బుచ్చయ్యలాగా ఆయన డ్రామాలాడాలనుకోలేదు. పిలిచి బుజ్జగిస్తే మారిపోయి మళ్లీ బాబుకి సలాం కొడదామనుకోలేదు. డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ ఫైట్ కి దిగారు. బాబుకి నేరుగానే షాకిచ్చారు. అవును.. గత కొద్ది రోజులుగా టీడీపీ నుంచి బయటకొచ్చేస్తారంటూ విజయవాడ ఎంపీ కేశినేని నాని గురించి ప్రచారం జరిగింది. ఇప్పుడా ప్రచారం నూటికి నూరుపాళ్లు నిజమయ్యేలా ఉంది.
కేశినేని భవన్ నుంచి బాబు ఫొటో పీకిపారేశారు. అంతే కాదు, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే 7 అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ ఇన్ చార్జ్ లు, ఇతర ముఖ్య నాయకులతో ఉన్న ఫ్లెక్సీని కూడా తీసి పక్కనపడేశారు.
రతన్ టాటాతో కేశినేని నాని కలసి ఉన్న ఫొటోను అక్కడ ఉంచుకున్నారు. తన సొంత నిధులతో, టాటా ట్రస్ట్ తో కలసి చేసిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలు తెలిపే పొటోలను ఉంచారు. దీంతో ఒక్కసారిగా కేశినేని భవన్ టీడీపీ ముద్ర నుంచి బయటపడినట్టయింది.
నాని చూపు.. బీజేపీ వైపు..
కేశినేని నాని టీడీపీని వీడిన తర్వాత ఏ పార్టీలో చేరతారనేదే ఇప్పుడు చర్చనీయాంశం. ఇటీవల విజయవాడలో తన కుమార్తె కేశినేని శ్వేతను కార్పొరేటర్ గా పోటీ చేయించి గెలిపించుకున్నారు నాని. అయితే ఆ తర్వాత ఆయన రాజకీయంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు, తన కుమార్తె కూడా రాజకీయాల్లో ఉండరని, సేవా కార్యక్రమాలు మాత్రం కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వ్యవహారం సద్దుమణిగినట్టే కనిపించినా తాజాగా బాబు ఫొటోలు పీకిపడేసి బాంబు పేల్చారు.
నాని బీజేపీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. సుజనా చౌదరి టీమ్ గతంలోనే టీడీపీని వీడి బీజేపీలో చేరింది. వారందరితో నానికి సత్సంబంధాలున్నాయి. అదే రూట్లో నాని కూడా బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. నాని బయటకు వెళ్లిపోతే టీడీపీకి కలిగే ఒకే ఒక్క లాభం ఏంటంటే.. బెజవాడలో పార్టీలో ఉన్న వర్గపోరు ముగిసిపోతుంది.
అయితే రాష్ట్రంలో ఇటీవల వలసలు కాస్త నెమ్మదించాయి. ఇప్పుడు నాని చూపిన బాటలో మరికొంతమంది బయటకు వెళ్లే అవకాశం కూడా ఉందనే అనుమానాలున్నాయి. అదే నిజమైతే.. నాని దెబ్బకి చంద్రబాబు అబ్బా అనాల్సిందే.