“మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను వారానికోసారి కలుస్తుంది ఎవరో అందరికీ తెలుసు, సుజనా చౌదరిపై ఆయనకి అంత ప్రేమెందుకో..” అంటూ పేర్ని నానిపై ఎంపీ బాలశౌరి ఆరోపణలు చేశారు.
“నాపై ఆరోపణలు చేస్తున్న ఆ పెద్దమనిషి చంద్రబాబు స్కూల్ స్టూడెంటే..” ఇది యార్లగడ్డ వెంకట్రావు గురించి వల్లభనేని వంశీ చేసిన ఆరోపణ.
వైసీపీలో నిజంగానే కోవర్టులున్నారా..? సమయం చూసుకుని జంప్ చేయడానికి కొంతమంది రెడీగా ఉన్నారా..? బయటి వ్యక్తులెవరో చేస్తున్న ఆరోపణలు కావివి. స్వయానా సొంత పార్టీల నేతలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు.
తాడేపల్లి పంచాయితీలో ఎవరో ఒకరిని అధిష్టానం బుజ్జగించినా.. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఓసారి ఆలోచించాలి. బుజ్జగించిన వారంతా సర్దుకుపోతారని అనుకోలేం. నివురుగప్పిన నిప్పులా ఉండేవాళ్లు కొన్నాళ్ల తర్వాత మంటపెట్టక మానరు. అలాంటి వారితో వైసీపీ అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
నిఘా అత్యవసరం..
ఎన్నికలకు రెండేళ్లే సమయం ఉంది. ప్రతి నియోజకవర్గంలోనూ నాయకుల మధ్య పోటీ ఉంది. పైగా పక్క పార్టీనుంచి చేరికలు కూడా భారీగానే ఉండేట్లు ఉన్నాయి. ఈ దశలో సొంత మనుషులే చివరి నిముషంలో హ్యాండ్ ఇస్తే, పార్టీ విషయాలను పక్క పార్టీలకు చేరవేస్తే.. కచ్చితంగా కోవర్టులపై వైసీపీ ఓ కన్నేసి ఉంచాల్సిందే.
నెల్లూరులో ఆనం రామనారాయణ రెడ్డి, తన కుమార్తెను ముందుగా టీడీపీలోకి పంపించినా, విశాఖలో వాసుపల్లి గణేష్.. తనను టీడీపీలో మర్యాదగా చూసుకున్నారంటూ స్టేట్ మెంట్ ఇచ్చినా.. మంత్రి పదవులు పోయిన తర్వాత కొంతమంది మీడియాకు మొహం చాటేస్తున్నా.. ఎక్కడో ఏదో తేడాకొడుతుందనుకోవాల్సిందే.
అయితే ఇప్పటికిప్పుడు ఈ అసంతృప్తి బయటపడకపోయినా, ఎన్నికల వేళ కచ్చితంగా పార్టీనుంచి బయటకు వెళ్లేవారు ఎంతో కొంత నష్టం చేసి వెళ్తారు. అలాంటి వారందర్నీ ఓ కంట కనిపెడుతూ నాయకులు పోయినా, క్యాడర్ తరలిపోకుండా అధిష్టానం జాగ్రత్తపడాలి. కోవర్టులను లైట్ తీసుకుంటే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.