గతంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల సమయంలో సీఎం జగన్ ప్రచారానికి వస్తారనుకున్నా అది సాధ్యం కాలేదు. భారీ బహిరంగ సభకు అంతా సిద్దం చేసినా, చివరి నిమిషంలో కరోనా ఆంక్షలను మీరడం భావ్యం కాదని జగన్ సభను రద్దు చేసుకున్నారు.
తన బహిరంగ సభతో కార్యకర్తల్ని, పోలీస్ యంత్రాంగాన్ని, అధికారుల్ని ఇబ్బంది పెట్టకుండా జగన్ తిరుపతి రాకుండానే ఆగిపోయారు. కానీ తిరుపతి నియోజకవర్గ ప్రజలకు లేఖలు రాసి జగన్ వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఆ ప్రయోగం పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. స్వయంగా జగనే తమను కోరారనే ఉద్దేశంతో ప్రజలంతా ఓటింగ్ కి తరలి వచ్చారు. కరోనా కారణంగా పూర్తిగా పడిపోతుందనుకున్న ఓటింగ్ శాతం మెరుగైంది. జగన్ లేఖల వల్లే అప్పుడు జనమంతా పోలింగ్ కేంద్రాలకు వచ్చారని అనుకున్నారు.
సరిగ్గా ఇప్పుడు బద్వేల్ విషయంలో కూడా అదే జరగబోతోంది. కరోనా పరిస్థితులు కాస్త మెరుగయ్యే సరికి బీజేపీ తరపున బద్వేల్ లో కేంద్ర మంత్రులు సైతం ప్రచారానికి వస్తారని అంటున్నారు. టీడీపీ బరిలో లేకపోవడంతో అక్కడ జనసేన సపోర్ట్ తో బీజేపీ సత్తా చూపిస్తామంటోంది.
లోపాయికారీగా టీడీపీ కూడా ఆ రెండు పార్టీలతో కలసి పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో వైసీపీ నేతలు కూడా సీఎం జగన్ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కానీ జగన్ మాత్రం సభ విషయంలో సుముఖంగా లేరని సమాచారం.
కంటెంట్ ఉన్నోడు లెటర్ రాస్తే చాలు..
తాను నేరుగా బహిరంగ సభకు వస్తే.. జన సమూహాల వల్ల కరోనా ప్రబలే అవకాశముందని జగన్ సభను రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నా కూడా జగన్ ఆ విషయంలో ముందడుగు వేయలేనని చెప్పేశారట.
బహిరంగ సభ బదులు.. తిరుపతిలోలాగే తన పేరుతో రాసిన లేఖలను బద్వేల్ నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి చేరవేయాలని సూచించారట జగన్. దీనికి సంబంధించి తొలుత తాను తాడేపల్లిలో సంతకం చేసిన లెటర్ విడుదల చేస్తానని, ఆ తర్వాత ఆయా లెటర్లను బద్వేల్ లో ప్రతి కుటుంబానికి పంచి పెట్టాలని నాయకులు, కార్యకర్తలకు సందేమిచ్చారు జగన్.
గత ఎన్నికల్లో బద్వేల్ లో వైసీపీకి 44 వేల మెజార్టీ వచ్చింది. ఈసారి లక్ష మెజార్టీ తగ్గకూడదని నాయకులకు టార్గెట్ పెట్టారట జగన్. టీడీపీ పోటీలో లేకపోవడం, మరోవైపు బీజేపీని ఎవరూ లెక్కలో వేసుకోకపోవడంతో వైసీపీకి లక్షకు పైగా మెజార్టీ వస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి.
జగన్ నేరుగా సభ పెట్టకుండా, జగన్ లేఖలతోనే లక్ష మెజార్టీ వచ్చిందంటే.. రేపు జగన్ నేరుగా రంగంలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రతిపక్షాలు హడలిపోయే అవకాశం ఉంది. దానికి బద్వేలు నాంది పలకబోతోంది.