ఈ ‘కాంగ్రెస్ కల్చర్’ను కేసీఆర్ సహిస్తారా?

పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అనే ఒక అందమైన ముసుగు తగిలించుకుని.. నాయకుల మీద సొంత పార్టీ వారే విమర్శలు చేయడం.. ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వడం, ఒకరి మీద మరొకరు విమర్శలు కురిపించడం…

పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అనే ఒక అందమైన ముసుగు తగిలించుకుని.. నాయకుల మీద సొంత పార్టీ వారే విమర్శలు చేయడం.. ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వడం, ఒకరి మీద మరొకరు విమర్శలు కురిపించడం ఇదంతా కాంగ్రెస్ పార్టీలో సర్వసాదారణం. ఆ పార్టీ ఈ పోకడలకు ఎన్నడూ సిగ్గుపడింది కూడా లేదు. మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పుకుంటూ ఉంటుంది. 

కానీ, సాధారణంగా వ్యక్తి కేంద్రంగా ఉండే ప్రాంతీయ పార్టీల్లో ఇలాంటి ధిక్కార ధోరణులు, తిరుగుబాటు వ్యవహారాలు చాలా తక్కువగా ఉంటాయి.కేసీఆర్ వంటి మోనార్క్ నాయకుడు నాయకత్వంలో అయితే.. అసలు పార్టీ వ్యవహారాల గురించి బయట మాట్లాడడానికి నోరు మెదిపే నాయకులు కూడా మనకు కనిపించరు. కానీ.. ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి పుణ్యమా అని అలాంటి ధోరణి కనిపిస్తోంది.  

మంత్రి మల్లారెడ్డి తన ఒంటెత్తు పోకడలతో పార్టీకి నష్టం చేస్తున్నారని, అయిదుగురు భారాస ఎమ్మెల్యేలు ఉమ్మడిగా ఒక మీటింగు పెట్టుకోవడం.. మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుకోవడం ఈ పరిణామాలన్నీ ఒక ఎత్తు. ఆ మీటింగు తర్వాత.. విలేకర్లసమావేశం పెట్టి మరీ.. మల్లారెడ్డి వ్యవహారాలు పార్టీకి చేటుచేస్తున్నాయని చెప్పడం ఇంకో ఎత్తు. 

ఎమ్మెల్యేలతో మాట్లాడకుండా మంత్రి అధిష్ఠానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారనేది వారి ఆరోపణ. కార్యకర్తలకు న్యాయం జరిగేలా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి ఈ విషయం తీసుకువెళతాం అని వారు ప్రకటించడం చాలా కీలకం. అంటే ఇప్పటిదాకా వారు పార్టీ అగ్రనాయకులకు ఈ సంగతి చెప్పలేదు. 

ముందు పార్టీలో చెప్పకుండా.. డైరక్టుగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడాన్ని ఏ పార్టీ అయినా (కాంగ్రెస్ తప్ప) తీవ్రంగా పరిగణిస్తుంది. పార్టీ అధిష్ఠానం పట్ల ధిక్కారస్వరంగా భావిస్తుంది. అలాంటిది.. అసలే మోనార్క్ గా పార్టీని నడిపించే కేసీఆర్.. ఈ వైఖరిని సహిస్తారా? అనేది ఇప్పుడు అనుమానంగా ఉంది. పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడితే వెళ్లి అన్ని విషయాలు వివరిస్తాం అని కూడా వీరు అంటున్నారు. ఇది ఇంకా తీవ్రమైన మాట. బంతిని కేసీఆర్ కోర్టులోకి నెట్టేశారన్న మాట. 

కేసీఆర్ ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. ఆయన జాతీయ పార్టీని ప్రారంభించేశారు గానీ.. తొలిఅడుగులకు ఆయన అనుకున్నంత స్పందన రాలేదు. జాతీయ స్థాయిలో ఇతర పార్టీల నాయకులను కూడగట్టే ప్రయత్నాల్లో తలమునకలై ఉన్నారు. ఇలాంటి సమయంలో.. పార్టీలో ఇలాంటి లొల్లి పంచాయతీలను పట్టించుకోవడం ఎంతవరకు కుదురుతుందో చెప్పలేం. పైగా.. ఈ అయిదుగురు ఎమ్మెల్యేల స్వరం వింటోంటే.. పార్టీని వీడిపోవడానికి కూడా వీరు సిద్ధంగా ఉన్నట్లుగానే కనిపిస్తోంది. ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాతనే.. వారు ప్రెస్ మీట్ పెట్టేంత సాహసం చేసినట్టు అనుకోవాలి. 

నలుగురు ఎమ్మెల్యేలకు ఎర వేశారని.. బిజెపి మీద కేసీఆర్ నానా రభస చేస్తోంటే.. అసలు గుట్టు చప్పుడు కాకుండా.. అయిదుగురు ఎమ్మెల్యేలకు వలవేసినట్టుగా కూడా కొందరు భావిస్తున్నారు. కొన్ని వారాల వ్యవధిలోనే మరింత స్పష్టత వస్తుందని.. అయిదుగురు ఎమ్మెల్యేలు భారాసలోనే ఉంటారా? ఇంకోదారి చూసుకుంటారా? ఆ దారి ఎటువైపు? అనేది తెలియాలంటే వేచిచూడాలి.