రాష్ట్రంలో 13 జిల్లాలలకు ఇంచార్జ్ మంత్రుల్ని మారుస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు కొత్త జాబితా విడుదలైంది. ఇంచార్జి మినిస్టర్లను నియమించి 4 నెలలైనా కాకముందే వెంటనే మార్పుచేర్పులు జరిగాయి. అంటే జగన్ పాత జాబితాపై ఎంత త్వరగా ఓ అంచనాకి వచ్చారో అర్థమవుతోంది. అదే సమయంలో ఇంచార్జి పదవి ఓ అలంకారం కాదు అనే సంకేతాలని పంపారాయన.
గత జాబితాలో ఉండి, ఈ జాబితాలో చోటు దక్కించుకోనివారు ముగ్గురు. మేకతోటి సుచరిత, ఆళ్లనాని, పిల్లి సుభాష్ చంద్రబోస్ లను తొలగించి వారి స్థానంలో కొత్తవారికి అవకాశమిచ్చారు. మేకపాటి గౌతమ్ రెడ్డి మినహా మిగతా వారికి జిల్లాలు మార్చారు. కొన్ని జిల్లాల్లో ఇంచార్జి మంత్రుల పెత్తనాన్ని స్థానిక నేతలు తట్టుకోలేకపోతున్నారనే వాదన వినిపిస్తున్న నేపథ్యంలో ఈ మార్పులు వాటిని బలపరుస్తున్నాయి.
ఉత్తరాంధ్రలో రెండు జిల్లాలు, రాయలసీమలో ఒక జిల్లా నుంచి ఇంచార్జి మినిస్టర్లపై జగన్ కు కంప్లైంట్స్ ఉన్నాయి. ఇటీవల కేబినెట్ భేటీ అనంతరం ఇదే విషయంపై మంత్రులతో ప్రత్యేకంగా చర్చించారు జగన్. అలాంటివేవీ లేవని సర్దిచెప్పాలని చూసినా, తన దగ్గరున్న సమాచారాన్ని వారి ముందుంచి సమాధానం రాబట్టాలని చూశారు. ఆ సమాధానాలతో సంతృప్తి చెందకే వారిని మార్చివేశారు.
ఇక నెల్లూరు జిల్లాలో ఇటీవల ఎమ్మెల్యేలు కాకాణి, కోటంరెడ్డి మధ్య జరిగిన వార్ ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్ వరకూ వ్యవహారం వెళ్లినా ఇంచార్జి మంత్రి మేకతోటి సుచరిత జోక్యం చేసుకోలేకపోయారు. ఆ విషయంలో ఆమె పూర్తి నిస్సహాయురాలిగా మారారు. సీనియర్ ఎమ్మెల్యేలెవరూ ఆమెను లెక్క చేసేలా, ఆమె మాటను వినేలా కనిపించలేదు. అందుకే వెంటనే సుచరితను తప్పించి నెల్లూరు జిల్లాకు బాలినేని వాసుని ఇంచార్జిగా నియమించారు. దాదాపుగా మార్పు జరిగిన ప్రతి జిల్లాలోనూ ఇలాంటి రాజకీయ కారణాలున్నాయి.
ఆళ్లనాని, పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా తమ పోర్ట్ ఫోలియోలతో పూర్తి బిజీగా ఉండటం, జిల్లా పర్యటనలకు వెళ్లలేకపోవడం, ఇంచార్జిలుగా ఉన్న జిల్లాల్లో లోకల్ పాలిటిక్స్ పై అంతగా గ్రిప్ లేకపోవడంతో వారిని తొలగించి, కొత్తవారికి అవకాశమిచ్చారు. ఇంచార్జి పదవులిచ్చి నాలుగు నెలలు తిరక్కుండానే, ఇలా మార్పులు చేసేసరికి అటు ఇంచార్జి మంత్రులు, ఇటు స్థానిక నాయకులు కూడా అవాక్కయ్యారు. రెండున్నరేళ్ల తర్వాత జగన్ తనన మంత్రి వర్గాన్ని పూర్తిగా ప్రక్షాళణ చేయడంలో ఏమాత్రం మొహమాట పడరు అనే విషయం ఈ దెబ్బతో అందరికీ అర్థమైపోయింది.