ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం 50వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్ తదితరులు శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు తమ అభిమాన నాయకుడి పుట్టిన రోజును పురస్కరించుకుని రక్త దాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. జగన్‌కు ఇవాళ బర్త్‌డే విషెస్‌కు సంబంధించి స్పెషల్ ఏంటంటే… ఆయన ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబునాయుడి నుంచి గ్రీటింగ్స్ రావడం.
ట్విటర్ వేదికగా జగన్‌కు చంద్రబాబు బర్త్ డే శుభాకాంక్షలు చెప్పడం విశేషం. నిజానికి జగన్, చంద్రబాబు మధ్య రాజకీయ విభేదాల కంటే వ్యక్తిగత కక్షలున్నాయి. రాజకీయాల్లో ఈ ధోరణి అవాంఛనీయం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నేళ్లుగా వైసీపీ, టీడీపీ మధ్య తీవ్రస్థాయిలో విద్వేషాలు పెరిగాయి. రాజకీయంగా ప్రత్యర్థులమే తప్ప, శత్రువులు కాదనే భావన ఆ రెండు పార్టీల నేతల మధ్య ఎప్పుడో పోయింది.
చంద్రబాబు పాలనలో అసెంబ్లీలో తమ పార్టీ గొంతు నొక్కుతున్నారని పలుమార్లు జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చివరికి ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానంటూ జగన్ అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరించారు. సుదీర్ఘకాలం పాటు పాదయాత్ర చేసి ప్రజల అభిమానాన్ని, నమ్మకాన్ని చూరగొన్నారు. ఎట్టకేలకు సీఎం కావాలనే తన కల నెరవేర్చుకున్నారు.
ప్రస్తుతం జగన్ పాలన నడుస్తోంది. మూడున్నరేళ్ల పరిపాలన పూర్తయింది. జగన్ పాలనలో చట్టసభ కౌరవ సభను తలపిస్తోందంటూ చంద్రబాబు అసెంబ్లీని బహిష్కరించారు. ఇలా వైసీపీ, టీడీపీ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో జగన్‌కు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం ఆహ్వానించదగ్గ పరిణామం. గతంలో కూడా జగన్, చంద్రబాబు పరస్పరం బర్త్ డే విషెస్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. కనీసం ఈ మాత్రం సంస్కారమైనా మిగిలి వుండడం సంతోషించదగ్గ విషయం.