనుమానంపై అతన్ని పదవి నుంచి తప్పించారు. అతని నిష్క్రమణతో పౌరప్రభుత్వం బలహీనపడింది. అదే అదనుగా 1947లో మిలటరీ ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకుని ఫిల్‌బన్‌ను వెనక్కి రప్పించి అతన్ని ప్రధాన్ని చేసి ప్రీడీని తరిమేసింది.

ఫిల్‌బన్ హయాంలో నియంతృత్వం రాజ్యమేలింది. రాజకీయంగా విభేదించిన వారిని చంపించి వేశారు. ప్రీడీ అనుచరులు తిరుగుబాట్లు చేయబోయినా విఫలమయ్యాయి. చివరకు 1957లో శరత్ తనారత్ అనే ఫీల్డ్ మార్షల్ రక్తరహితమైన కుట్ర చేసి ఫిల్‌బన్‌ను దింపేసి, అధికారంలోకి వచ్చాడు. అప్పణ్నుంచి మిలటరీ ప్రభుత్వాలన్నిటికి అమెరికా మద్దతు యిస్తూ వచ్చింది. 1963లో శరత్ చనిపోయిన తర్వాత అతని సహచర సైనికాధికారి థానోమ్ అధికారంలోకి వచ్చి పాలించాడు. అమెరికా వియత్నాంతో యుద్ధం చేసే రోజుల్లో థాయ్‌లాండ్ అమెరికాకు సహకరించింది.  అమెరికా తన సైనిక స్థావరాలు పెట్టుకోవడానికి అనుమతించింది.

అమెరికాతో సాన్నిహిత్యం థాయ్‌లాండ్ సంస్కృతిని మార్చేసింది. డబ్బు ధారాళంగా వచ్చి పడడంతో పరిశ్రమలు పెరిగాయి. కానీ అమెరికన్ సైనికులకు థాయ్‌లాండ్ ఆటవిడుపు స్థలంగా మారింది. దాంతో థాయ్‌లాండ్ గ్రామీణులు బాంగ్‌కాక్‌కు వలస వచ్చి వ్యభిచార వృత్తిలో దిగారు, డ్రగ్స్‌కి అలవాటు పడ్డారు. పాశ్చాత్య జీవనసరళి నేర్చుకున్నారు. విలాసాలకు మారుపేరుగా దేశం పేరుబడింది. దేశజనాభా విపరీతంగా పెరిగింది. అమెరికా మద్దతుతో సాగిన సైన్యపరిపాలనలో అవినీతి పెరిగింది, ధనిక-పేద వ్యత్యాసం పెరిగింది. వ్యభిచారం పెద్ద సమస్యగా మారింది. పత్రికా స్వేచ్ఛను హరించారు. ఈ సమయంలో 1973లో విద్యార్థులు ఆందోళన చేశారు. అది హింసాత్మకం కావడంతో రాజు భూమిబల్, ప్రధానిగా ఉన్న ఫీల్డ్ మార్షల్ థానోమ్‌ను తీసివేసి, సాన్యా అనే లా ప్రొఫెసర్‌ను ప్రధానిని చేశాడు. కొంతకాలం పాటు ప్రజాస్వామ్యం, ఎన్నికలు నడిచాక 1976 అక్టోబరులో మళ్లీ సైనిక పాలన వచ్చింది. 1980లలో ప్రజాస్వామ్యం, 1991-93 మధ్య సైనిక పాలన తర్వాత ప్రస్తుతం ప్రజాస్వామ్యం ఉంది.

2001 నుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే తక్సిన్ షినవత్రా అనే వ్యాపారవేత్త కేంద్రంగా నడుస్తోంది. అతను 2001లో అధికారంలోకి వచ్చాడు. ఎన్నో సంస్కరణలు చేసి, సమర్థవంతంగా పాలించినా, అధికారం చలాయించడానికి, అవినీతికి పేరుపడ్డాడు. ప్రజలు తిరుగుబాటు చేశారు. 2006లో కుట్ర చేసి అతన్ని దింపేశారు. కానీ 2007 ఎన్నికలలో షినవత్రా అనుచరులు ఎన్నికల్లో నెగ్గారు. కానీ మళ్లీ వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి. ఇదే అదనుగా 2010లో మిలటరీ అధికారం చేజిక్కించుకుంది. 2011 ఎన్నికలలో షినవత్రా చెల్లెలు ఇంగ్‌లక్ నెగ్గి ప్రధాని అయింది. 2013లో మళ్లీ వ్యతిరేక ప్రదర్శనలు, 2014లో మళ్లీ మిలటరీ కుట్ర. నాయకుడు ప్రయుత్. అతను ఐదేళ్ల పాటు నియంతలా పాలించి 2019లో పేరుకి ఎన్నికలు జరిపి, తనే ప్రధాని అయిపోయాడు. ఇప్పటికీ ప్రధానిగానే ఉన్నాడు.

ప్రవాసంలో ఉన్న షినవత్రా రాజకీయాలను యింకా ప్రభావితం చేస్తున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో, ఉత్తర భాగంలో అతనికి మద్దతు ఉంది. రాజధానిలోని మధ్యతరగతి వాళ్లు, దక్షిణ ప్రాంతాల వాళ్లు అతనికి వ్యతిరేకులు. రాజు భూమిబల్ 2016లో మరణించాడు. అతని వారసుడిగా వచ్చిన మహా వజ్రలాంగ్‌కర్ణకు అంత మంచి పేరు లేదు. అతనే ప్రస్తుత రాజు. జనాభాలో 85-90 శాతం బౌద్ధులు. 5-10 ముస్లిములు. ఆర్థికపరిస్థితి బాగానే ఉంది. బహిరంగంగా ఆంక్షలు ఏమీ కనబడవు. రాజుగారి బొమ్మలు అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి. ఇదీ థాయ్‌లాండ్ చరిత్ర, రాజకీయాల పరిచయం. ఇది తెలుసుకోకపోయినా హాయిగా పర్యటించి రావచ్చు. (ఫోటో- బ్యాంగ్‌కాక్ లోని సువర్ణభూమి ఎయిర్‌పోర్టులో క్షీరసాగర మథనం శిల్పం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2022)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?