సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావుపై ప్రముఖ యాంకర్, నటి అనసూయ ఫైర్ అయ్యారు. తన వస్త్రధారణపై కోట శ్రీనివాసరావు వ్యాఖ్యానించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కోట పేరు ప్రస్తావించకుండానే అనసూయ ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ అనసూయ అందంగా ఉంటారన్నారు.
ఆమె మంచి నటి అని ప్రశంసించారు. కానీ ఆమె వస్త్రధారణ అభ్యంతరకరంగా ఉంటోందన్నారు. అలాంటి డ్రెస్‌లు వేసుకోకపోయినా అనసూయను చూస్తారని కోట నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అనసూయపై కోట వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అనసూయ ఓ పోస్టు పెట్టారు. ఎవరికిష్టమైన దుస్తులు వారు ధరిస్తారని, అది వారి వ్యక్తిగతమన్నారు. ఇంకా అనేక విషయాలు ఆ పోస్టులో ఉన్నాయి.
‘నా వస్త్రధారణ గురించి ఓ సీనియర్ యాక్టర్ చేసిన కామెంట్లని ఇప్పుడే చూశా. నటుడిగా అపారమైన అనుభవం ఉన్న ఆయన అలా మాట్లాడం బాధ కలిగించింది. దుస్తులు వ్యక్తిగత అంశం. ఒక్కోసారి వృత్తిపరంగా విభిన్న దుస్తులు ధరించాల్సి ఉంటుంది. సోషల్ మీడియా అనవసరమైన విషయాల్ని హైలెట్ చేస్తోంది.
అదే మీడియా.. ఆ సీనియర్ నటుడు మద్యం సేవిస్తారని కానీ, చిరిగిన బట్టలు తొడుక్కుంటారని కానీ, ఆన్‌స్క్రీన్‌పై మహిళల్ని కించపరిచే విధంగా ప్రవర్తిస్తారని కానీ చెప్పకపోవడం ఆశ్చర్యపడాల్సిన విషయం! పెళ్లై పిల్లలున్న స్టార్హీరోలంతా హీరోయిన్లతో ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేస్తుంటే దాని గురించి ఎవరూ ప్రశ్నించరెందుకు? చొక్కా లేకుండా తమ శరీరాన్ని చూపిస్తుంటే నోరు మెదపరెందుకు?’ అని ఘూటుగా సమాధానమిచ్చారు. అనసూయ స్పందన కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం.