ఎంజాయ్ చేయాలంటే ప్రస్తుతం దుబాయ్ కు మించిన డెస్టినేషన్ లేదు. సెలబ్రిటీల నుంచి సాధారణ పర్యాటకుల వరకు చాలామంది ఇప్పుడు దుబాయ్ వెళ్లడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పర్యాటకుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తననుతాను మార్చుకుంటోంది ఈ మహానగరం. ఇందులో భాగంగా దుబాయ్ కు ఇప్పడు మరో ఎట్రాక్షన్ యాడ్ కాబోతోంది.
ప్రపంచంలోనే తొలి సూపర్ మోడల్ రోబో కేఫ్ కు వేదికగా మారనుంది దుబాయ్. డోనా సైబర్ కేఫ్ పేరిట దుబాయ్ లో ఓ రెస్టారెంట్ ఓపెన్ అవుతోంది. వచ్చే ఏడాది దీన్ని లాంచ్ చేయాలనుకుంటున్నారు. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో ఉద్యోగులు, వెయిటర్లు ఉండరు. పూర్తిగా రోబోలతో నడిచే రెస్టారెంట్ ఇది. ప్రపంచంలో ఈ తరహా రెస్టారెంట్ ఇదొక్కటే.
హోటల్ లోకి అహ్వానించే దగ్గర్నుంచి, వంటలు వండటం, వడ్డించడం, బిల్లు అందివ్వడం, మంచి నీళ్లు ఇవ్వడం.. ఇలా సమస్తం రోబోలతోనే నడుస్తుంది ఈ హోటల్ లో. మనుషుల అవసరం లేదు కాబట్టి, ఈ కేఫ్ రోజులో 24 గంటలు పనిచేస్తుంది.
ఇందులో రోబోలన్నీ సూపర్ మోడల్స్ తరహాలో ఉంటాయి. వీటిని ప్రత్యేకంగా రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు. ఆర్డీఐ రోబోటిక్స్ సంస్థ తయారుచేసిన ఈ రోబోల్ని రోబో-సీ2గా వ్యవహరిస్తారు. వీటి చర్మం, అచ్చం మనిషి చర్మాన్ని పోలి ఉంటుంది. అత్యాధునిక సిలికాన్ స్కిన్ ను వీటికి అమర్చారు.
ఈ సూపర్ మోడల్ రోబోలకు మరో ప్రత్యేకత కూడా ఉంది. హోటల్ కు వచ్చే కస్టమర్ల హావభావాల్ని ఇవి క్యాచ్ చేస్తాయి. వాళ్లు ఏదైనా జోక్స్ వేసుకుంటే, ఈ రోబోలు కూడా నవ్వడం లేదా మరో జోక్ చెప్పడం లాంటివి చేస్తాయి. వచ్చే ఏడాది నుంచి ఈ రెస్టారెంట్ అందుబాటులోకి వస్తుంది.