హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచార పర్వంలోకి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దిగుతున్నారు. పోలింగ్ కు సమయం ఆసన్నమయ్యే సరికి కేసీఆర్ కూడా హుజూరాబాద్ లో ఓటు అడగనున్నారని సమాచారం. ఈ నెల 27 వ తేదీన హుజూరాబాద్ పరిధిలో కేసీఆర్ ప్రచారపర్వం సాగనుంది. ఇది టీఆర్ఎస్ రాజకీయంలో ఒక ఆసక్తిదాయకమైన అంశమే.
ఆది నుంచి ఉప ఎన్నికలే టీఆర్ఎస్ సత్తాకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇక టీఆర్ఎస్ అధికారాన్ని అందుకున్నాకా.. వివిధ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ భారీ మెజారిటీలు సాధించింది. ఈ మధ్య ఒకటీ రెండు ఫలితాలు టీఆర్ఎస్ ఊపు తగ్గిందనే సంకేతాలను ఇచ్చినా, కేసీఆర్ మాత్రం ఉప ఎన్నికల బాధ్యతలను హరీష్ రావుకో, కేటీఆర్ కో అప్పగించేసి, తను అటు వైపు తొంగిచూడటం లేదనే భావనను కల్పించారు. ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవడానికి తన అవసరం లేదని, తన పార్టీ నేతలే ఆ పని చేయగలరనే బలమైన భావనను కేసీఆర్ కల్పించారు.
ఈ సారి కూడా హుజూరాబాద్ కు విజయసారధులను ఆల్రెడీ కేసీఆర్ నియమించేశారు. వారు తమ పనిలో ఉన్నారు. అయితే హుజూరాబాద్ బై పోల్ కేసీఆర్ కు ఎంత ప్రతిష్టాత్మకంగా మారిందో .. ఆయనే ప్రచారానికి రానున్నారనే అంశం చాటుతూ ఉంది.
ఇన్నాళ్లూ బై పోల్స్ అంటే.. ముఖ్యమంత్రి ప్రచారం అవసరం లేదన్నట్టుగా సాగిన వ్యవహారం, కాస్తా.. ఇప్పుడు ముఖ్యమంత్రే రంగంలోకి దిగుతున్నారనే ప్రత్యేకతను సంతరించుకంటూ ఉంది.
అది కూడా పోలింగ్ కు సమయం ఆసన్నమయ్యే సరికి కేసీఆర్ ప్రచారపర్వం సాగనుంది. అలా పోలింగ్ ముందు శ్రేణులను ఉత్సాహ పరిచే ప్రయత్నం చేస్తున్నారనుకోవాలి. మరోవైపు హుజూరాబాద్ లో విజయం తమదే అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కు 13 శాతం ఓట్ల లీడ్ సాధ్యమనే తన సర్వే ఫలితాలను ఆయన తన పార్టీ శ్రేణులకు వెల్లడించారు.