సీమ రైతులకు ప్రభుత్వం నుంచి వరస నజరానాలు!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకా మంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయనేది ఇప్పుడు సీమలో ట్రెండింగ్ టాపిక్. ఈ ఏడాది ఎన్నడూ నిండని చెరువులు నిండాయి, దశాబ్దాలుగా పారని వంకలు పారుతూ ఉన్నాయి.…

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకా మంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయనేది ఇప్పుడు సీమలో ట్రెండింగ్ టాపిక్. ఈ ఏడాది ఎన్నడూ నిండని చెరువులు నిండాయి, దశాబ్దాలుగా పారని వంకలు పారుతూ ఉన్నాయి. భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు  రైతన్నలు. ఈ వర్షాలతో ఖరీఫ్ పంటకే కాదు, అంతకు మించి రబీకి చాలా మేలు జరగబోతోందని రైతులు చెబుతున్న మాట.

ఇదే సమయంలో ప్రభుత్వం నుంచి కూడా రాయలసీమలో రైతులకు వరసగా నజరానాలు అందుతూ ఉండటం గమనార్హం. గత మూడు నెలల్లోనే రైతులకు ప్రభుత్వం నుంచి మంచి స్థాయిలో లబ్ధి కలిగింది. అందులో ముందుగా అందింది పంటల బీమా. చాలా సంవత్సరాలుగా రైతులు బీమా సొమ్ముల గురించి మరిచిపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం తర్వాత తొలి సారి ఈ ఏడాది భారీగా పంటల బీమా సొమ్ము రైతులకు అందింది.

కోల్పోయిన పంటకు గానూ నష్టపరిహారం అందింది. అది రైతులకు ఉన్న పొలం స్థాయిని బట్టి దక్కింది. గరిష్టంగా యాభై ఆరవై వేల రూపాయల పరిహారాన్ని పొందిన రైతు కుటుంబాలు  కూడా ఉన్నాయి.
ఆ తర్వాత ఇన్ పుట్ సబ్సిడీ జాబితాను వదిలారు. ఆ డబ్బులు ఇంకా రైతులకు అందలేదు. అయితే అవి కూడా మంచి స్థాయిలో ఉన్నాయి. ఒక్కో రైతు ఇరవై వేల రూపాయలకు పైగానే లబ్ధి పొందేలా ఉన్నాడు వాటితో. ఆ సంగతలా ఉంటే.. ఇంతలోనే పెట్టుబడిసాయం అందింది.

ఈ విడతగా తొమ్మిది వేల ఐదు వందల రూపాయల మేరకు రైతులకు సాయం అందింది. మరో నాలుగు వేల ఐదు వందలరూపాయల మొత్తం తర్వాతి విడతల్లో అందబోతూ ఉంది. ఏతావాతా రాయలసీమలో కనీసం ఐదెకరాల పొల ఉన్న రైతులు గత నాలుగు నెలల్లో.. నలభై నుంచి యాభై వేల రూపాయల వరకూ సాయం పొందారు, పొందుతున్నారు. మంచి వర్షాలు, ఇలాంటి సాయం రైతులకు ఉత్సాహాన్ని ఇస్తున్న అంశమే. అయితే ఇది కూడా తక్కువే.. ఇంకా  ఇవ్వాల్సింది.. అంటూ మాట్లాడే వాళ్లు లేకపోలేదు.

మనిషి ఆశకు హద్దు ఎప్పుడూ ఉండదు, ఎక్కడా ఉండదు కదా! దక్కిన దానికీ తృప్తి పడుతూ ఆనందంగా ఉండేవాళ్లూ చాలా మందే ఉన్నారు రైతుల్లో.