మైనంపల్లి: వేదాంతి, ప్రవచనకర్త అవతారం!

ఆయన ఆర్థికంగా పుష్కలమైన వనరులు ఉన్న సీనియర్ రాజకీయ నాయకుడు. విస్తృతంగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నిత్యం ప్రజల్లో ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండే వ్యక్తి. ఆ సేవలకు ప్రతిఫలంగా తనకు…

ఆయన ఆర్థికంగా పుష్కలమైన వనరులు ఉన్న సీనియర్ రాజకీయ నాయకుడు. విస్తృతంగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నిత్యం ప్రజల్లో ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండే వ్యక్తి. ఆ సేవలకు ప్రతిఫలంగా తనకు రాజకీయ పదవులను కూడా కోరుకునే వ్యక్తి. ఆయన ఇప్పుడు హఠాత్తుగా వేదాంతి, ప్రవచనకర్త అవతారం ఎత్తారు. 

బహుశా తన మనసులో పార్టీ ఫిరాయింపునకు సంబంధించి, ఇప్పటికే డిసైడ్ అయ్యారేమో తెలియదు గానీ.. అందుకు తన అభిమానులను, ప్రజలను కన్విన్స్ చేయడానికి, తాత్విక ధోరణిలో ప్రవచనాలు చెబుతున్నారు. ఆయనే.. ప్రస్తుతం మల్కాజిగిరి ఎమ్మెల్యేగా ఉన్న, భారాసలో మళ్లీ టికెట్ దక్కినప్పటికీ కూడా తిరుగుబాటు జెండా ఎగరేసిన మైనంపల్లి హన్మంతరావు.

నా రాజకీయ జీవితం కంటె నా కొడుకు రాజకీయ జీవితం నాకు ముఖ్యం అని మైనంపల్లి హన్మంతరావు గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు కూడా నా కంటె నా కొడుకు ఎక్కువగా ప్రజా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.. అని కూడా వెల్లడిస్తున్నారు. ఇలాంటి మాటలతో ఆయన తన కొడుకును మెదక్ ఎమ్మెల్యేగా చూసుకోవాలని అనుకుంటున్నారు. కొడుకు రోహిత్ ను మెదక్ నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దించడం అనేది ఖరారు చేసేశారు.

పార్టీ ఫిరాయింపు దగ్గరే ఆయన మనోభిప్రాయం ఇంకా బయటకు రాలేదు. వారం రోజుల పాటు నియోజకవర్గాల్లో ముమ్మరంగా తిరుగుతానని, తనను అభిమానించే పార్టీ కార్యకర్తలు అందరితో భేటీ అవుతానని, అందరి అభిప్రాయాలు తీసుకుంటానని.. వారి సూచనల మేరకు తన భవిష్యత్ ప్రస్థానం ఏమిటో వారం తర్వాత ప్రకటిస్తానని మైనంపల్లి అంటున్నారు. అదే సమయంలో తాను ఎన్నడూ భారాసను, భాజపాను, కాంగ్రెసును కూడా తిట్టలేదని చెబుతున్నారు. వారందరూ కలిసి పోరాడితేనే తెలంగాణ కల సాకారం అయిందని కూడా అంటున్నారు. ఆ రకంగా.. ఆయన కాంగ్రెసు, భాజపాలలో ఏ పార్టీలోకి వెళ్లబోతున్నారనే సంకేతాలు కూడా ఇవ్వడం లేదు.

కాకపోతే.. ఇప్పుడు పార్టీ మారడం గురించి.. ఆయన ఓ అద్భుతమైన మాట చెప్పారు. స్థిరంగా ఉండకుండా పార్టీ మారడం గురించి తనను ఎవ్వరూ విమర్శించకుండా ఆయన ఈ మాట చెప్పినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే.. గతంలో ఎనిమిదేళ్ల పాటు మెదక్ జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. తర్వాత భారాసలోకి వచ్చారు. ఇప్పుడు కూడా వేరే పార్టీలోకి మారుతారనే ప్రచారం ఉంది. 

ఈ నేపథ్యంలో ఆయన ‘‘జీవితంలో స్థిరపడడం అంటూ ఉండదు. చనిపోయిన తర్వాతే జీవితంలో స్థిరపడినట్టు’’ అంటూ తాత్వికమైన మాటలలో తన అభిప్రాయం వెల్లడించారు. దీంతో ఆయన పార్టీ మార్పు గ్యారంటీ అని మాత్రం అర్థమవుతోంది.