ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని లాజిక్ లు మాట్లాడినా మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పోటీ వెనుక మెగాస్టార్ లేదా మెగా క్యాంప్ వుందన్న ప్రచారం మిన్నూ మన్నూ ఏకం చేస్తూ సాగింది. దానికి ససాక్ష్యంగా మిగిలింది మెగాస్టార్ సోదరుడు నాగబాబు అప్రస్తుత ప్రసంగం. మొత్తానికి ఎన్నికలు జరిగాయి. విష్ణు వర్గం గెలిచింది. అక్కడితో ఆగిపోతుంది అనుకున్నారు అంతా.
కానీ ఆగలేదు. తను రాజీనామా చేసారు. తనతో గెలిచిన వారినందరినీ రాజీనామా చేయించారు. మా ఎన్నికల మీద కోర్టుకు కూడా వెళ్తారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రకాష్ రాజ్ ను ఇంతో అంతో సమర్థించిన వారు కూడా ఇప్పుడు ఆయన తీరు సరికాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కన్నడ రంగం నుంచి వచ్చారు. మా సంఘ నిబంధనలకు ప్రకారం పోటీ చేసారు. ఓడి పోయారు. అక్కడితో ఊరుకోకుండా తెగేవరకు లాగడం, మా పరువు తీసి బజార్నపెట్టే ప్రయత్నం సరికాదనే కామెంట్లు ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ కూడా వినిపిస్తోంది. మా ఎన్నికల అనంతరం జరుగుతున్న పరిణామాలు ఏవీ మెగాస్టార్ కు తెలియనివి, నచ్చనివి అనే టాక్ వినిపిస్తోంది.
ఎన్నికల అనంతరం ప్రకాష్ రాజ్ తన స్వంత నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారని తెలుస్తోంది. మెగావర్గం ఓపెన్ గా తనకు మద్దతు ప్రకటించకుండా, తన కోసం బాహాటంగా పోరాడకుండా, తనను బలి పశువును చేసిందనే ఆవేదనలో ఆయన వున్నారని టాక్. అందుకే ఆయన తన ప్లానింగ్ ప్రకారం తాను ముందుకు వెళ్తున్నారని తెలుస్తోంది.
ఎలాగూ తను గెలవలేదు. వచ్చే ఎన్నికల వేళకు గెలిచే అవకాశం ఇవ్వరు. ఇక అలాంటపుడు ఎందుకు వదిలేయాలి. ఎంత రచ్చ అయితే అంతా చేసేయడమే అనే భావజాలంతో ముందుకు వెళ్తున్నారని కామెంట్లు ఇండస్ట్రీ సర్కిల్ లో వినిపిస్తున్నాయి.
ఇక యాగీ వద్దు, సైలంట్ అయిపోమను అంటూ మెగాస్టార్ తన సోదరుడు నాగబాబు ద్వారా పంపిన సందేశాన్ని ప్రకాష్ రాజ్ పక్కన పెట్టారని కూడా గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. ఇంకో స్టెప్ కనుక ప్రకాష్ రాజ్ ముందుకు వెళ్తే ఈ గ్యాసిప్ లే నిజమని నమ్మాల్సి వస్తుంది.