చంద్రబాబు ‘ఘర్ వాపసీ’.. పట్టించుకునేదెవరు?

తెలంగాణలో ఆల్రెడీ శవాసనం వేసిన తెలుగుదేశం పార్టీని, లేపి నిలబెట్టాలని, తిరిగి ఊపిరులూదాలని ఇలాంటి రకరకాల ఆశలేమీ చంద్రబాబునాయుడుకు లేవు. తెలంగాణ రాష్ట్రంలో తమకు కూడా కాస్త బలం ఉన్నట్టుగా నిరూపించుకుంటే.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల…

తెలంగాణలో ఆల్రెడీ శవాసనం వేసిన తెలుగుదేశం పార్టీని, లేపి నిలబెట్టాలని, తిరిగి ఊపిరులూదాలని ఇలాంటి రకరకాల ఆశలేమీ చంద్రబాబునాయుడుకు లేవు. తెలంగాణ రాష్ట్రంలో తమకు కూడా కాస్త బలం ఉన్నట్టుగా నిరూపించుకుంటే.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయానికి ఇతర పార్టీలతో పొత్తుల పరంగా బేరాలాడే స్థాయి పెరుగుతుందనేది చంద్రబాబునాయుడు వ్యూహం. 

తెలంగాణ తెలుగుదేశానికి కొత్త అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ను నియమించిన తర్వాత.. చురుగ్గా పార్టీ సమావేశాలు గట్రా నిర్వహిస్తున్న కాసాని, తొలిసారిగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. పార్టీ శ్రేణులకు ఏమో గానీ.. చంద్రబాబుకు మాత్రం ఈ సభ ఉత్సాహాన్నిచ్చి ఉంటుంది. 2018 ఎన్నికల్లో దారుణమైన పరాజయం తర్వాత, తెలంగాణలో మళ్లీ ప్రజలను ఉద్దేశించి ఓ సభలో మాట్లాడే సందర్భం చంద్రబాబుకు బహుశా ఇదే కావొచ్చు. ఆ ఉత్సాహంలో ఆయన తెలంగాణకు తెలుగుదేశం పార్టీ అవసరం చాలా ఉంది.. లాంటి పెద్ద పెద్ద డైలాగులు వేశారు. 

కులం పరంగా.. తమ పార్టీని నెత్తిన పెట్టుకునే కులం మెజారిటీ సంఖ్యలో ఉన్నందువల్లనే.. చంద్రబాబు ఖమ్మంలోనే తొలి సభను నిర్వహించడానికి పూనుకోవడం అనేది అందరూ ఊహించగలిగినదే. శవాసనంలో ఉన్న పార్టీ ఎంత బలోపేతం అయినా.. మళ్లీ అధికారం వైపు అడుగులు వేయడం అయ్యే పని కాదు. అలాంటి హామీ చంద్రబాబు కూడా ఇవ్వడం లేదు. 2018 తర్వాత జరిగిన అనేక ఉప ఎన్నికల్లో కనీసం అభ్యర్థులను దించడానికి కూడా సత్తాలేకుండా పార్టీని చంపేసిన చంద్రబాబు.. ఖమ్మం సభ వాపు చూసుకుని నెగ్గేస్తాం అనడం లేదు. 

కానీ.. పార్టీనుంచి తిరిగి వెళ్లిపోయిన సీనియర్లంతా తిరిగి రావాలని పిలుపు ఇస్తున్నారు. ఇతర పార్టీల్లోకి వెళ్లి అక్కడ చాలా కన్వీనియెంట్ గా అధికార, పదవీ వైభవాలను అనుభవిస్తున్న నాయకులు, ఇప్పుడు చంద్రబాబుకు మూడ్ వచ్చింది కదాని మళ్లీ ఆ పార్టీలను వదిలేసి వెనక్కు వచ్చి ఏం చేయాలి? అనేది కీలకమైన అంశంగా ఉంది. 

చంద్రబాబునాయుడుకు ఏపీలో తాను మళ్లీ అధికారంలోకి రావడం మినహా మరో టార్గెట్ లేదు. అక్కడ జనసేనను ఆల్రెడీ లోబరచుకున్న చంద్రబాబు, 2014 జట్టు లాగానే బిజెపిని కూడా తిరిగి తన సేవకు వాడుకోవాలని చూస్తున్నారు. అయితే బిజెపి ఆయనకు ఒక పట్టాన కొరుకుడుపడడం లేదు. తెలంగాణలో ఇలాంటి బహిరంగసభలు నిర్వహించి.. తెలంగాణలో తమ పార్టీ బలంగా ఉన్నట్టు బిల్డప్ ఇవ్వగలిగితే.. ఇక్కడ అధికారం ఆశిస్తున్న బిజెపిని మభ్యపెట్టవచ్చుననేది ఆయన వ్యూహం. 

తెలంగాణలో బిజెపి అదికారంలోకి రావడానికి తాము తోడ్పడుతామని.. ఏపీలో తమతో పొత్తుల్లో కలిసి పోటీచేయాలని ఆయన ప్రతిపాదించే అవకాశం ఉంది. ఆయన స్వార్థం కోసం, తన కులబలం చూసుకుని ఒక ఊరిలో సభ నిర్వహించినంత మాత్రాన.. చంద్రబాబునాయుడు పిలుపుకు స్పందించి ఇతర పార్టీలనుంచి తిరిగి వచ్చి టీడీపీలో చేరే అమాయక నాయకులు ఎవరుంటారో చూడాలి.