వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ పార్టీ తరఫున పని చేసి, ముఖ్య నేతలు అనిపించుకున్న వాళ్లంతా తలా ఒక పదవిని పొందారు. 175 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేసిన వారిలో 151 మంది ఎమ్మెల్యే హోదాలను పొందారు. ఇక మిగిలిన 24 మందిలో రాజ్యసభకు నామినేట్ అయిన వాళ్లు, ఎమ్మెల్సీలుగా అవకాశాలు పొందిన వారు చాలా మంది ఉన్నారు.
ఇక జగన్ చెప్పినట్టుగా సమ్మతించి, ఎమ్మెల్యే టికెట్ ను త్యాగం చేసిన వారికి కూడా మంచి అవకాశాలే లభించాయి. ఇలాంటి వారిలో కొందరు ఎమ్మెల్సీలు అయ్యారు. మరి కొందరికి ఇటీవలి జడ్పీ ఎన్నికలు మంచి అవకాశాన్ని కల్పించాయి. ఎమ్మెల్యే టికెట్ ను త్యాగం చేసిన పలువురు జడ్పీ చైర్మన్లు అయ్యారు.
ఇక ద్వితీయ శ్రేణి నాయకత్వానికి కూడా మంచి అవకాశాలు వచ్చాయి. సహకార బ్యాంకుల చైర్మన్ పదవులు, జడ్పీటీసీ సభ్యత్వాలు, జడ్పీ చైర్మన్ పీఠాలు, మున్సిపల్ చైర్మన్ అవకాశాలు… ఇవిగాక అనేక నామినేటెడ్ పోస్టుల భర్తీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పేర్ల ముందున హోదాలు చేరాయి. అధికారాలు లభించాయి.
నామినేట్ అవుతున్న ఎమ్మెల్సీ పదవులు, రాజ్యసభ సభ్యత్వాలు, ఎన్నికయ్యే మున్సిపల్ చైర్మన్ పీఠాలు, జడ్పీ చైర్మన్ గిరీలు.. ఎంపీపీలు..ఇలా పై స్థాయి నుంచి కింద వరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకే దక్కే రాజకీయ పరిస్థితి ఉంది. దీంతో.. వాళ్లూ, వీళ్లు అనే తేడాల్లేకుండా కాస్తో కూస్తో పేరున్న నేతలు కూడా ఏదో ఒక హోదాను దక్కించుకుంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా.. ఇంకా పదవేదీ పొందని నేత ఒకరు కనిపిస్తూ ఉన్నారు. ఆయనే ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి.
గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి, ఓడిన వారిలో విశ్వేశ్వరరెడ్డి ఒకరు. 2014 ఎన్నికల్లో నెగ్గిన విశ్వేశ్వరరెడ్డి, 2019లో మాత్రం ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం నేత పయ్యావుల కేశవ్ ఉరవకొండలో గత ఎన్నికల్లో నెగ్గారు. విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిగా అయితే కొనసాగుతూ ఉన్నారు. పార్టీ తరఫున యాక్టివ్ గానే ఉన్నారు. అయితే ఆయనకు మరే నామినేటెడ్ పదవీ దక్కపోవడం గమనార్హం.
అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరు నేతలు మాత్రమే ఓడిపోయారు. వారిలో ఒకరు హిందూపురం నుంచి పోటీ చేసిన ఇక్బాల్. ఆయనకు ఎన్నికలు అయిపోయిన రెండో నెలలోనే ఎమ్మెల్సీ అవకాశం లభించింది. అయితే పార్టీ తరఫున చాలా కాలం నుంచి పని చేస్తూ వస్తున్న విశ్వేశ్వరరెడ్డికి మాత్రం ఎన్నికలైపోయి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. నామినేటెడ్ పోస్టు ఏదీ దక్కలేదు. ఇప్పటికే విశ్వేశ్వరరెడ్డికి జగన్ ఎప్పుడో ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాల్సింది అనేది సహజంగా వినిపించేమాట.
నిరాడంబరుడు, ఆర్థికంగా సామాన్యుడు, ఎలాంటి అవినీతి మచ్చా లేని వాడు, పార్టీ కోసం తెగింపుతో పని చేసే వ్యక్తి అయిన విశ్వేశ్వరరెడ్డికి ఇప్పటి వరకూ ఎమ్మెల్సీ అవకాశం దక్కపోవడం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఆలోచించుకోవాల్సిన అంశం. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండగా.. కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆ పార్టీ అధికారంలోకి రాగానే.. ఏదో ఒక నామినేటెడ్ పోస్టును పట్టారు.
అలాంటిది జగన్ వెంట ఆది నుంచి నడుస్తూ, ఎలాంటి కుటిల రాజకీయానికీ పాల్పడిన చరిత్ర లేని విశ్వేశ్వరరెడ్డి కి ఇప్పటి వరకూ ఎమ్మెల్సీ పదవి దక్కలేదు. మరి ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తిస్తోందో లేదో. త్వరలోనే ఆ పార్టీకి మరిన్ని ఎమ్మెల్సీ పదవులు దక్కడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. మరి ఆ జాబితాలో విశ్వేశ్వరరెడ్డి ఉండబోతున్నారేమో చూడాలి!