జ‌గ‌న్‌పై సీబీఐ విచార‌ణ గుట్టు ర‌ట్టు చేసిన ఆర్‌కే

ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ అలియాస్ ఆర్‌కేని త‌ప్ప‌క అభినందించాలి. ఎందుకంటే కొన్నేళ్లుగా అంద‌రి మ‌న‌సుల్లో గూడు క‌ట్టుకున్న అనుమానాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ ఓ క‌ఠోర వాస్త‌వాన్ని ప్ర‌జ‌ల‌కు చెప్పాడు కాబ‌ట్టి. మంచి ఏమిటో,…

ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ అలియాస్ ఆర్‌కేని త‌ప్ప‌క అభినందించాలి. ఎందుకంటే కొన్నేళ్లుగా అంద‌రి మ‌న‌సుల్లో గూడు క‌ట్టుకున్న అనుమానాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ ఓ క‌ఠోర వాస్త‌వాన్ని ప్ర‌జ‌ల‌కు చెప్పాడు కాబ‌ట్టి. మంచి ఏమిటో, మంచి మాటేమిటో జనానికి తెలిసే అవకాశం లేదని భర్తృహరి ఎప్పుడో చెప్పారనే విష‌యాన్ని గ‌మ‌నంలోకి పెట్టు కుని…ఆ ప‌నే తానే ఎందుకు చేయ‌కూడ‌దంటూ మ‌హా ఘ‌న‌త వ‌హించిన జ‌ర్న‌లిస్టు క‌మ్ ఓ మీడియా అధిప‌తిగా తానే నిజాల్ని నిర్భ‌యంగా చెప్పేందుకు ముందుకొచ్చాడు.

ఈ ఆదివారం ఆర్‌కే  త‌న “కొత్త‌ప‌లుకు”లో “రాష్ట్రమేగతి బాగుపడునోయ్‌!” అనే శీర్షిక‌తో రాసిన వ్యాసం అనేక ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబు లిచ్చింది. మ‌రీ ముఖ్యంగా ఈ వ్యాసంలో ఆర్‌కే ప్ర‌స్తావించి, వెల్ల‌డించిన కొన్ని న్యాయ‌ప‌ర‌మైన అభిప్రాయాల‌ను ఆధారంగా వైఎస్ జ‌గ‌న్‌పై సీబీఐ విచార‌ణ వెనుక ఉన్న గుట్టును ఆర్‌కే ప‌రోక్షంగా ర‌ట్టు చేశారు. ఇదే ఆర్‌కే గొప్ప‌ద‌నం.

రెండు మూడు రోజులుగా స‌స్పెండ్‌కు గురైన జ‌డ్జి రామ‌కృష్ణ‌, ఏపీ ఉన్న‌త విద్యా నియంత్ర‌ణ క‌మిష‌న‌ర్ చైర్మ‌న్‌,  హైకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఈశ్వ‌ర‌య్య మ‌ధ్య సంభాష‌ణ‌ను ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌, ఏబీఎన్ చాన‌ల్ చేస్తున్న హ‌డావుడి అంతా ఇంతా కాదు. ఈ ఆడియో టేపుల‌ను ఆధారంగా చేసుకుని జ‌గ‌న్ ప్ర‌భుత్వం న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను లొంగ‌దీసుకోవాల‌నే ప్ర‌య‌త్నాలు చేస్తోం ద‌ని, ఇందుకు జ‌స్టిస్ ఈశ్వ‌ర‌య్య‌ను పావుగా వాడుకుంటోంద‌ని చిత్రీక‌రించేందుకు ఎల్లో మీడియా చేస్తున్న రాద్ధాంతం చూస్తూ న‌వ్వాలో ఏడ్వాలో తెలియ‌దు.

టీడీపీ, ఎల్లో మీడియా సంయుక్తంగా ఈ ఆడియో టేపు అనే కుట్ర‌కు తెగ‌బ‌డ్డాయ‌ని స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. దీనికి ద‌ళిత  జ‌డ్జి అయిన రామ‌కృష్ణ పావుగా మారార‌ని చెప్పేందుకు ఎలాంటి అనుమానం అక్క‌ర్లేదు. అదెలాగో ఆ సంభాష‌ణ‌ల్లోని మొద‌టి రెండు మాట‌లు వింటే అర్థ‌మ‌వుతుంది.

రామ‌కృష్ణః న‌మ‌స్కారం సార్‌

ఈశ్వ‌ర‌య్యః న‌మ‌స్కారం

రామ‌కృష్ణః స‌ర్ , నేను జ‌డ్జి రామ‌కృష్ణ‌ను అంటూ ప‌రిచ‌యం చేసుకున్నాడు. దీన్ని బ‌ట్టి ఏమ‌ర్థ‌మ‌వుతుంది… జ‌స్టిస్ ఈశ్వ‌ర య్య‌కు రామ‌కృష్ణ ఫోన్ చేశాడు. ఆ త‌ర్వాత తానెవ‌రో ప‌రిచ‌యం చేసుకున్న‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఎక్క‌డైనా కుట్ర‌లు చేసేవాళ్లు ఫోన్ చేసి మాట్లాడుతారా? లేక అవ‌తలి వైపు నుంచి ఫోన్ లిప్ట్ చేయ‌డం కూడా కుట్ర అనే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటారా? ఈ మాత్రం లాజిక్‌ను టీడీపీ, ఎల్లో మీడియా మిస్ కావ‌డం వ‌ల్లే అభాసుపాల‌య్యాయి. ఓ ప‌థ‌కం ప్ర‌కారం జ‌స్టిస్ రామ‌కృష్ణ‌తో టీడీపీ, ఎల్లో మీడియా ఫోన్ చేయించి, ఆ మాట‌ల‌ను రికార్డు చేసి ఏదో ఛేదించిన‌ట్టు తెగ ఆరాట ప‌డుతున్నాయి. ఇదో విచిత్ర ప‌రిస్థితి.

ఇక ఆర్‌కే వ్యాసంలోకి వెళితే…కొన్న వాక్యాల‌ను ప‌రిశీలిద్దాం.

 “ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఎంచుకున్న మోడల్‌ అత్యంత ప్రమాదకరంగా ఉంటోంది.  ఇప్పుడు తనకు నచ్చని న్యాయ వ్యవస్థను టార్గెట్‌ చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ ఈశ్వర య్యను న్యాయవ్యవస్థపైకి ప్రయోగించడం దిగ్ర్భాంతి కలిగిస్తోంది. హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కూడా లొంగ దీసుకోవాలనుకోవడం దుస్సాహసమే అవుతుంది”

“రామకృష్ణ అనే సస్పెండయిన మేజిస్ట్రేట్‌తో జస్టిస్‌ ఈశ్వరయ్య జరిపిన సంభాషణ విస్మయం కలిగించకుండా ఎందుకుంటుంది! పబ్లిక్‌ సర్వెంట్‌గా ఉన్న ఆయన న్యాయవ్యవస్థను టార్గెట్‌గా ఎంచుకున్నారంటే అందులో తన ప్రయోజనాలకంటే ముఖ్యమంత్రి జగన్‌ ప్రయోజనాలే అధికంగా ఉండివుంటాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరితో జస్టిస్‌ ఈశ్వరయ్యకు పరిచయం కూడా ఉండివుండదు. అయినా, జస్టిస్‌ మహేశ్వరిపై తానే ఫిర్యాదు చేయించానని మొహ మాటం లేకుండా చెప్పారంటే ఇదంతా ఆయన జగన్‌ రెడ్డి కోసమే చేశారని భావించవచ్చు.

మామూలుగా అయితే ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వ ప్రమేయం లేకపోతే ఉన్నత విద్యా నియంత్రణ కమిషన్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేయవలసిందిగా జస్టిస్‌ ఈశ్వరయ్యను ఆదేశించాలి. అలా ఏమీ జరగలేదు అంటే, మొత్తం వ్యవహారంలో జగన్‌ రెడ్డి పాత్ర ఉన్నట్టేనని భావించాలి”

ఎటూ తిరిగి జ‌స్టిస్ ఈశ్వ‌ర‌య్య‌, రామ‌కృష్ణ మ‌ధ్య ఫోన్ సంభాష‌ణ‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వ మెడ‌కు చుట్టాల‌నే ఆర్‌కే ఉబలాటం ఈ వాక్యాల్లో ప్ర‌తిబింబిస్తోంది. జ‌స్టిస్ ఈశ్వ‌ర‌య్య‌ను ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌లేదు కాబ‌ట్టి…ఈ మొత్తం వ్య‌వ‌హారంలో జ‌గ‌న్‌రెడ్డి పాత్ర ఉన్న‌ట్టేన‌ని ఆర్‌కే తీర్పులిస్తున్నాడు. న్యాయ‌వ్య‌వ‌స్థ‌ల‌పైకి జ‌స్టిస్ ఈశ్వ‌ర‌య్య‌ను ఉసిగొలిపి వాటిని లొంగ‌దీసుకోవాల‌ని జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారంటూ…లేని ఉద్దేశాల‌ను, సంబంధం లేని వ్య‌వ‌హారాల‌ను జ‌గ‌న్‌కు ముడిపెట్టాల‌నే కుట్ర‌పూరిత రాత‌ల‌ను ఈ వ్యాసంలో చూడొచ్చు.

మ‌రికొన్ని ఆణిముత్యాల‌ను కూడా ఈ వ్యాసంలో చ‌దివి ప‌ర‌వ‌శించ‌వ‌చ్చు. అంతేకాదు, సీబీఐ ద‌ర్యాప్తు వెనుక చంద్ర‌బాబు పాత్ర ఏంటో కూడా ఆర్‌కే బ‌ట్ట‌బ‌య‌లు చేశాడు.

“జస్టిస్‌ ఈశ్వరయ్యకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కోపం ఉంది. నిజానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హై కోర్టు న్యాయమూర్తిగా ఆయన నియామకం జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం కూడా ఆయన పేరును సిఫారసు చేసింది. జగన్‌ రెడ్డిపై సీబీఐ దర్యాప్తు జరగడానికి కూడా జస్టిస్‌ ఈశ్వరయ్య కారణం! జగన్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిల్‌ను ఆయన ఇనిషి యేట్‌ చేశారు. ఆ తర్వాత సదరు పిల్‌ను విచారించిన ద్విసభ్య ధర్మాసనం సీబీఐ విచారణకు ఆదేశించింది”

“రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చినాక అవినీతి కేసులలో చిక్కుకుంటారు. జగన్‌ రెడ్డి వ్యవహారం ఇందుకు భిన్న మైనది. ఏ ప్రభుత్వ పదవిలో లేకుండానే ఆయన అవినీతి కేసులలో జైలుకు కూడా వెళ్లివచ్చారు”

జ‌స్టిస్ ఈశ్వ‌ర‌య్య‌ను హైకోర్టు న్యాయ‌మూర్తిగా నియ‌మించింది చంద్ర‌బాబే అని ఆర్‌కే గొప్ప‌గా చెబుతున్నాడు. అంతేకాదు, జ‌గ‌న్‌రెడ్డి ఏ ప్ర‌భుత్వంలో లేక‌పోయినా అవినీతి కేసులో జైలుకు వెళ్లి వ‌చ్చాడ‌నే నిజాన్ని చెప్పాడు. చంద్ర‌బాబు సిఫార్సు చేసిన జ‌స్టిస్ ఈశ్వ‌ర‌య్య కూడా జ‌గ‌న్‌పై సీబీఐ ద‌ర్యాప్తు చేయ‌డానికి కార‌ణ‌మ‌ని చెప్ప‌డం ద్వారా ఆర్‌కే ఉద్దేశం ఏంటి?

రామ‌కృష్ణ‌, జ‌స్టిస్ ఈశ్వ‌ర‌య్య ఫోన్ సంభాష‌ణపై విప‌రీత అర్థాలు, పెడ‌ర్థాలు  తీస్తున్న ఆర్‌కే…మ‌రి చంద్ర‌బాబు సిఫార్సు మేర‌కు హైకోర్టు జ‌డ్జిగా ఈశ్వ‌ర‌య్య వ‌చ్చాడ‌ని, జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా దాఖ‌లైన పిల్‌ను ఆ జ‌డ్జినే ఇనిషియేట్ చేశారంటూ…ఇంత వ‌ర‌కూ ఎవ‌రికీ తెలియ‌ని, ఎవ‌రూ చెప్ప‌ని నిజాలు చెప్ప‌డం ద్వారా స‌మాజానికి ఎలాంటి సందేశాన్ని పంపాల‌నుకుంటున్నారు? చ‌ంద్ర‌బాబు సిఫార్సు చేసిన న్యాయ‌మూర్తి జ‌గ‌న్‌పై సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించారంటే…నిజంగా ఏ ఉద్దేశాలు లేక‌పోయినా…జ‌నం ఎలా అర్థం చేసుకుంటారు? ఈశ్వ‌ర‌య్య‌ను హైకోర్టు జ‌డ్జిగా చంద్ర‌బాబు సిఫార్సుల మేర‌కు నియ‌మించినా, అత‌నికి ఆ కృత‌జ్ఞ‌త లేద‌ని ఆర్‌కే చెప్ప‌ద‌లుచుకున్నాడా? ఇంకా త‌న వాక్యాల‌ను ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆర్‌కేనే వివ‌రిస్తే బాగుండేది.

ఏ ప్ర‌భుత్వంలో లేని జ‌గ‌న్ జైలుకు వెళ్లాడంటున్న ఆర్‌కే…మ‌రి ఆయ‌న అవినీతి కేసుల్లో ఆయ‌న నిందితుడు ఎలా అయ్యాడు?  దాని వెనుక ప్ర‌జ‌ల అనుమానాలు నిజ‌మ‌ని న‌మ్మేలా ఆర్‌కే రాసిన విష‌యాలు బ‌లం క‌లిగిస్తున్నాయంటే కాద‌న‌గ‌ల‌రా?

జ‌స్టిస్ రామ‌కృష్ణ‌, జ‌స్టిస్ ఈశ్వ‌ర‌య్య ఫోన్ సంభాష‌ణ‌లో ఎవ‌రి పాత్ర ఏంటో తేలాలంటే హైకోర్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సీబీఐ విచార‌ణ జ‌ర‌గాల‌ని ఆర్‌కే గ‌ట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మంచిదే, ఈ డిమాండ్‌ను స్వాగ‌తించాల్సిందే. ఇదే సంద‌ర్భంలో ఏ ప్ర‌భుత్వంలో లేని జ‌గ‌న్‌పై సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించ‌డం, దానికి చంద్ర‌బాబు సిఫార్సుతో నియ‌మితులైన జ‌డ్జి చొర‌వ చూపార‌నే ఆర్‌కే రాత‌లు, త‌దిత‌ర అంశాల‌పై కూడా హైకోర్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సీబీఐ విచార‌ణ జ‌ర‌పాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

న్యాయమూర్తులను చంద్ర‌బాబు లొంగదీసుకున్నార‌నే అర్థంలో ఆర్‌కే వ్యాసం సాగింద‌నే అభిప్రాయాలు, అనుమానాలు క‌లిగితే త‌ప్పెవ‌రిది? అది న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు త‌న రాత‌ల‌తో ఆర్‌కే క‌లిగిస్తున్న చేటు కాదా? న‌్యాయ వ్య‌వ‌స్థ విశ్వ‌స‌నీయ‌త‌ను, నిష్పాక్షిక‌త‌ను దెబ్బ‌తీసేలా ఆర్‌కే రాత‌లున్నాయ‌నే అభిప్రాయాల్ని న్యాయ నిపుణులు వ్య‌క్తం చేస్తున్నారు.  ఈ విష‌యా ల‌న్నింటిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపి న్యాయ‌వ్య‌వ‌స్థ స‌చ్ఛీల‌త‌ను కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.  

లేనిపక్షంలో ఆర్‌కే ఆందోళ‌న చెందుతున్న‌ట్టు నిష్పక్షపాతంగా తీర్పులు ఇవ్వలేమని న్యాయమూర్తులు భయపడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉపేక్షిస్తే…రేపు ఇదే రీతిలో ఫ‌లానా ముఖ్య‌మంత్రి సిఫార్సు చేసిన న్యాయ‌మూర్తే, ఫ‌లానా ప్ర‌త్య‌ర్థి నాయ‌కుడిపై సీబీఐ విచార‌ణ జ‌రిగేందుకు కార‌ణ‌మ‌ని రాయ‌ర‌నే గ్యారెంటీ ఏముంది? ఆర్‌కే ఎన్ని త‌ప్పుడు రాత‌లు రాసినా…అప్పుడ‌ప్పుడు అల‌వాటుగానో, గ్ర‌హ‌పాటుగానో ఇలాంటి నిజాలు రాస్తుండ‌డం వ‌ల్లే క్ష‌మిస్తూ ఉండాలి.

రైతులు త్యాగం చేశారా.. డీల్ చేసుకున్నారా ?