టాలీవుడ్ .. మ‌ర‌క‌లు, మెరుపులు!

ఒక‌వైపు రీమేక్ సినిమాల విష‌యంలో టాలీవుడ్ ట్రోల్ అవుతోంది. ఓటీటీ యుగంలో కూడా వంద‌ల కోట్ల రూపాయ‌లు వెచ్చించి రీమేక్ సినిమాలు చేస్తూ టాలీవుడ్ స్టార్ హీరోలు అబాసుపాల‌వుతున్నారు! ఆ రీమేక్ ల‌ను ప్ర‌జ‌లు…

ఒక‌వైపు రీమేక్ సినిమాల విష‌యంలో టాలీవుడ్ ట్రోల్ అవుతోంది. ఓటీటీ యుగంలో కూడా వంద‌ల కోట్ల రూపాయ‌లు వెచ్చించి రీమేక్ సినిమాలు చేస్తూ టాలీవుడ్ స్టార్ హీరోలు అబాసుపాల‌వుతున్నారు! ఆ రీమేక్ ల‌ను ప్ర‌జ‌లు మ‌రో ఆలోచ‌న లేకుండా తిర‌స్క‌రిస్తున్నారు కూడా! అయిన‌ప్ప‌టికీ ఇంకా మ‌రిన్ని రీమేక్ లు క్యూలోనే ఉన్నాయి. ఇప్ప‌ట్లో ఆ రీమేక్ సినిమాలు ఆగేలా లేవు. అందులోనూ పెద్ద పెద్ద స్టార్లే రీమేక్ లతో వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. నిర్మాత‌ల‌ను, డిస్ట్రిబ్యూట‌ర్ల‌ను నిండా ముంచేస్తూ.. త‌మ జేబు నిండిందా లేదా అనే విష‌యాన్ని మాత్ర‌మే చూసుకుంటూ ఉన్నారు.

మ‌రి టాలీవుడ్ విష‌యంలో ఈ మ‌ర‌క‌లు అంత తేలిక‌గా చెరిగిపోక‌పోయినా.. కొన్ని కొన్ని మెరుపులు మాత్రం మెరుస్తున్నాయి. ఈ ప‌రంప‌ర‌లో అల్లు అర్జున్ కు జాతీయ ఉత్త‌మ న‌టుడి అవార్డు కూడా అలాంటి మెరుపుగా చెప్ప‌వ‌చ్చు. లాబీయింగ్ వ‌ల్లా వ‌చ్చిందా, మ‌రో ర‌కంగా వ‌చ్చిందా అనే వాద‌న ఇలాంటి విష‌యాల్లో రొటీన్ గా ఉంటుంది. లాబీయింగ్ లేనిదే అవార్డులు రావనేది చాలా పాత విష‌య‌మే. మ‌రి అల్లు అర్జున్ త‌ర‌ఫున కూడా లాబీయింగ్ జ‌రిగి ఉండ‌వ‌చ్చు! అవార్డు అయితే వ‌చ్చింది.

ఒక ప్ర‌యోగాత్మ‌క‌మైన పాత్ర ద్వారా అల్లు అర్జున్ ఏపీ ఆవ‌ల మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. నార్త్ లో అయినా, తెలుగు రాష్ట్రాల అవ‌త‌ల అయినా అల్లు అర్జున్ కు పుష్ప చాలా మంచి గుర్తింపును ఇచ్చింది. ఒక్క మాట‌లో చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో కంటే.. బ‌య‌టే పుష్ప‌కు మంచి ఫ‌లితం ఎదురైంది! తెలుగు వారి క‌న్నా.. ఇత‌ర భార‌తీయ భాష‌ల వారికే పుష్ప బాగా న‌చ్చింది! అల్లు అర్జున్ కు పుష్ప‌కు ముందే మ‌ల‌యాళంలో మంచి గుర్తింపు ఉంది. అయితే పుష్ప అత‌డిని త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల వారిలో కూడా చాలా పాపుల‌ర్ చేసింది. ఇక నార్త్ లో అయితే అత‌డికి మొద‌టి గుర్తింపును పుష్ప ఇచ్చింది. ఈ సినిమా విడుద‌లైన తొలి రోజు.. తెలుగునాట ఇదేం సినిమా అనే ధోర‌ణే వ్య‌క్తం అయ్యింది!

కొన్ని చోట్ల అయితే.. కొంత‌మంది వీరాభిమానులు ఈ సినిమాతో తీవ్ర నిస్పృహ‌కు గుర‌య్యారు. ఫ్లెక్సీల‌ను, క‌టౌట్ల‌ను ధ్వంసం కూడా చేశారు. విడుద‌లైన తొలి రోజున ఇలాంటి ప్ర‌తిఘ‌ట‌న‌ను ఎదుర్కొంది పుష్ప‌. ఆ ప్ర‌భావం దాని క‌లెక్ష‌న్ల‌పై కూడా కొన‌సాగింది. అయితే తెలుగు రాష్ట్రాల అవ‌త‌ల మాత్రం ఈ సినిమా మంచి వ‌సూళ్ల‌ను సంపాదించుకున్న‌ట్టుంది. అంత‌కు మించి అల్లు అర్జున్ కు ఈ సినిమా గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టింది.

పితామ‌గ‌న్ సినిమాతో విక్ర‌మ్ కు త‌మిళ‌నాడు అవ‌త‌ల ఎంత గుర్తింపు వ‌చ్చిందో, పుష్ప పాత్ర అల్లు అర్జున్ కు తెలుగు రాష్ట్రాల అవ‌త‌ల అంత గుర్తింపును ఇచ్చింది! ఆ ప్ర‌యోగాత్మ‌క పాత్ర అంత క‌ల్ట్ అయ్యింది. పితామ‌గ‌న్ లో విక్ర‌మ్ చేసిన పాత్ర‌కు గానూ జాతీయ అవార్డును పొందాడు. ఇప్పుడు అల్లు అర్జున్ కు కూడా ఆ గుర్తింపు ద‌క్కింది.

అల్లు అర్జున్ కు ఉన్న ఇప్పుడు మ‌రో అనుకూల‌త ఏమిటంటే.. ఇవ‌న్నీ పుష్ప సీక్వెల్ పార్ట్ కు పెద్ద అడ్వాంటేజ్ గా మార‌బోతున్నాయి. పుష్ప‌కు ఏపీ, తెలంగాణ అవ‌త‌ల వ‌చ్చిన స్పంద‌న నార్త్ తో దాని సీక్వెల్ కు మించి మార్కెట్ అవ‌కాశాల‌ను ఇస్తోంది. అలాగే ఈ జాతీయ అవార్డుతో క్రిటిక్స్ దృష్టి కూడా పుష్ప పార్ట్ టూ పై గ‌ట్టిగా ప‌డుతుంది. ఆ సినిమా ఎలా ఉంటుంద‌నే ఆస‌క్తి స‌ర్వ‌త్రా వ్య‌క్తం అవుతుంది. మ‌రి అవార్డులు బాధ్య‌త‌ను కూడా పెంచుతాయంటారు. ఇప్పుడు అల్లు అర్జున్, పుష్ప 2 మీద కూడా ఆ భారం ప‌డ‌బోతోంది. పుష్ప 2 పై అంచ‌నాలు మ‌రింత‌గా పెర‌గుతాయి. ఆ అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో ఆ సినిమా ఏ మేర‌కు విజ‌యవంతం అవుతుందో చూడాల్సి ఉంది.

పితామ‌గ‌న్ త‌ర్వాత విక్ర‌మ్ సినిమాల‌పై కూడా ఇలాంటి అంచ‌నాలు పెరిగాయి. అప‌రిచితుడి త‌ర్వాత అవి ప‌తాక స్థాయికి చేరాయి. ఆ త‌ర్వాత విక్ర‌మ్ ఎన్ని చేసినా.. త‌మిళ‌నాడు అవ‌త‌ల ఇప్ప‌టికీ తిర‌స్క‌ర‌ణ కొన‌సాగుతూ ఉందంటే.. ఇలాంటి పాత్ర‌ల ప్ర‌భావం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పొచ్చు. ఒక ర‌కంగా ప్ర‌భాస్ ప‌రిస్థితి కూడా ఇదే! ఏం చేసినా బాహుబ‌లి తోనే పోలిక వ‌స్తోంది. షోలే త‌ర్వాత అమితామ్ ప‌రిస్థితి ఇదే అంటారు! మ‌రి అల్లు అర్జున్ మ‌ళ్లీ రొటీన్ మాస్ మ‌సాలాలు, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తులే చేసినా.. తెలుగునాట అయితే న‌డుస్తుంది. ఇప్పుడు ద‌క్కిన గుర్తింపు అదే స్థాయిలో కొన‌సాగాలంటే.. చాలా అంచ‌నాల‌ను అందుకోవాల్సి ఉంటుంది!

-హిమ‌