విజయవాడలో స్వర్ణప్యాలెస్ హోటల్లో నిర్వహిస్తున్న కోవిడ్-19 కేర్ సెంటర్లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించింది. కుటుంబ సభ్యులను కోల్పోయిన ఆ ఒక్కో కుటుంబానికి 50 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని అందించనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.
విజయవాడలోని రమేష్ హాస్పిటల్ కు సంబంధించిన కోవిడ్-19 కేర్ సెంటర్ ను స్వర్ణప్యాలెస్ హోటల్లో నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ హోటల్ గ్రౌండ్ ఫ్లోర్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించినట్టుగా సమాచారం. ఆ తీవ్రతతో పై ఫ్లోర్లలో కూడా మంటలు, పొగ దట్టంగా వ్యాపించినట్టుగా తెలుస్తోంది. ఈ తీవ్రతతో చికిత్స పొందుతున్న పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఏడు మంది అక్కడిక్కడే మరణించగా, ఆసుపత్రికి తరలించాకా మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ క్రమంలో ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమాచారం తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్టుగా కలెక్టర్ ఇంతియాజ్ ప్రకటించారు.