తెలంగాణాలో ఈడీ, సీబీఐ, ఐటీలకు బోలెడు పని పడింది. ఈ సంస్థలకు చెందిన అధికారులు అక్కడ రోజుకొక కొత్త కేసుని నమోదు చేస్తున్నారు. విచారణల మీద విచారణలు చేస్తున్నారు. గత కొంతకాలంగా ఈ వార్తలే ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ గా సాగుతున్న రాజకీయ పోరులో కేంద్ర దర్యాప్తు సంస్థలను మధ్యలోకి తీసుకువచ్చారని గులాబీ దండు అంటోంది.
ఇది పూర్తిగా బీజేపీ రాజకీయ వత్తిడితో చేస్తున్న పని అని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. అయినా ఈడీ, సీబీఐ, ఐటీ దూకుడు ఎక్కడా ఆగడంలేదు. ఇపుడు ఆ దర్యాప్తు సంస్థలు ఏపీకి కూడా రావాలని బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు కోరుకుంటున్నారు. ఏపీకి ఎందుకు ఈ సంస్థలు రావు, ఎందుకు దాడులు చేయవని ఆయన ప్రశ్నిస్తున్నారు.
ఏపీలో కూడా అధికార వైసీపీ నేతల మీద ఈడీ, సీబీఐ దాడులు చేయాలంట. ఐటీ దాడులు కూడా గట్టిగా జరగాలంట. ఇదీ రాజు గారు కేంద్రం నుంచి కోరుకునే సాయం అని అంటున్నారు. ఇంతకీ రాజు గారి బాధ ఏమిటి అంటే ఏపీలో పెద్ద ఎత్తున బ్లాక్ మనీ పేరుకుపోయిందట. అధికార పార్టీ వారి వద్ద అది ఎక్కువగా ఉందిట.
అందువల్ల ఐటీ, ఈడీ, సీబీఐ వంటివి రంగంలోకి దిగితే అసలు గుట్టు బయటకు వస్తుంది అని ఆయన ఆశపడుతున్నారు. కేంద్రంలో ఉండేది బీజేపీ ప్రభుత్వమే కదా మరి వారితో చెప్పి ఏపీలో దాడులు చేయించవచ్చు కదా అని ఇతర పార్టీల వారు అంటున్నారు. అయినా కేంద్ర దర్యాప్తు సంస్థలకు రాజకీయ పార్టీల సిఫార్సులు కావాలా. నిజంగా తప్పు ఉంటే వారే ఎక్కడైనా వచ్చి దాడులు చేస్తారు. అపుడు వైసీపీ ఒక్కటే కాదు బీజేపీలోకి కొత్తగా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారి మీద కూడా ముందు దాడులు జరిగితే ఇంకా బాగుంటుంది అని అంటున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా కావాలి. పోలవరం నిధులు ఇవ్వాలని కోరకుండా దాడులు చేయండి అని కోరుకోవడమేంటి రాజు గారు మరీ బొత్తిగా చీప్ గా అని అంటున్న వారూ ఉన్నారు. అయినా ఆయన రాజు గారు, తాను ఏం చెప్పాలనుకుంటారో అదే చెబుతారు అంతే.