ప్రతిష్టాత్మక హుజూరు నగర్ ఉపఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. కొద్దిసేపటి కిందట పోలింగ్ మొదలైంది. బరిలో 28 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ పోటీ ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యనే నడుస్తోంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ నియోజకవర్గం కావడంతో, దీన్ని ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోటీ రసవత్తరంగా మారింది.
నియోజకవర్గంలో మొత్తం 302 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటుచేశారు. 1700 ఈవీఎంలను పెట్టారు. సాంకేతిక సమస్యలు వస్తే రిపేర్ చేయడానికి 30 మంది టెక్నీషియన్లను అందుబాటులో ఉంచారు. గత ఎన్నికల్లో ఇక్కడ 2 ప్లాటూన్ల భద్రతా బలగాల్ని ఏర్పాటుచేస్తే, ఈసారి ఏకంగా 5 ప్లాటూన్ల భద్రతా బలగాల్ని మొహరించారు. అంతేకాదు.. సమస్యాత్మకంగా గుర్తించిన 79 పోలింగ్ స్టేషన్లలో మరింత మంది సిబ్బందిని, సీసీ కెమెరాల్ని ఏర్పాటుచేశారు.
ఈ ఎన్నికలో 2 లక్షల 36వేల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోబోతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతోంది. ఒకవేళ అవాంఛనీయ ఘటనలు ఏమైనా జరిగినా, వాతావరణం అనుకూలించకపోయినా పోలింగ్ సమయాన్ని అక్కడికక్కడే పొడిగించుకునేలా అధికారాలు ఇచ్చారు.
నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ భార్య పద్మావతి బరిలో నిలవగా.. టీఆర్ఎస్ నుంచి గత ఎన్నికల్లో ఓడిన సైదిరెడ్డి మరోసారి బరిలో నిలిచారు. ఈ సీటు గెలిచి హుజూర్ నగర్ లో తమ పట్టు నిలుపుకోవాలని మరోసారి భావిస్తున్న కాంగ్రెస్.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే, రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ విఫలమైందని, దానికి హుజూర్ నగర్ ఫలితమే.