తమిళ నాట ప్రముఖ హీరో విశాల్ ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలవనున్నారు. వీళ్లద్దరి కలయిక తీవ్ర చర్చనీయాంశమైంది. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై విశాల్ పోటీ చేస్తారని చాలా కాలంగా విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ప్రచారాన్ని విశాల్ ఇప్పటికే పలుమార్లు ఖండించారు. ఈ నేపథ్యంలో జగన్‌తో భేటీ కావాలని విశాల్ నిర్ణయించుకోవడం ఆసక్తికర పరిణామం.
వైఎస్ జగన్ అంటే తనకెంతో ఇష్టమని ఆయన చెప్పుకొచ్చారు. కానీ వైసీపీ నుంచి తాను ఎలాంటి టికెట్ ఆశించడం లేదన్నారు. జగన్‌తో భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదని విశాల్ అన్నారు. అయినప్పటికీ రాజకీయాల్లో నాయకుల మాటలకు అర్థాలే వేరు అని చెబుతుంటారు.
చంద్రబాబుపై హీరో పోటీ చేస్తే టీడీపీకి చుక్కలే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకు తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో విశేష ప్రేక్షకాదరణ వుంది. ఎన్నికల్లో ఆ ప్రభావం తప్పక చూపుతుందనే ప్రచారం జరుగుతోంది.
ఇదిలా వుండగా కుప్పంలో ఎలాగైనా చంద్రబాబును ఓడించాలని జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ భరత్‌ను జగన్ ప్రకటించారు. భరత్‌ను గెలిపిస్తే మంత్రి పదవి కూడా ఇస్తానని స్పష్టం చేశారు. భరత్‌కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.
పులివెందుల తర్వాత కుప్పాన్ని తన సొంత నియోజకవర్గంగా చూసుకుంటాననే హామీలతో అక్కడి ప్రజల అభిమానాన్ని జగన్ చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌తో విశాల్ భేటీ టీడీపీలో టెన్షన్ పుట్టిస్తోంది.