1, 2, 3, 4.. ఎర్ర పార్టీల నెంబర్ల ఆట!

1.. వామపక్ష పార్టీలకు భారాస ఇవ్వడానికి సిద్ధపడిన సీట్లు Advertisement 2.. భారాస నుంచి వామపక్షాలు ఫైనల్ గా పట్టుబట్టిన సీట్లు 3.. తొలిగా.. వామపక్షాలు, భారాసను అడిగిన ఎమ్మెల్యే సీట్లు 4.. కాంగ్రెస్…

1.. వామపక్ష పార్టీలకు భారాస ఇవ్వడానికి సిద్ధపడిన సీట్లు

2.. భారాస నుంచి వామపక్షాలు ఫైనల్ గా పట్టుబట్టిన సీట్లు

3.. తొలిగా.. వామపక్షాలు, భారాసను అడిగిన ఎమ్మెల్యే సీట్లు

4.. కాంగ్రెస్ ను సీపీఐ అడిగిన ఎమ్మెల్యే సీట్ల సంఖ్య

వామపక్ష పార్టీలు కూరగాయల బేరాలకు దిగుతున్నాయి. భారాస నుంచి కొన్ని సీట్లు పుచ్చుకుని.. శాసనసభలో అడుగుపెట్టాలని కలగన్న వామపక్ష పార్టీలు.. చివరివరకూ వారితో డీల్ కుదుర్చుకోవడానికి చాలా ప్రయత్నం చేశాయి. అయితే ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ వారిని ఖాతరు చేయలేదు. మునుగోడులో తమ మద్దతు లేకపోతే భారాస గెలవగలిగేది కాదని.. అప్పటి పొత్తులు కొనసాగుతాయని చెప్పి కేసీఆర్ వంచించారని రకరకాల నిందలు వేశారు గానీ.. కేసీఆర్ లొంగలేదు. 

జాబితా ప్రకటనకు ముందు.. వామపక్షాలతో ఒక విడత చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో సీపీఐ, సీపీఎం లు తమకు చెరి మూడు వంతున అసెంబ్లీ సీట్లు కావాలని అడిగితే.. భారాస నిరాకరించింది. ఇద్దరికీ ఒక్క ఎమ్మెల్యే సీటు, రెండేసి ఎమ్మెల్సీ సీట్లు మాత్రం ఇవ్వగలం అని తేల్చి చెప్పింది. దానికి వామపక్షాలు దిగిరాలేదు. సుదీర్ఘ మంతనాల తర్వాత.. కనీసం రెండు ఎమ్మెల్యే సీట్లయినా ఇవ్వాలని పట్టుబట్టారు గానీ.. భారాస పట్టించుకోలేదు. చివరికి ఆ ప్రతిష్టంభనలోనే భారాస జాబితా కూడా వచ్చేసింది. 

తమను సంప్రదించకుండా జాబితా విడుదల చేశారంటూ కేసీఆర్ మీద వామపక్ష నాయకులందరూ నానా విమర్శలు చేశారు. ఆ వెంటనే కాంగ్రెస్ తో జట్టుకట్టడానికి తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. 

భారాసతో బంధం బెడిసినప్పటినుంచి.. కాంగ్రెస్ తో కొత్త బంధం కుదుర్చుకోవడానికి వామపక్షాలు తహతహలాడిపోయాయి. జాతీయస్థాయిలోని ఇం.డి.యా. కూటమిలో తామందరమూ కలిసే ఉన్నారు గనుక.. ఇక్కడ జట్టుగా పోటీచేయడం కష్టం కాకపోవచ్చునని వారు భావించారు. ఆ పాయింట్ నిజమే గానీ.. వామపక్షాలు ఎన్ని సీట్లు అడుగుతాయి అనేది కీలకంగా మారింది.

అందులో తొలివిడతగా సీపీఐ నాయకులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం థాక్రేతో సమావేశం అయ్యారు. భారాస తో మూడు సీట్లు అడుగుతూ మొదట చర్చలు ప్రారంభించిన ఈ నాయకులు, కాంగ్రెస్ వరకు వచ్చేసరికి నాలుగు ఎమ్మెల్యే సీట్లు అడగడం విశేషం. మునుగోడు, హుస్నాబాద్, కొత్తగూడెం, బెల్లంపల్లి స్థానాలు కావాలని సీపీఐ అడిగింది. ఇదే సీపీఐ భారాసతో చర్చల సమయంలో ఫైనల్ గా కనీసం రెండు స్థానాలు ఇస్తే చాలునని పట్టుబట్టిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఇప్పుడు వారికి రెండు సీట్లు ఇవ్వడానికి సుముఖంగా ఉండగా.. ఇక్కడ మాత్రం కనీసం మూడు సీట్లు కావాలని గట్టిగా అడుగుతున్నట్టు తెలుస్తోంది.

మునుగోడు, హుస్నాబాద్ సీట్లు ఇవ్వడానికి మాత్రం కాంగ్రెస్ ఒప్పుకున్నదని.. మూడు సీట్లు ఇవ్వడం అసలు సాధ్యం కాకపోవచ్చునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీపీఐతో ఒక డీల్ తుదిరూపం సంతరించుకున్న తర్వాత.. అదే డీల్ సీపీఎం కు కూడా వర్తింపజేయాల్సి వస్తుంది. అందుకే కాంగ్రెస్ సీట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది.