బద్వేల్ ఉప ఎన్నిక ప్రచారం స్తబ్ధుగా సాగుతూ ఉంది. ఈ ఉప ఎన్నిక పోరు నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకోవడంతో కాస్తో కూస్తో వేడివేడిగా జరిగే ఎన్నిక కూడా స్తబ్దుగా మారింది. ఓటమి భయంతోనే తెలుగుదేశం పార్టీ బద్వేల్ పోరు నుంచి తప్పుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బాహాటంగానే అంటున్నారు.
టీడీపీ కూడా త్యాగం అని అంటున్నా దాన్ని ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు. ఉప ఎన్నిక ఖరారు కాగానే త్యాగం ప్రకటనను చేసి ఉంటే టీడీపీ దానికో విలువను కలిగి ఉండేది. అయితే అభ్యర్థిని ప్రకటించి, ఒకటికి రెండు సార్లు పోటీలో ఉన్నట్టుగా ప్రకటించి, ఆఖర్లో తప్పుకోవడం మాత్రం టీడీపీది ఓటమి భయమే అని స్పష్టం అవుతోంది.
ఇక జనసేన కూడా ఈ పోటీకి దూరంగా తుర్రుమంది. అదేమంటే మానవీయ కోణం అని అంటోంది. మరోవైపు బరిలో ఉన్న బీజేపీకి జనసేన మద్దతుఉన్నట్టే అనే టాక్ కూడా నడుస్తూ ఉంది. ఆఖరి నిమిషంలో పవన్ కల్యాణ్ అక్కడ ప్రచారం చేసినా పెద్ద ఆశ్చర్యం లేదు. జనసేన పయనం అంత కంగాళీగా ఉంది.
ఇక బద్వేల్ బరిలో కాంగ్రెస్, బీజేపీలు, మరి కొన్ని చోటామోటా పార్టీలు, ఒకిరద్దరు ఇండిపెండెంట్లు నిలిచారు. వీరిలో ఎవరూ సీరియస్ కంటెండర్లు లేనట్టే. కాంగ్రెస్ కు అయినా, బీజేపీ అయినా బద్వేల్ లో డిపాజిట్ ను రాబట్టుకుంటే అదే గొప్ప విజయం అవుతుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఎంత సాధిస్తుందనేది చర్చనీయాంశం అవుతోంది.
ప్రధాన పార్టీలు పోటీలో లేకపోవడంతో అధికార పార్టీ హార్డ్ కోర్ అభిమానులు కూడా గట్టిగా కదిలి ఓటేసే పరిస్థితి కనిపించడం లేదు. పోటీ గట్టిగా ఉన్నప్పుడే.. ఓటింగ్ శాతం పెరుగుతుంది. తాము గెలిపించాలనుకునే వాళ్ల కోసం ఓటర్లు బూత్ లకు దండెత్తుతారు.
ఎప్పుడైతే పోటీ నామమాత్రం అవుతుందో, విజయం ఏకపక్షంగా అనిపిస్తుందో.. అప్పుడు.. పోలింగ్ శాతం, మెజారిటీ లెక్కలూ ఇవన్నీ తగ్గిపోయే అవకాశాలున్నాయి. అయితే బీజేపీ, కాంగ్రెస్ లను ప్రజలు ఏ మాత్రం ఖాతరు చేసే పరిస్థితి లేకపోవడంతో పోల్ అయ్యే ఓట్లలో చాలా ఎక్కువ శాతమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడే పరిస్థితి మాత్రం స్పష్టంగా గోచరిస్తోంది.