తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అసమ్మతి గళాలు వినిపిస్తున్నాయి. తాజాగా అధికార పార్టీ బీఆర్ఎస్లో ఐదుగురు ఎమ్మెల్యేలు భేటీ కావడం, మంత్రి మల్లారెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేయడం రకరకాల చర్చలకు దారి తీస్తున్నాయి. పరోక్షంగా బీజేపీకి సంకేతాలు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ వర్రెస్ బీజేపీగా రాజకీయం సాగుతోంది. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీని రోజురోజుకూ మరింత దిగజారుస్తున్నాయి.
దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్లో అసమ్మతి, అసంతృప్తి నేతలపై బీజేపీ డేగ కన్ను వేసింది. ఏ మాత్రం అవకాశం ఉన్నా… వారిని తన్నుకుపోవడానికి బీజేపీ కాచుకుని వుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మైనంపల్లి నివాసంలో కుత్బూల్లాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఉప్పల్ ఎమ్మెల్యేలు వివేక్‌గౌడ్, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, బేతి సుభాష్‌రెడ్డి భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది.
వీరిలో మెజార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారే కావడంతో, బీఆర్ఎస్లో నిబద్ధతతో వుంటారనుకోవడం భ్రమే. మళ్లీ అధికారంలోకి వస్తామనే నమ్మకం లేకపోతే… బీఆర్ఎస్లో ఒక్క నిమిషం కూడా ఉండరనే ప్రచారం జరుగుతోంది. ఇవాళ్టి సమావేశంలో మంత్రి మల్లారెడ్డి వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పదవులు, అభివృద్ధి విషయాల్లో మంత్రి మల్లారెడ్డి ఒంటెత్తు పోకడతో వ్యవహరిస్తున్నారనేది ఎమ్మెల్యేల ఆరోపణ.
స్థానికంగా తమ వాళ్లు పదవులు ఆశిస్తున్నారని, కానీ మల్లారెడ్డి అన్నీ తన నియోజకవర్గానికే తీసుకెళుతున్నారనే ఆరోపణ ఆ ఐదుగురు ఎమ్మెల్యేల నుంచి వినవస్తోంది. కుత్బుల్లాపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి తన మనిషికి కావాలని చెప్పినా, మరొకరికి ఇచ్చారని ఎమ్మెల్యే వివేక్ ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. అలాగే తనకు తెలియకుండా మిగిలిన ఎమ్మెల్యేలకు పనులు చేయవద్దని కలెక్టర్‌కు మంత్రి మల్లారెడ్డి చెప్పినట్టు ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.
తమ గోడును త్వరలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టు వారు చెప్పారు. ఇది రహస్య భేటీ కాదని, దీనికి ప్రాధాన్యం లేదని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కానీ బీఆర్ఎస్లో తాము అసంతృప్తిగా ఉన్నామనే సందేశాన్ని, సంకేతాల్ని బీజేపీకి పంపినట్టు ప్రచారం జరుగుతోంది. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ నుంచి వలసలు తప్పవనే చర్చకు తెరలేచింది.