అవతార్-2 చూసాను. మూడు గంటలకు పైగా భరించడం కష్టం. విజువల్ వండరే కానీ, కథనంలో సుదీర్ఘత. కామెరూన్ తన స్క్రీన్ ప్లే బలాన్ని విస్మరించి, కేవలం గ్రాఫిక్స్‌నే నమ్ముకున్నాడు. ఇది తీయడానికి 12 ఏళ్లు అవసరమా? అన్నట్టుంది. మామూలు సినిమా టైప్ ట్విస్ట్‌లు బోలెడున్నాయి. చివరిలో హీరో కొడుక్కి విలన్ కత్తి పెట్టి హీరోని బెదిరిస్తాడు. మన పాతకాలం రాజనాలలా ఒన్ టూ త్రీ చెబుతాడమో అని భయపడ్డా.
ఎంతటి మేధావికైనా కొంత కాలానికి శక్తి తగ్గిపోతుంది. ఏం తీసినా చూస్తారని ఆత్మవిశ్వాస అహంకారం పెరుగుతుంది. అవతార్-1 మన మీద చూపిన ప్రభావంతో ఇన్నాళ్లు ఎదురు చూసాం. తీరా చూస్తే కొత్తవి ఏమీ లేవు. గాలిలో ఎగిరే డ్రాగన్ తరహా పక్షులతో పాటు, నీటిలో తిరిగే తిమింగలాలు, చేపలు, దర్శకుడు సృష్టించిన రకరకాల ప్రాణులు అదనంగా చేరాయి. చాలా సార్లు చిన్న పిల్లల ఎనిమేషన్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది.
కామెరూన్ ప్రత్యేకత ఏమంటే కథ చెప్పే పద్ధతి. సినిమా ప్రారంభంలో మెరుపులు, షాక్‌లు వుండవు. మెల్లగా కథలోకి తీసుకెళ్తాడు. తర్వాత ఆ ప్రపంచంలో మనం చిక్కుకుపోతాం. బయటికి రాలేం. ప్రతి చిన్న పాత్రని రిజిస్టర్ చేస్తాడు. సన్నివేశాల్లోని ఎమోషన్స్‌తో పాటు దృశ్యంలోని అద్భుతం కలిసి ప్రేక్షకుని మరో లోకానికి తీసుకెళుతుంది. టైటానిక్‌లో మొదటి 15 నిమిషాలు ముసలమ్మతో ప్రారంభమై మెల్లగా టైటానిక్‌లోకి వెళుతుంది. అవతార్‌లో కూడా దురాశపరులైన కొందరు ఒక గ్రహానికి వచ్చి అక్కడి ఖనిజాన్ని దొంగలించబోతున్నారని అర్థమవుతుంది. క్లోనింగ్‌ని వివరించి మెల్లగా ప్రేక్షకున్ని తాను ఎన్నడూ చూడని జంతువులు, పక్షులు ప్రకృతి మధ్య వదులుతారు. అమాయకంగా జీవించే ఆదివాసులకి దురాశపరులకి మధ్య జరిగే యుద్ధంలో హీరో బాధితుల వైపు నిలబడి యుద్ధం చేస్తాడు.
పార్ట్-2లో మనం కొత్తగా చూసేది, తెలుసుకునేది లేదు. పార్ట్-1లో జరిగే యుద్ధం సామూహికం. మనిషికి, ప్రకృతికి మధ్య జరుగుతుంది. కానీ పార్ట్-2లో వ్యక్తిగతం. పైగా హీరో కుటుంబాన్ని రక్షించుకోడానికి దూరంగా పారిపోతాడు. అది అతని తత్వం కాదు. శత్రువు బలం తెలిసిన వాడు. తరుముతూ వస్తాడని తెలుసు. తనతో పాటు ఆశ్రయం ఇచ్చిన నీటితెగల వాళ్లందర్నీ ప్రమాదంలోకి నెట్టి యుద్ధం చేయిస్తాడు. మన తెలుగు సినిమాల్లో హీరో ఫొటో పట్టుకుని “ఇతన్ని చూసావా” అని అడిగినట్టు విలన్ వెతుకుతూ వుంటాడు. ఎమోషన్స్ రిజస్టర్ కాకపోవడమే, సినిమా బోర్ కొట్టి, మధ్యలో కునుకు తీయడానికి కారణం. రెండుమూడు కునుకులు తీసినా నష్టం లేదు. కథ అక్కడే వుంటుంది. పార్ట్-1లో గ్రహవాసులతో పాటు , మామూలు మనుషులు కూడా వుంటారు. దీంట్లో దాదాపు అందరూ గ్రహవాసులే.
డైలాగ్‌ని విని కొన్నిసార్లు హీరోని గుర్తు పట్టాల్సి వచ్చింది. టైటానిక్ హీరోయిన్ నటించిందట. ఆమె ఎక్కడుందో గుర్తు పట్టలేకపోయాను. ఈ 12 ఏళ్లలో మనం ఎన్నో విజువల్ వండర్స్ చూసేశాం. ముఖ్యంగా కరోనా తర్వాత ప్రేక్షకుడు ఎంతో ఎదిగాడు. పరిధి పెరిగింది. ఫార్ములాలతో మెప్పించడం కష్టం. 10 నిమిషాలు లాగ్ వస్తేనే ఫోన్ తీసుకుంటాడు. రెండున్నర గంటలు కుర్చీలో వుండాలంటే దర్శకుడు సర్వశక్తులూ ఒడ్డాలి. లైట్ తీసుకుంటే మునిగిపోతారు. కొమ్ములు తిరిగిన డైరెక్టర్లు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్‌కి లోనైతే ప్లాప్‌లు ఇచ్చి కనుమరుగవుతారు.
ప్రేక్షకుడికి గతం అక్కర్లేదు. చరిత్ర, బ్యాగ్రౌండ్ అక్కర్లేదు. వర్తమానమే ముఖ్యం. డబ్బులు, టైమ్ ముఖ్యం. ఒక్క తెలిసిన ముఖం లేకపోయినా, కాంతారా ఎందుకు హిట్ అయ్యిందో అర్థమైతే వచ్చే రోజుల్లో సినిమా నడక అర్థమవుతుంది.
జీఆర్ మహర్షి