జనసేనాని పవన్‌కల్యాణ్ సభకు ఆయన బద్ధ శత్రువైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆహ్వానం వచ్చింది. జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ ఆహ్వానం పలకడం విశేషం. ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లెలో ఈ నెల 18న కౌలు రైతులకు జనసేన తరపున ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ కార్యక్రమానికి జనసేనాని పవన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సమావేశ వివరాలను నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ఈ సందర్భంగా గతంలో కౌలు రైతుల మరణాలను సీఎం జగన్ తప్పు పట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము నిజమైన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్నామో, లేదో తెలుసుకునేందుకు జగన్ రావాలని ఆయన ఆహ్వానించారు. కౌలు రైతులకు తీవ్రమైన నష్టం కలిగించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓ చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. ఇవాళ కౌలు రైతులకు ఒక కార్డు రావాలంటే సామాన్యమైన విషయం కాదన్నారు. ఆధార్‌కార్డుతో పాటు కౌలు రైతులు కొన్ని పత్రాలను తీసుకెళ్లి రైతు భరోసా కేంద్రంలో సమర్పిస్తే… కరోనా సమయంలో అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ మూడేళ్లలో 1670 కౌలు రైతుల ఆత్మహత్యలు జరిగినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు.
అయితే ఆర్టీఐ చట్టం ద్వారా ప్రతి జిల్లా ఎస్పీ నుంచి పొందిన సమాచారం చూసిన తర్వాత ఆశ్చర్యం కలిగిందన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత సుమారు 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పుకొచ్చారు. ఇది చూసిన పవన్‌కల్యాణ్ రాష్ట్రానికి మంచి జరగాలి, రైతాంగాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించారన్నారు. అలాగే ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఇచ్చి భరోసా నింపడానికి ముందుకొచ్చారన్నారు.
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి రూ.7 లక్షలు అందిస్తామన్న ప్రభుత్వ హామీ క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలుకు నోచుకోలేదని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. కేవలం తూతూ మంత్రంగా కొన్ని చోట్ల అందించారన్నారు. జగన్ సొంత జిల్లాతో పాటు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు కూడా సాయం అందించామన్నారు.
ఈ దఫా కౌలురైతు సభ గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహిస్తున్నట్టు నాదెండ్ల తెలిపారు. జగన్ పాలనలో గుంటూరు జిల్లాలో 268 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు నాదెండ్ల చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు నాదెండ్ల సవాల్ విసిరారు. సత్తెనపల్లెకు స్వయంగా సీఎం వచ్చి చూడాలని కోరారు. గతంలో కౌలు రైతుల మరణాలపై సీఎం తప్పు పట్టారన్నారు. సత్తెనపల్లెకు సీఎం, ఆయన ప్రతినిధులు వచ్చి కళ్లారా చూసుకోవాలని ఆయన విన్నవించారు.