తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ సాగుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలతో తెలంగాణ రాజకీయం రోజురోజుకు హీటెక్కుతోంది. ఒకరిపై మరొకరు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ఫేస్‌లో భయం కనిపిస్తోందని అన్నారు. డ్రగ్స్‌పై సిట్ నివేదికను ఎందుకు బయట పెట్టడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. తాను తంబాకు తింటానన్న ఆధారాలు ఏమైనా ఉన్నాయా.. ఉంటే బయటపెట్టాలని బండి డిమాండ్ చేశారు. తాను ఎప్పుడు ఛాలెంజ్ చేస్తే ఇప్పుడు స్పందించడం విడ్డూరంగా ఉందన్నారు. తాను సవాల్ చేసినప్పుడు స్పందించకుండా..ఇప్పుడా మాట్లాడేది అని నిలదీశారు.
విదేశాలకు వెళ్లి కేటీఆర్ ట్రీట్మెంట్ చేయించుకొచ్చి.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. డ్రగ్స్ కేసుపై దర్యాప్తు చేయకుండా ప్రభుత్వం ఎందుకు ఆపేసిందో సమాధానం చెప్పాలని..దీని వెనక ఎవరున్నారని ప్రశ్నించారు. దమ్ముంటే సిట్ నివేదికను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఏం తప్పులేకుంటే డ్రగ్స్ కేసును ఎందుకు ఆపేశారని నిలదీశారు.
సీఎం కేసీఆర్ కుటుంబానికి నరనరాన అహంకారం ఉందని బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతల భాష చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. హైదరాబాద్, బెంగళూరు డ్రగ్స్ కేసుల్లో తాను ఎవరి పేరు చెప్పలేదన్నారు. కావాలనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.