మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ చార్జ్‌షీట్‌లో కవిత పేరు తాజాగా వెలుగు చూసింది. ఇది బీజేపీ నేతలకు ఆయుధం ఇచ్చినట్టైంది. ఇదే అదునుగా బీజేపీ నేతలు విమర్శలకు పదును పెట్టారు. ఇటీవల కవితను ఆమె ఇంటికెళ్లి సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే. మళ్లీ విచారిస్తామని సీబీఐ పేర్కొంది.
తాజాగా ఈడీ తెరపైకి వచ్చింది. ఈడీ చార్జ్‌షీట్‌లో కవిత పేరు 28 సార్లు ఉండడంపై ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ట్విటర్ వేదికగా కవితపై తనదైన శైలిలో వెటకార ధోరణిలో ట్వీట్లు చేశారు. వాటికి దీటైన కౌంటర్ ఇచ్చారు.
“నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ. నువ్వు లిక్కర్ స్కాం లో ఉన్నది నిజం, జైలుకి వెళ్లడం ఖాయం. నిన్ను మీ అన్న మీ నాయనా ఎవ్వరు కాపాడలేరు. మునుగోడు ఉప ఎన్నికలలో నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక పారదర్శకరంగా వచ్చిన 18000 కోట్ల కోల్ బ్లాక్ టెండర్ విషయంలో నా పై మీ తెరాస నాయకులు విష ప్రచారం చేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసినందుకు రాబోయే రోజుల్లో అవినీతి మయమైన మీ కుటుంబం అంతా జైలు కి వెళ్లడం ఖాయం” అని రాజగోపాల్‌రెడ్డి శాపనార్థాలు పెట్టారు.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి చెల్లి కవిత స్వీట్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. కవిత ట్విటర్ వార్నింగ్ ఏంటంటే…
“రాజగోపాల్ అన్న ..తొందరపడకు, మాట జారకు !!, ” 28 సార్లు ” నా పేరు చెప్పించినా… ” 28 వేల సార్లు ” నా పేరు చెప్పించినా, అబద్ధం నిజం కాదు “. కవిత పేరు ఈడీ చార్జ్‌షీట్‌లో ఉండడం బీఆర్ఎస్ నేతలకు ఇబ్బందికరంగా మారింది. సహజంగానే నెగెటివిటీకి ఎక్కువ ప్రచారం వుంటుంది. కవిత విషయంలోనూ అదే జరుగుతోంది. ఇందులో నిజానిజాల సంగతుల్ని పక్కన పెడితే, ప్రత్యర్థులకు రాజకీయ అస్త్రం దొరికినట్టైంది.