రాష్ట్రంలో నిరుద్యోగం పోగొట్టాలంటే, యువతకు ఉపాధి అవకాశాలు చూపించాలంటే కంపెనీలు విరివిగా రావాలి. అలా కంపెనీలు రావాలంటే ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో పర్యటించాలి. ఆ పర్యటనలకు కోట్లు ఖర్చు పెట్టాలి. వచ్చిన కంపెనీలతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుని, భూపందేరం జరిగి అటు పేదల పొట్టకొట్టాలి, ఇటు కంపెనీల దగ్గర లంచాలు మేయాలి. ఇదంతా జరిగితే, ఆ తర్వాత రెండు మూడేళ్లకు వందల్లోనో, వేలల్లోనో ఉద్యోగాలొస్తాయి. ఇదీ గత ప్రభుత్వం చేసిన పని. అసలు పని జరక్కపోయినా, కొసరు మీటింగ్ లతో నెట్టుకొచ్చారు.
ఇప్పుడు జగన్ హయాంలో అలాంటి రిస్క్ లేవీ లేవు. కంపెనీల ప్రాపకం కోసం ఎవరూ పాకులాడటం లేదు. అభివృద్ధి అంటే కంపెనీలతో వచ్చేది కాదు, స్థానికంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉండటమే అభివృద్ధి అంటే. అందుకే స్థానిక పాలనపై దృష్టిపెట్టిన జగన్ సచివాలయాలతో ఏకంగా లక్షా 70వేల మందికి ఉద్యోగాలిచ్చారు. ఎన్ని కంపెనీలు పెడితే, ఎన్ని వేలకోట్ల రాయితీలిస్తే ఇన్ని ఉద్యోగాలు వస్తాయి. పోనీ వచ్చినా అవి ప్రైవేట్ ఉద్యోగాలే కదా, ప్రభుత్వ రంగంలో ఇన్ని ఉద్యోగాలిచ్చిన చరిత్ర ఏ ముఖ్యమంత్రికీ లేదు.
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ముఖ్యమంత్రిని మెచ్చుకోవాల్సింది పోయి, కంపెనీలు రావడంలేదు, ఉద్యోగాలు లేవు, పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం ర్యాంకు పడిపోయింది అంటూ ఏడుస్తున్నారు యనమల రామకృష్ణుడు లాంటి నేతలు. ఉద్యోగాలు రావాలంటే, కంపెనీలే రావాలా? కేవలం కేంద్రం ప్రకటించే ఉత్తుత్తి ర్యాంకులతో సంతృప్తి పడితే కలిగే ప్రయోజనం ఏంటి? ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటే గత ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ టూర్ల కోసం వేలకోట్లు వృధాగా తగలేసేది కాదు. అలా వృథా చేయకుండానే ఇప్పుడు ఫలితం దక్కింది.
అందుకే టీడీపీ ఏడుపంతా. కనిపిస్తున్న అభివృద్ధిని, ఉద్యోగాల కల్పనను అభినందించాల్సింది పోయి, కనిపించని ర్యాంకులను అడ్డు పెట్టుకుని విమర్శలకు దిగుతోంది టీడీపీ. చంద్రబాబు చేసిన దుబారాతో దక్కిన ర్యాంకులు శాశ్వతం కాదు, జగన్ ముందుచూపుతో కల్పించిన ఉద్యోగాలే శాశ్వతం. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేని, అర్థం చేసుకున్నా అనవసర విమర్శలకు దిగుతున్న “దేశం” బ్యాచ్ ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
అభివృద్ధి ఎవరి హయాంలో జరుగుతుందో పసిగట్టారు. అందుకే జగన్ ని ఎన్నుకున్నారు, రాజన్న రాజ్యం తెచ్చుకున్నారు. దుబారాని అరికట్టారు. ఇకనైనా టీడీపీ జనాలు ఈ ర్యాంకుల ఏడుపు ఆపితే మంచిది.