ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో గంగుల బ్రదర్స్‌కు ప్రత్యేక స్థానం వుంది. గంగుల బ్రదర్స్‌లో చీలిక వచ్చింది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆళ్లగడ్డలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగులుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ ఎఫెక్ట్ నంద్యాలపై కూడా కొంత మేరకు చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలో ఇవాళ నంద్యాలలో జై గ్రేటర్ రాయలసీమ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు ఎంవీ మైసూరారెడ్డి, ఏరాసు ప్రతాప్‌రెడ్డి తదితర మాజీలంతా హాజరయ్యారు. గంగుల ప్రతాప్‌రెడ్డికి వ్యక్తిగతంగా నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో చెప్పుకోతగిన ప్రజాదరణ వుంది. ఈయన ఆళ్లగడ్డ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా, అలాగే 1991లో నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు.
అనంతరం నాటి ప్రధాని పీవీ నరసింహారావు కోసం గంగుల ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన్ను రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీ పంపింది. సుదీర్ఘ కాలం పాటు నంద్యాల పార్లమెంట్ పరిధిలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించిన నాయకుడు కావడంతో ఇప్పటికీ ప్రజల్లో పలుకుబడి వుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డలో తన తమ్ముడు గంగుల ప్రభాకర్‌రెడ్డి కుమారుడు బ్రిజేంద్రరెడ్డి గెలుపు కోసం ప్రతాప్‌రెడ్డి పని చేశారు.
ప్రస్తుతం తమ్ముడి కుటుంబంతో ఆయనకు సఖ్యత లేదు. గంగుల ప్రతాప్‌రెడ్డి కుమారుడు ఫణికృష్ణారెడ్డి రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. ఇతను కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి అల్లుడు. రానున్న ఎన్నికల్లో రాజకీయంగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఫణి ఉవ్విళ్లూరుతున్నారు.
ఈ నేపథ్యంలో తనయుడిని రాజకీయంగా సెటిల్ చేయాలనే లక్ష్యంతో ఇవాళ నంద్యాలలో గ్రేటర్ రాయలసీమ కార్యాలయాన్ని ప్రతాప్‌రెడ్డి ప్రారంభించారనే చర్చ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ఆళ్లగడ్డ నుంచి వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున తరలివెళ్లడం చర్చనీయాంశమైంది. అలాగే నంద్యాల నియోజకవర్గ పరిధిలో కూడా కొంత మంది వెళ్లినట్టు సమాచారం. గంగుల ప్రతాప్‌రెడ్డి వేరు కుంపటితో ఆళ్లగడ్డలో వైసీపీకి భారీ ఎదురు దెబ్బ తప్పదనే చర్చ నడుస్తోంది.
గంగుల ప్రతాప్‌రెడ్డి తమ్ముడు ప్రభాకర్‌రెడ్డి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ. గంగుల బ్రదర్స్ మధ్య నెలకున్న విభేదాలు వైసీపీకి నష్టం చేస్తాయనే ఆందోళన ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల్లో కనిపిస్తోంది.