చంద్ర‌యాన్ 3 సక్సెస్.. పాశ్చాత్య‌దేశాల జ‌ల‌సీ!

చంద్రుడిపై మాన‌వుడు అడుగుపెట్టాడంటే అతి మాన‌వ జాతి సాధించిన ప్ర‌గ‌తి అని అనుకోవాలి. ప్ర‌పంచంలో ఏ దేశం ఇలాంటి ఫీట్ సాధించినా, అది మాన‌వుడు సాధించిన ఘ‌న‌త‌గా చెప్పాలి! భూమిపై జ‌నించే ఎన్నో జీవుల‌కు…

చంద్రుడిపై మాన‌వుడు అడుగుపెట్టాడంటే అతి మాన‌వ జాతి సాధించిన ప్ర‌గ‌తి అని అనుకోవాలి. ప్ర‌పంచంలో ఏ దేశం ఇలాంటి ఫీట్ సాధించినా, అది మాన‌వుడు సాధించిన ఘ‌న‌త‌గా చెప్పాలి! భూమిపై జ‌నించే ఎన్నో జీవుల‌కు మ‌రో గ్ర‌హాన్నో, ఉప‌గ్ర‌హాన్నో అందుకోవ‌డం సాధ్యం అయ్యే ప‌ని కాదు. మ‌నిషి క‌న్నా భూమిపై బ‌లిష్ట‌మైన‌, సొంతంగా ఎగిరే శ‌క్తి ఉన్న జీవులు ఉన్న‌.. రెక్క‌లేని మ‌నిషే ఎక్కువ దూరం ఎగ‌ర‌గ‌లుగుతున్నాడు. దీనికి కార‌ణం అత‌డికి సొంత‌మైన మేధ‌స్సు కార‌ణం!

మ‌రో గ్ర‌హంపై కో, మ‌రో ఉప‌గ్ర‌హంపైకో.. త‌ను వెళ్ల‌డ‌మో, త‌న త‌ర‌ఫున మ‌రో ల్యాండ‌ర్ ను పంప‌డ‌మో.. చేయ‌డం నిస్సందేహంగా గొప్ప ఘ‌న‌త‌. మ‌రి ఇదే ఘ‌న‌త‌ను పాశ్చాత్య దేశాలు సాధిస్తే.. అది వాటి గొప్ప‌ద‌నం అని ఒప్పుకోవాలి. అయితే ఇలాంటి ఫీట్ ను ఇండియా వంటి దేశం సాధిస్తున్న‌ప్పుడు చాలా మంది పాశ్చాత్యులు కూడా పాజిటివ్ గానే స్పందిస్తున్నా, మ‌రి కొంద‌రు మాత్రం వెకిలి చేష్ట‌లు చేస్తూ ఉన్నారు.

మీడియా ప్ర‌తినిధులు, అక్క‌డి ప్ర‌జాప్ర‌తినిధులు అక్క‌సు వెల్ల‌గ‌క్కుతున్నారు. ఇది వ‌ర‌కూ ఇండియా మార్స్ మిష‌న్ ను చేప‌ట్టిన‌ప్పుడు న్యూయార్క్ టైమ్స్ వేసిన కార్టూన్ వారి తీరును చాటింది. మార్స్ మిష‌న్ ద్వారా ఎలైట్ స్పేస్ ఆర్గ‌నైజేష‌న్స్ గా నిలిచిన భార‌త్ పై వ్యంగ్యంగా స్పందించింది న్యూయార్క్ టైమ్స్. ఎలైట్ స్పేస్ ఆర్గ‌నైజేష‌న్స్ త‌లుపును ఒక భార‌తీయుడు త‌డుతుంటాడు, అత‌డి త‌న‌తో పాటు ఒక ఆవును ప‌ట్టుకుని ప‌శువుల కాప‌రిలా ఉంటాడు. ఇండియా అంటే ఇంతే అనే ధోర‌ణిని చాటింది న్యూయార్క్ టైమ్స్. అలాంటి వెక్కిరింత‌లను ధీటుగా ఎదుర్కొంటూ ఇండియ‌న్ స్పేస్ రీసెర్చ్ ఆర్గ‌నైజేష‌న్ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఘ‌న‌త‌ల‌ను సాధిస్తూనే ఉంది. ఆఖ‌రికి అవే పాశ్చాత్య‌దేశాలు త‌మ ఉప‌గ్ర‌హాల‌ను స్పేస్ లోకి పంపాలంటూ ఇండియాను కోర‌డ‌మో, లేక కాంట్రాక్టును కుదుర్చుకోవ‌డ‌మో కూడా చేస్తున్నాయి.

ఇలాంటి నేప‌థ్యంలో చంద్ర‌యాన్ 3 స‌క్సెస్ తో ఇస్రో స్థాయి మ‌రింత మెరుగైంది. ఇప్ప‌టి వ‌ర‌కూ చంద్రుడి ద‌క్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన కంట్రీ ఏదీ లేదు. ఈ ప్ర‌య‌త్నంలో చాలా దేశాలు విఫ‌లం అయ్యాయి. ఈ ఆలోచ‌న చేయ‌డానికి కూడా కొన్ని స్పేస్ రీసెర్చ్ సంస్థ‌లు భ‌య‌ప‌డ్డాయి. అలాంటి ప్ర‌య‌త్నం చేయ‌డానికే వెనుక‌డుగు వేశాయి. ఎలాగూ స‌క్సెస్ కాద‌నే లెక్క‌ల‌తో అలాంటి ప్ర‌యోగాలూ నిర్వ‌హించ‌లేదు. మ‌రి అలాంటి ప్ర‌యోగం నిర్వహించి, చంద్ర‌యాన్ 2 విఫ‌లం అయినా.. వెనుక‌డుగు వేయ‌క చంద్ర‌యాన్ 3తో ఇండియా స‌త్తా చూపించింది. ద‌క్షిణ ధ్రువంపై ల్యాండ్ అయ్యింది. త‌ద్వారా ప్ర‌త్యేకంగా నిలుస్తోంది.

మ‌రి ఇలాంటి స‌మ‌యంలో కొంద‌రు పాశ్చాత్యులు అక్క‌సు వెల్ల‌గ‌క్కుతున్నారు. ఇండియాను వెక్కిరించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌త్యేకించి ఇండియాను పేద‌దేశ‌మంటూ గుర్తు చేయ‌డానికి వెనుకాడటం లేదు. పేద‌దేశం అంటూ ఇండియా కొన్ని స్కీమ్ ల ద్వారా అభివృద్ధి చెందిన దేశాల నుంచి డ‌బ్బులు పొందుతూ ఉంద‌ని, అలాంటి నిధుల‌ను త‌క్ష‌ణం ఆపివేయాలంటూ వారు ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ ఉన్నారు. సొంతంగా చంద్ర‌యాన్ వంటి ప్ర‌యోగాల‌ను చేయ‌గ‌లుగుతున్న ఇండియాకు పేద‌రికం పేరిట ఎందుకు సాయం అందించాల‌నే ప్ర‌శ్న‌లు వారు వేస్తున్నారు!

మ‌రి సాయం అందిస్తే అందించాలి ఆపేయ‌గ‌లిగితే అపేయ‌నూ వ‌చ్చు. అయితే స‌రిగ్గా ఇలాంటి సంద‌ర్భంలో అలా మాట్లాడ‌టం మాత్రం క‌చ్చితంగా జ‌ల‌సీని చాటుతూ ఉంది. చంద్ర‌యాన్ 3 స‌క్సెస్ తో కొంద‌రు త‌ట్టుకోలేక‌పోతున్నార‌ని.. ఇండియా విష‌యంలో అక్క‌స‌లు వెల్ల‌గ‌క్కుతున్నార‌ని స్ప‌ష్టం అవుతోంది. మరి ప్ర‌పంచాన్ని త‌న కాల‌నీగా చేసుకుని పాలిస్తూ.. భారీ ఎత్తున దోచుకు వెళ్లిన బ్రిట‌న్ నుంచినే ఇలాంటి మాటలు వినిపించ‌డం మ‌రింత విడ్డూరం. త‌మ దోపిడీని సాగించి శ‌తాబ్దాల పాటు ఇండియాను దోచుకెళ్లిన వారు ఇప్పుడు మ‌రింత అక్క‌సుతో అయితే ర‌గిలిపోతూ త‌మ ధోర‌ణిని చాటుకుంటూ ఉన్నారు.