రాయలసీమ ప్రాంతంలో బాగా అలజడి రేపారు కొంతమంది. గత ఐదేళ్ల పాలనా కాలంలో.. కొందరు చాలా హడావుడే చేశారు. వెనుకొచ్చిన చెవుల కన్నా ముందొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా.. కొంతమంది ఫిరాయింపు నేతలు మరింత ఓవరాక్షన్ చేశారు. ఫిరాయించి మంత్రి పదవులు పొందిన ఆదినారాయణ రెడ్డి, భూమా అఖిలప్రియ, అమర్ నాథ్ రెడ్డి లాంటి వాళ్లు.. రకరకాలుగా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో చాలా సంవత్సరాల నుంచి ఉన్న వారు కూడా వీరి స్థాయిలో రచ్చలు చేయలేదు.
ఫిరాయించి మంత్రి పదవిని తీసుకుని నవ్వులపాలై, ప్రజల దృష్టిలో పలుచన అయినా.. వీళ్ల మాటలు మాత్రం కోటలు దాటేవి. ఊ అంటే జగన్ మీద విరుచుకుపడే వారు. ఇలాంటి వాళ్ల రాజకీయానికి ప్రజలే చెక్ చెప్పారు! మూకుమ్మడిగా వీళ్లను ఓడించి బుద్ది చెప్పారు. ఎంత రాజకీయ నేతలు అయినప్పటికీ మీకూ కొన్ని విలువలు ఉండాలని ప్రజలు వాత పెట్టారు. ఆ వాత తాలూకు బాధ ఎలా ఉందో కానీ.. ఇప్పుడు ఈ ఫైర్ బ్రాండ్ లు కామ్ అయిపోయారు. ఎవరూ గట్టిగా మాట్లాడటం లేదు.
అప్పుడు అవసరానికి మించి మాట్లాడటంతో ఇప్పుడు వీళ్లకు అస్సలు డైలాగులే లేకుండా పోయాయని పరిశీలకులు అంటున్నారు. ఆ మధ్య అఖిలప్రియ తనకు ఏ మాత్రం సంబంధం లేని పల్నాడుకు వెళ్లి రచ్చ చేశారు. అది కూడా మిస్ ఫైర్ అయ్యింది. చంద్రబాబు నాయుడు ఇలాంటి వారిని వాడుకునే ప్రక్రియ అది అని విశ్లేషకులు విశ్లేషించారు. ఆ తర్వాత ఆమె కూడా కామ్ అయ్యారు. ఇక అమర్ నాథ్ రెడ్డి అయితే ఎక్కడున్నారో కూడా తెలియనట్టుగా ఉంది పరిస్థితి. ఆదినారాయణ రెడ్డి సంగతి సరేసరి. ఆయన బీజేపీలోకి దూకడానికి ప్రయత్నాల్లో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదీ ఆ ఫిరాయింపు మంత్రుల పరిస్థితి.
వీరే కాదు.. తెలుగుదేశం పాత కాపులు కూడా ఇప్పుడు కామ్ గా ఉన్నారు. అప్పట్లో ఫైర్ బ్రాండ్స్ గా జగన్ మీద చెలరేగిపోయిన వాళ్లకు ఇప్పుడు నోట మాటల్లేవు. అమరావతి వ్యవహారంలో మాజీ మంత్రి పరిటాల సునీత స్పందించేశారు. అమరావతి నుంచి రాజధానిని మారిస్తే సహించలేదని ఆమె ప్రకటించారు. ఒకవైపు సీమతో ఎలాంటి సంబంధం లేదని అమరావతి గురించి ప్రజలు అనుకుంటుంటే.. పరిటాల సునీత మాత్రం ఓవర్ గా రియాక్ట్ అయిపోవడం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి.
ఆమెకు అక్కడ భారీగా ఆస్తులున్నాయని, భూములు కొన్నారని..అందుకే అలా స్పందించారనే టాక్ కూడా మొదలైంది. దీంతో ఆ తర్వాత ఆమె కూడా గప్ చుప్ అయ్యారు.