వైసీపీలో అంతర్గత విభేదాలపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టి సారించారు. పార్టీ పెద్దల జోక్యంతో దారికి రాని నియోజకవర్గాలపై నేరుగా తనే కలుగజేసుకోడానికి జగన్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా మైలవరం వైసీపీలో తలెత్తిన విభేదాలపై జగన్ సీరియస్‌గా ఉన్నారు. మంత్రి జోగి రమేశ్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మధ్య కొంత కాలంగా తీవ్ర స్థాయిలో విభేదాలు చోటు చేసుకున్నాయి.
మైలవరం వైసీపీలో గొడవలపై మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. రానున్న ఎన్నికల్లో మైలవరం నుంచి జోగి రమేశ్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ ఆదేశానుసారం నడుచుకుంటానని వసంత కృష్ణప్రసాద్ ఇప్పటికే ప్రకటించారు. తన నియోజకవర్గంలో పార్టీలో సమస్యలున్న మాట వాస్తవమే అని, త్వరలో అన్నీ సర్దుకుంటాయని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో మంత్రి జోగి రమేశ్, వసంత కృష్ణప్రసాద్‌తో ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు.
ఇద్దరికీ సర్ది చెప్పారు. పార్టీ బలోపేతం కోసం విభేదాలను పక్కన పెట్టి కలిసి పని చేయాలని హితవు చెప్పారు. ఒకరి నియోజకవర్గంలో మరొకరు జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. ఇద్దరూ మంచి నాయకులే అని మీడియాతో సజ్జల అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మైలవరంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడీ అయ్యారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గురువారం మైలవరం వైసీపీ కార్యకర్తలతో జగన్ భేటీ కానున్నారు. మైలవరంలో ఏం జరుగుతున్నదో వారిని అడిగి ఆయన తెలుసుకోనున్నారు. అనంతరం అక్కడి విభేదాలకు ఫుల్‌స్టాప్ పెట్టనున్నారు. మైలవరం అభ్యర్థి ఎవరో ఆయన కార్యకర్తలకు తేల్చి చెప్పనున్నారు. మరోసారి వైసీపీని గెలిపించాలని ఆయన దిశానిర్దేశం చేయనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.