ఏవోబీ…. మావోలు… ?

మావోయిస్ట్ ఉద్యమానికి గట్టి దెబ్బ తగిలింది. నాలుగు దశాబ్దాలుగా అన్నీ తానై వ్యవహరిస్తూ వస్తున్న ఆర్కే అలియాస్ అక్కిరాజు హరగోపాల్ తాజాగా మరణించడం మావోలకు కోలుకోలేని నష్టమే అంటున్నారు. ముఖ్యంగా ఏవోబీ ప్రాంతంలోని మావోలకు…

మావోయిస్ట్ ఉద్యమానికి గట్టి దెబ్బ తగిలింది. నాలుగు దశాబ్దాలుగా అన్నీ తానై వ్యవహరిస్తూ వస్తున్న ఆర్కే అలియాస్ అక్కిరాజు హరగోపాల్ తాజాగా మరణించడం మావోలకు కోలుకోలేని నష్టమే అంటున్నారు. ముఖ్యంగా ఏవోబీ ప్రాంతంలోని మావోలకు నైతికంగా కృంగిపోయే పరిణామంగా చూస్తున్నారు.

ఆర్కే వ్యూహాలతో ఇంతకాలం దూకుడు చేసిన మావోలకు ఆయన అనారోగ్యం పాలు కావడం విషాదమైతే ఇపుడు ఆయన లేకపోవడం భారీ లోటు అంటున్నారు. ఇక చూస్తే గత కొంతకాలంగా ఏవోబీలో మావోలకు అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయని అంటున్నారు. పోలీసులు సైతం వారి మీద పై చేయి సాధించడానికి తమ పట్టుకుని పెంచుకుంటున్న నేపధ్యం ఉంది.

ఇదిలా ఉంటే ఆర్కే మరణం తరువాత మావోలు పెద్ద సంఖ్యలో జన జీవన స్రవంతి వైపుగా వస్తారని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కొర్ర కుమారి అలియాస్ శ్వేత అనే మావోయిస్ట్ నాయకురాలు పోలీసులకు లొగింపోయారు. ఆమె గత పన్నెండేళ్ళుగా మావోల ఉద్యమంలో ఉన్నారు. గాలికొండ దళంలో మిలీషియన్ సభ్యురాలిగా ఉన్న ఆమె మీద ఎన్నో కేసులు రివార్డులు ఉన్నాయి.

ఆమె లొంగుబాటు నేపధ్యంలో విశాఖ జిల్లా పోలీసులు మావోలకు మళ్ళీ పిలుపు ఇచ్చారు. జన జీవన స్రవంతిలోకి మావోలు వస్తే వారిని అన్ని రకాలుగా ఆదరిస్తామని కూడా చెప్పుకున్నారు. విశాఖ జిల్లా ఎస్పీ బి క్రిష్ణారావు మాట్లాడుతూ మావోలు సమాజంలోకి తిరిగి రావాలని, వారి సేవలను, శక్తియుక్తులను సమాజ అభివృద్ధికి ఉపయోగించి శాంతియుత వాతావరణానికి దోహపడాలని కోరారు. 

మొత్తం మీద చూసుకుంటే ఏవోబీలో మునుపటిలా మావోలు దూకుడు చేయగలరా అన్న సందేహాలు అయితే ఉన్నాయి. అదే సమయంలో మావోలు కూడా మరింత శక్తిని కూడదీసుకుని ముందుకు వస్తారని కూడా సానుభూతిపరుల నుంచి వస్తున్న మాట. ప్రస్తుతానికైతే ఏవోబీ లో ఒక భయంకర నిశ్శబ్దం తాండవిస్తోంది.