ఉత్తరాంధ్రా నుంచి కేసీఆర్ టచ్ లోకి….?

కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టారు. బీఆర్ఎస్ అంటూ ఆయన దేశమంతా తిరిగే పనిలో ఉన్నారు. నిన్నటి టీఆర్ఎస్ నేడు బీఆర్ఎస్ గా మారగానే ఎక్కడైనా పోటీ చేసే అవకాశం కేసీఆర్ కి వచ్చేసింది. కేసీఆర్…

కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టారు. బీఆర్ఎస్ అంటూ ఆయన దేశమంతా తిరిగే పనిలో ఉన్నారు. నిన్నటి టీఆర్ఎస్ నేడు బీఆర్ఎస్ గా మారగానే ఎక్కడైనా పోటీ చేసే అవకాశం కేసీఆర్ కి వచ్చేసింది. కేసీఆర్ ఇతర రాష్ట్రాలలో జెండా పాతే ముందు ఒకే భాష మాట్లాడుతూ నిన్నటిదాకా కలసి ఉన్న ఏపీ మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించే అవకాశం ఉంది అని తెలుస్తోంది.

బీఆర్ఎస్ ని ఏపీలో విస్తరించేందుకు గల అవకాశాలను కూడా ఆయన చురుకుగా పరిశీలిస్తున్నారు అని అంటున్నారు. ఏపీలో ఆరేడు జిల్లాల మీద గట్టిగానే బీఆర్ఎస్ ఫోకస్ పెట్టిందని తెలుస్తోంది. అందులో ఉత్తరాంధ్రాలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయని అంటున్నారు.

దీనితో పాటు కోస్తా రాయలసీమల నుంచి మరో నాలుగు జిల్లాల మీద బీఆర్ఎస్ చూపు పడింది అని భోగట్టా. ఈ జిల్లాల నుంచి కేసీఆర్ టచ్ లోకి కొందరు కీలక నేతలు వెళ్లారని ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ నేతలు కూడా దీనిని ధృవీకరిస్తున్నారు. ఉత్తరాంధ్రా సహా ఆరేడు జిల్లాల నుంచి మొత్తం డెబ్బై నుంచి ఎనభై మంది రాజకీయ నేతలు బీఆర్ఎస్ తో సంప్రదిస్తున్నారు అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

ఆ నేతలు ఎవరు అన్నదే ఇపుడు ఏపీలోని మిగిలిన పార్టీలకు పట్టుకున్న సమస్యగా ఉంది. కేసీఆర్ పూర్వాశ్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు. ఆయనకు ఆ పార్టీకి చెందిన నేతలతో ఇప్పటికీ రిలేషన్స్ ఉన్నాయని అంటున్నారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్ళి మంత్రి అయిన తలసాని శ్రీనివాసయాదవ్ ని బీఆర్ఎస్ ఏపీ వ్యవహారాలు చూడమని కేసీఆర్ పురమాయిస్తున్నట్లుగా వెల్లడి అవుతోంది.

ఆయనకు టీడీపీతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ విధంగా అనుకుంటే టీడీపీ నుంచి నాయకులు బీఆర్ఎస్ లోకి వెళ్తారా అన్నది చూడాలంటున్నారు. కేసీఆర్ తో టచ్ లో ఉన్న నేతలు ఎవరు అన్నది మాత్రం ఏపీలో హాట్ టాపిక్ గా ఉంది. బీఆర్ఎస్ ని ఏపీలో గ్రాండ్ గా విస్తరిస్తామని తెలంగాణాలో బీఆర్ఎస్ ఏపీ నాయకులను కూడా ఆకట్టుకుంటోందని ఆ పార్టీ నేతలు చెబుతున్న దాంట్లో నిజమెంత పదుల సంఖ్యలో నాయకులు టచ్ లో ఉన్నారు అంటే ఎవరు వారు ఏమా కధ అన్నదే ఇపుడు డిస్క్సషన్ పాయింట్ గా ఉంది.