తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఇద్దరు మహిళా నేతలతో చికాకు తప్పడం లేదు. ఇంత కాలం గవర్నర్ తమిళిసై వ్యవహార శైలితో ఆయన ఇబ్బంది పడుతూ వచ్చారు. ఇప్పుడామెకు మరో నాయకురాలు తోడయ్యారు. ఆమే వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల. రాజ్యాంగ పదవిలో వుంటూ గవర్నర్ రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ సర్కార్, గవర్నర్ తమిళిసై మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ఒక్క కేసీఆర్ మినహాయిస్తే, మిగిలిన నేతలంతా గవర్నర్‌పై నేరుగా ధ్వజమెత్తారు. గవర్నర్‌తో గొడవ నడుస్తుండగానే, బీఆర్ఎస్‌ను షర్మిల అసహనానికి గురి చేస్తున్నారు. తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న షర్మిల అధికార పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కోసారి ఆమె విమర్శలు హద్దులు దాటుతున్నాయన్న అభిప్రాయాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో షర్మిల పాదయాత్రపై బీఆర్ఎస్ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి.
ఈ నేపథ్యంలో పాదయాత్రకు అడ్డంకి ఎదురైంది. హైకోర్టును ఆశ్రయించి ఊరట పొందారు. అయినప్పటికీ వరంగల్ సీపీ అనుమతి ఇవ్వకపోవడంతో మరోసారి ఆమె హైకోర్టును మంగళవారం ఆశ్రయించారు. షరతులతో కూడిన అనుమతి హైకోర్టు ఇచ్చింది. సంక్రాంతి తర్వాత పాదయాత్ర చేయాలని అనుకున్నట్టు ఇవాళ షర్మిల ప్రకటించారు. ఇదిలా వుండగా తనను ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకోవడంపై మరోసారి ఆమె హైకోర్టులో బుధవారం లంచ్ మోషన్ పిటిషన్ వేశారు.
తనను గృహ నిర్బంధం చేసి వ్యక్తిగత స్వేచ్ఛను పోలీసులు హరిస్తున్నారంటూ ఆమె న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. కార్యకర్తలను కూడా పార్టీ కార్యాలయానికి రాకుండా పోలీసులు చట్ట విరుద్ధంగా అడ్డుకుంటున్నారని షర్మిల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇదే సందర్భంలో ప్రగతి భవన్ ముట్టడి, అలాగే అనుమతి లేకుండా రాజ్‌భవన్‌కు వెళ్లి ట్రాఫిక్‌కు అంతరాయం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. ఆ సాకు చూపి షర్మిలను గృహ నిర్బంధం చేయడం ఏంటని కోర్టు ప్రశ్నించింది.
వైఎస్ షర్మిలను ఇంటి నుంచి బయటికి రాకుండా అడ్డుకోవద్దని, అలాగే ఆమె నివాసం వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు తొలగించి వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఒకవైపు కేసీఆర్ సర్కార్ అణచివేత చర్యలకు పాల్పడుతుంటే, మరో వైపు షర్మిల న్యాయ పోరాటం చేస్తూ, గెలుపొందుతూ అధికార పార్టీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారు.