వైసీపీ సెంట్రల్ ఆఫీస్ విశాఖలోనే ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన భూమి పూజను ఉమ్మడి విశాఖ వైసీపీ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి చేశారు. విశాఖలో రెండు ఎకరాల విస్తీర్ణంలో సువిశాలమైన ప్రాంగణంలో అత్యాధునిక సదుపాయాలతో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. మొదటి దశ పనులు రెండు నెలల్లో పూర్తి అవుతాయి.
విశాఖలోనే పార్టీ ఆఫీస్ వచ్చేస్తోందని భూమి పూజకు హాజరైన వైసీపీ ముఖ్య నేతలు పేర్కొంటున్నారు. విశాఖ పరిపాలనా రాజధాని తొందరలో అవుతుందని, దాంతో పార్టీ ఆఫీస్ కూడా విశాఖలోనే ఉండడం సముచితమని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అంటున్నారు.
న్యాయపరమైన అవరోధాలు తొందరలో తొలగిపోతే విశాఖకు రాజధాని రావడం తధ్యమని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేస్తున్నారు. విశాఖ రాజధాని అని ఇన్నాళ్లూ వైసీపీ చెబుతోంది ఇపుడు సెంట్రల్ పార్టీ ఆఫీస్ విశాఖకు ఏర్పాటు చేయాలనుకోవడం ద్వారా దాన్ని పార్టీ పరంగా ఆచరణలో పెట్టారని తెలుసోంది.
తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి ఆఫీస్ విశాఖలో ఏర్పాటు చేయడానికి అంగీకరించారని ప్రచారం సాగుతోంది. కొత్త ఏడాది ఏప్రిల్ 11న విశాఖ నుంచే జగన్ పాలన సాగిస్తారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త విద్యా సంవత్సరం నుంచే విశాఖలో పాలన సాగిస్తామని ఇప్పటికే మంత్రి గుడివాడ చెప్పడం బట్టి చూస్తే 2023లో ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే దిశగా వైసీపీ పెద్దలు ఉన్నారని అర్ధమవుతోంది. విశాఖ రాజధాని మీద వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనలు కూడా దానికి బలం చేకూరుస్తున్నాయి.