పద్మ-గులాబీ బంధమే వారి బ్రహ్మాస్త్రం!

రాజకీయ నాయకులు ఒక మాట చెబితే.. అది ప్రజలను నమ్మించగలగాలి. అంటే తాము చెప్పిన మాటకు ‘సపోర్టింగ్ డాక్యుమెంట్స్’ లాగా మరికొన్ని అంశాలను వారు ముందే సిద్ధం చేసుకోవాలి. అలాంటి ‘సపోర్టింగ్ డాక్యుమెంట్స్’ ఉన్నప్పుడు..…

రాజకీయ నాయకులు ఒక మాట చెబితే.. అది ప్రజలను నమ్మించగలగాలి. అంటే తాము చెప్పిన మాటకు ‘సపోర్టింగ్ డాక్యుమెంట్స్’ లాగా మరికొన్ని అంశాలను వారు ముందే సిద్ధం చేసుకోవాలి. అలాంటి ‘సపోర్టింగ్ డాక్యుమెంట్స్’ ఉన్నప్పుడు.. నిజమా? అబద్ధమా? అనే పాయింట్ తో సంబంధమే లేకుండా.. ఎన్ని నిందలైనా వేయవచ్చు. తాము ఆశించిన రాజకీయ లబ్ధిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇదే సూత్రాన్ని తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెసు పార్టీ అనుసరిస్తోంది. భారాస అనేది బిజెపికి బి టీమ్ అనే ప్రచారంతోనే.. ఈ ఎన్నికల సమరాన్ని ఎదుర్కోవాలని భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. 

ఈ మాట చాలాకాలంగా కాంగ్రెసు నాయకులు అంటూనే ఉన్నారు. తాజాగా ఏఐసీసీ సారథి మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో చేవెళ్లలో నిర్వహించిన సభలో కూడా మళ్లీ ఇదే మాట వెల్లడించారు. ఇందుకు ఆయన వాడుకున్న ‘సపోర్టింగ్ నిందలు’ కూడా చాలా ఉన్నాయి. మోడీ సర్కారును గద్దె దించడమే లక్ష్యం అని కేసీఆర్ చెబుతూ ఉంటారు. కానీ.. అదే లక్ష్యంగా జాతీయ స్థాయిలో 26 పార్టీలు ఒకే కూటమిగా ఏర్పడినప్పుడు ఆ భేటీకి కేసీఆర్ ఎందుకు రాలేదు.. అని ఖర్గే ప్రశ్నిస్తున్నారు. 

తామంతా ఏకంగా కావాలంటూ అంతకుముందు ఆయన భేటీ అయిన అనేక పార్టీలు ఆ కూటమిలో ఉన్నాయని కూడా ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా మోడీ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే.. తెరాస భారాసగా మారిందని కూడా ఆరోపించారు. బయట ఒకటి చెప్పి లోలోపల ఆయన మోడీతో దోస్తీ చేస్తున్నారని చెప్పారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను కూడా కాంగ్రెస్ తరచుగా ప్రస్తావిస్తోంది. మోడీతో కుమ్మక్కు అయినందువల్లనే కల్వకుంట్ల కవిత పై విచారణ ముందుకు సాగలేదని, కేసీఆర్ మోడీ ఎదుట సాగిలపడ్డారని ఆరోపణలు చేస్తోంది. ఈ సభలో ప్రస్తావనకు రాకపోయినప్పటికీ.. బండి సంజయ్ మార్పు కూడా.. కేసీఆర్ కు మేలు చేయడానికి బిజెపి అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం అనే ఆరోపణలున్నాయి. భారాస పట్ల అతి మెతక వైఖరితో ఉండే కిషన్ రెడ్డి చేతిలో పగ్గాలు పెట్టడం వలన.. కేసీఆర్ విజయానికి బిజెపి సహకరిస్తున్నదని కాంగ్రెసు నాయకులు అంటున్నారు.

మొత్తానికి బిజెపి-బీఆర్ఎస్ మధ్య అనుబంధం ఉన్నదనే ప్రచారాన్నే కాంగ్రెస్ బాగా నమ్ముకుంటున్నట్టు కనిపిస్తోంది. తమాషా ఏంటంటే.. బిజెపి కూడా ఇలాంటి టెక్నిక్ నే అనుసరిస్తుంటుంది. భారాస- కాంగ్రెసుల మధ్య బంధం ఉందనేది బండి సంజయ్ వంటి వారి ఆరోపణ. కాంగ్రెసులో 30 శాతం టికెట్లు కేసీఆర్ డిసైడ్ చేస్తారని, కాంగ్రెసుకు ఓటు వేసినా కూడా భారాసకు వేసినట్లేనని, కాంగ్రెసు ఎమెల్యేలు గెలిచిన తర్వాత.. భారాసలో చేరిపోతారని బిజెపి నాయకులు తరచుగా విమర్శలు చేస్తుంటారు. ఎవరి మాటలు నిజమని ప్రజలు నమ్ముతారో వేచిచూడాలి.